CM Chandrababu| సీఎం చంద్రబాబు రాకతో మురిసిన నేమకల్లు
x

CM Chandrababu| సీఎం చంద్రబాబు రాకతో మురిసిన నేమకల్లు

ఆ వీధుల్లో చంద్రబాబు స్వేచ్ఛ తిరిగారు. కొన్ని గంటలు ఆ గ్రామ ప్రజల మధ్యే గడిపారు. సమస్యలు విన్నారు. పరిష్కరించారు.


చెప్పినట్లే ఎలాంటి హంగు ఆర్భాటం లేదు. ఆ పల్లెలో స్వాగత తోరణాలు కనిపించలేదు. అలంకరణ అంతకంటే లేదు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులును వెంట తీసుకున్న సీఎం చంద్రబాబు వీధుల్లో స్వేచ్ఛగా తిరిగారు. ప్రతి గడప వద్ద తనకోసం ఎదురుచూస్తున్న వారిని పలకరించారు. దీంతో నేమకల్లు ఇందిరమ్మ కాలనీ ప్రజలు మురిసిపోయారు.


అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లులో సీఎం ఎన్ చంద్రబాబు శనివారం పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా కింద లబ్ధిదారులకు స్వయంగా ఆయన పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో పాటు వారి కుటుంబీకుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా తమ ఇంటికి రావడంతో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు అందుకున్న పాల్తూరు రుద్రమ్మ ఆనందం వ్యక్తం చేసింది. ఆ తర్వాత బోయ ముక్కన్న ఇంటి కి వెళ్ళారు. ఆయన భార్య బోయ భాగ్యమ్మకు ఎన్టీఆర్ భరోసా కింద పదివేల రూపాయల వికలాంగుల పింఛన్ స్వయంగా సీఎం చంద్రబాబు అందించారు. ఈ ఇంట్లో ఆసక్తికర సన్నివేశం
చోటు చేసుకుంది.
షుగర్ వేశారబ్బా..

బోయ ముక్కన్న ఇంటిలోకి వెళ్లగానే ఆ కుటుంబీకులు సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు. రెండు కాళ్లు చచ్చుబడిన భాగ్యమ్మతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారిని పరామర్శించి తిరిగి వెళ్ళే సమయంలో, కుటుంబంలోని ఓ వ్యక్తి సారు పిలవగానే గడప వద్దకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చి మంచంపై కూర్చున్నారు.
వారి ఇంట్లో తయారుచేసిన కాఫీ కప్పులను భాగ్యముతో పాటు వారి తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అందించారు. ఏ మాత్రం భేషజం లేకుండా కాఫీ రుచి చూచిన సీఎం చంద్రబాబు వంటగది నుంచి వస్తున్న విప్ కాలువ శ్రీనివాసులును ఉద్దేశించి
"ఏమబ్బా కాఫీలో షుగర్ వేశారా" అని అడగగానే, భాగ్యమ్మ కుటుంబంలో నవ్వులు చిందించారు.
అక్కడికక్కడే సాయం మంజూరు
నడవలేని స్థితిలో ఉన్నభాగ్యమ్మ చెప్పిన మాటలు విని సీఎం చంద్రబాబు చలించారు. "సార్ మా తమ్ముడికి గుండె జబ్బు ఉంది. బెంగళూరులో చికిత్స చేయించాం. నాకు వచ్చే పింఛన్ నా తమ్ముడి వైద్యం కోసం అందించాను" అని బోయ భాగ్యమ్మ చెప్పగానే సీఎం చంద్రబాబు స్పందించారు. అక్కడే ఉన్న కలెక్టర్ వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు భాగ్యమ్మ స్థితిని వివరించారు.
ఆమె తమ్ముడికి బెంగళూరులో చికిత్స చేయించిన మెడికల్ రిపోర్టులు చంద్రబాబు పరిశీలించారు. "ఆ వెంటనే ఆ నివేదికలపై రెండు లక్షల రూపాయలు మంజూరు" చేస్తూ, సంతకం చేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తు తర్వాత ఇవ్వండి. అని సూచించిన సీఎం చంద్రబాబు, నగదు చెక్కు తీసుకోవడానికి కుటుంబం లోని ఎవరో ఒకరు గ్రామసభ వద్దకు రమ్మని ఆహ్వానించారు. సమస్య చెప్పిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించడంపై బాధిత కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
వీధుల్లో సందడి...

సీఎం చంద్రబాబును అనుసరిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది. ఆయన వెంట రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. కాస్త దూరంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు అనుసరించారు. నేమకల్లు వీధిలో సీఎం చంద్రబాబును స్వాగతిస్తూ ప్రతి ఇంటి వద్ద ప్రజలు పలకరించారు.

వారందరికీ గడపగడపన వెళ్లిన చంద్రబాబు కుశల ప్రశ్న వేశారు. వారి సమస్యలు కూడా ఆలకించారు. చాలా ఇళ్ల వద్ద ప్రహరీగోడల వద్ద నిలబడి సెల్ఫీ తీయడానికి ఇబ్బంది పడుతుండడం గమనించిన సీఎం చంద్రబాబు, వీధిలోనే నిలబడి వారికి సహకరించారు.
వీధిలోకి వచ్చిన మహిళలు తనతో ఫోటోలు తీసుకోవడానికి కూడా సీఎం చంద్రబాబు అనుమతించారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థినులను పలకరించి, చదువు సాగుతున్న పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని ఉన్నత చదువుల్లో రాణించాలని ఓ పాఠం చెప్పారు.

ఆలయంలో పూజలు
నేమకల్లు గ్రామంలోకి రాగానే, ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సీఎం జవాబు సందర్శించారు. ఆలయంలో పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. హారతి తీసుకున్న తర్వాత కానుకలను సమర్పించిన చంద్రబాబు మొక్కు చెల్లించారు. సీఎం చంద్రబాబుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అంటే ఎక్కువ అభిమానం ఉన్న సీఎం చంద్రబాబు తన పర్యటనలో దాదాపు ఐదు గంటల పాటు గ్రామానికి పరిమితమయ్యారు. తన పర్యటన కోసం ఎంపిక చేసిన నేమకల్లు గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించడానికి సీఎం చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది.
Read More
Next Story