
నెల్లూరు నగరంలో రౌడీలను రోడ్లపై నడిపిస్తున్న పోలీసులు
'జూలు విదిల్చిన సింహం'పురి పోలీస్.. రౌడీషీటర్ల ఊరేగింపు
యాక్షన్ లోకి దిగిన నెల్లూరులో పోలీసులు.
రాయలసీమకు చిటికెన వేలు లాంటిది నెల్లూరు జిల్లా. దీనికి సింహపురి అని కూడా పేరుంది. ప్రశాంతకు మారుపేరుగా ఉన్న నెల్లూరులో గాంజా విక్రయాలు, అక్రమ రవాణా. సెటిల్మెంట్లు కాదంటే కిరాయి హత్యలు. రౌడీరాజ్యానికి నెల్లూరు నగరం అడ్డాగా మారింది.
నెల్లూరులో సీపీఎం (CPi- M) ) ప్రజానాట్య మండలి యువ కళాకారుడు పెంచలయ్య రెండు రోజుల కిందట హత్యకు గురయ్యారు. గాంజా విక్రేతల యువకుల ముఠా దాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడిన సంఘటనతో పోలీసులు సీరియస్ అయ్యారు.
నెల్లూరు నగరం, రూరల్ మండలంలోని ఐదు పోలీస్ సర్కిళ్ల పరిధిలో రికార్డుల్లో ఉన్న సుమారు 45 మంది రౌడీషీటర్లను ప్రధానరోడ్లలో సోమవారం ఊరేగించారు. నెల్లూరు VRC సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు రౌడీ షీటర్లను తేలికపాటి వర్షం కురుస్తుండగా, బురదనీటిలోనే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పోలీసులు నడిపించారు.
నెల్లూరు చరిత్రలో పోలీసులు ఇంతగా సీరియస్ గా తీసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ రౌడీల ప్రదర్శన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
రౌడీలకు కేరాఫ్ గా నెల్లూరు..
నెల్లూరు జిల్లా నుంచి నేరప్రవృత్తిని ఎంచుకున్న యువకులు పొరుగు జిల్లాల్లో సుపారీ హత్యలకు కూడా పాల్పడ్డారు. అందుకు నిదర్శనం ఒంగోలు లో వీరయ్య చౌదరి హత్య కేసును ఉదహరించవచ్చు. రౌడీషీటర్ శ్రీకాంత్ ఇతని ప్రియురాలు నిడిగుంట అరుణ సాగించిన కలాపాలు లేడీడాన్ గా మారారు. తాజాగా..
నెల్లూరు నగరంలో ఆర్డీటీ కాలనీలో గాంజా మత్తుకు గురి కావద్దని సీపీఎం ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య జనాలను చైతన్యం చేస్తున్నారు. తమ కలాపాలకు అడ్డుగా ఉన్నారనే ఆగ్రహంతో గాంజా విక్రయించే ముఠాకు నాయకురాలిగా మారిన అరవ కామాక్షి కన్నెర్ర చేసింది. తన ముఠాలోని పది మంది యువకులతో పెంచలయ్యను హత్య చేయించిందని పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ముఠాలతో నెల్లూరు రౌడీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
"పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల దగ్గరి నుంచి ఏడు కత్తులు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో 14 మంది నిందితులు ఉన్నారు" అని డీఎస్సీ శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. ఆ ముఠా సభ్యులను పట్టకునే యత్నంలో జేమ్స్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆదినారాయణ గాయపడ్డారు.
యాక్షన్ లోకి దిగిన పోలీసులు
నెల్లూరు నగరంలోని ఐదు పోలీసు సర్కిళ్ల పరిధిలో పదే పదే నేరాలు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. తమ రికార్డుల్లో ఉన్నవారిలో సుమారు 50 మంది రౌడీషీటర్లను వారి ఇళ్లకు పోలీసులను పంపించడం ద్వారా పిలిపించారు. అందరినీ ఒక చోటకు చేర్చిన పోలీసులు చెప్పులు కూడా తీసి వేయించారు. వారిలో కొందరు అయ్యప్పమాల ధరించి ఉన్నా, పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు.
నెల్లూరు ఒకటో పట్టణ సీఐ కోటేశ్వరరావు, ఐదో పట్టణ సీఐ వెంకటేశ్వరరావు, ఆరో పట్టణ సీఐ సాంబశివరావు తమ సిబ్బందితో ముందు సాగుతున్నారు. వెనుక రెండు వరుసల్లో పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా ముద్రపడిన యువకులు రోడ్డుపై నడిపించారు.
నెల్లూరు నగరంలో వీఆర్సీ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ రౌడీల ప్రదర్శన గాంధీబొమ్మ వరకు సాగింది. ముందు సీఐలు నిలబడితే, రౌడీషీటర్లకు ఇరు పక్కలా యూనిఫాం, సివిల్ దుస్తుల్లోని పోలీసులు నడిపించారు.
ఇదే చర్చ..
అసాంఘిక కలాపాల నేపథ్యంలో నెల్లూరు నగరానికి ఉన్న ప్రతిష్ఠ మసకబారినట్లు చాలా మంది మథనపడుతున్నారు. పోలీసులు మొదటిసారి రౌడీషీటర్లను రోడ్డుపై నడిపించడం పట్టణ ప్రజలు, దుకాణదారులు ఆశ్చర్యంగా చూస్తూ సాగారు. చేతులు కట్టుకుని కొందరు, కుంటుతూ ఇంకొందరు నడుస్తుండడం గమనించిన చాలా మంది తమ ప్రాంతంలో వారి చేష్టలు గుర్తుకు చేసుకున్నారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి.
"నగరంలో ఇంకెవరైనా తప్పులు చేయేడం కాదు. ఆ ఆలోచన కూడా రాకుండా చేయాలి" అనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
"పోలీసు యాక్షన్ లో ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఇకపై నగరంలో నేరాలు చేయాలని భావించినా, కత్తి పట్టాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించుకునేలా నేరగాళ్లపై ఉక్కు పాదం మోపుతాం" అని పోలీసు చర్యలు ఉండబోతాయనే సంకేతం ఇచ్చారు.
Next Story

