నెల్లూరు: యూనిఫాం లేదని ఇంతా శిక్షా..
x
నెల్లూరు జిల్లాో కోట మండల కేంద్రంలో సొమ్మసిల్లిన హాస్టల్ విద్యార్థినులు

నెల్లూరు: యూనిఫాం లేదని ఇంతా శిక్షా..

గుంజీలు తీయలేక ఎస్సీ హాస్టల్ లో సొమ్మసిల్లిన బాలికలు.


యూనిఫాం ధరించని పాపానికి ఎస్సీ హాస్టల్ విద్యార్థినులకు పెద్దశిక్ష పడింది. ఓ పీఈటీ విధించిన శిక్షకు హాస్టల్ విద్యార్థినులు విలవిలలాడారు. గుంజీలు తీయలేక తల్లిడిల్లారు. సొమ్మసిల్లి పడిపోయిన బాలికలను చేతులపై మోసుకుంటూ వెళ్లారు. కొందరిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజవకవర్గం కోట మండలం జరిగింది. ఈ సంఘటనపై జిల్లా అధికారులు సీరియస్ గా స్పందించారు.

గూడూరు ఎస్సీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అంటే ఇంకొద్ది సేపటిలో హాస్టల్ ను సందర్శించనున్నట్లు సమాచారం తెలిసింది.
విద్యార్థినులకు గుంజీలు శిక్ష వేసిన పీఈటీ మాస్టర్ పై చట్టప్రకారం కేసు కూడా నమోదు చేయనున్నట్లు కోట సీఐ హుస్సేన్ బాషా తెలిపారు.
బాలికలనే విషయం కూడా మరిచిన పీఈటీ మాస్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాలురతో పోలిస్తే, శారీరకంగా బాలికలకు కొన్న సమస్యలు ఉంటాయి. సున్నితంగా ఉన్న వారిని ఇంతలా శిక్షిస్తారా? అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటకుండా, చర్యలు తీసకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన పీఈటీపై చర్యలకు సిద్ధం అవుతున్నారు.
ఈ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం కోట మండల కేంద్రంలో ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ లోని 60 మంది విద్యార్థినులు స్థానిక జెడ్పీ హైస్కూలో చదువుకుంటున్నారు. శనివారం విద్యార్థినుల్లో కొందరు యూరిఫాం ధరించకుండా వచ్చారని పీఈటీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి ఇలా వ్యవహరించకుండా ఉండాలంటే.. 100 గుంజీలు తీయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుడు చెప్పాడు. చేయకతప్పదని విద్యార్థినులు గుంజీలు తీయడం ప్రారంభించారు కొంతసేపటికి ఆయాసంతో రొప్పుతూ పడిపోయినా, పీఈటీ మాస్టర్ లో చలనం లేదని తెలిసింది. బాలికలు గుంజీలు తీస్తూనే సొమ్మసిల్లి పడిపోవడంతో పాఠశాలలో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం బయటికి తెలియడంతో హస్టల్ విద్యార్థినుల తల్లిదండ్రులు భారీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. బాలికలు అస్వస్థతకు గురికావడంతో మిగతా విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వారితో మాట్లాడిన డీఎస్పీ గీతాకుమారి సముదాయించారు.

ఉద్రిక్తత
తమ పిల్లలకు ఈ శిక్ష వేయడం ఏమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీయడంతో కోట వద్ద ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే అస్వస్థతకు గురైన బాలికలు సేదదీరడానికి ఫ్యాన్లు ఏర్పాటు చేసి, కొలుకునేందుకు నానా యాతన పడ్డారు. తీవ్రంగా అలసిపోయి, సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి నులను ఆస్పత్రులకు కూడా తరలించినట్లు సమాచారం అందింది.
ఈ సంఘటన సమాచారం తెలియగానే గూడూరు డీఎస్సీ గీతాకుమారి, వాకాడు సీఐ హుస్సేన్ బాషా, ఎస్ఐ పవన్ తో కలిసి హాస్టల్ వద్దకు చేరుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికలను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

జరిగిన సంఘటనపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి, మిగతా విద్యార్థినుల నుంచి హాస్టలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్తాప్తులోకి దిగిన పోలీసులు పీఈటీతో పాటు ఇంకొందరిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కోట సీఐ హుస్సేన్ బాషా 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ..
"సంఘటన జరిగిన వెంటనే డీఎస్పీ గీతాకుమారి హాస్టల్ లో విద్యార్థినులతో మాట్లాడారు. బాలికల ఆరోగ్యం కుదుటపడడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం" అని సీఐ హుస్సేన్ బాషా తెలిపారు. చట్టప్రకారం బాధ్యుడైన పీఈటీపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు.
Read More
Next Story