నెల్లూరు:బడుగులపై బుల్డోజర్..   విలవిలలాడిన నిమ్మ తోటలు
x
సైదాపురం వద్ద నిమ్మ తోటలను పెకిలిస్తున్న జేసీబీ

నెల్లూరు:బడుగులపై బుల్డోజర్.. విలవిలలాడిన నిమ్మ తోటలు

నిర్థాక్షిణ్యంగా కూల్చివేశారంటున్న దళిత, బీసీ మహిళా రైతులు.


నిమ్మ తోటలు విలవిలలాడాయి. పేద మహిళా రైతులు కాళ్లావేళ్ల పడి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారు.

రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పొరంబోకు స్థలంలో పట్టాలు ఇవ్వడం కుదరదని 20 ఏళ్ల తరువాత రెవెన్యూ అధికారులు కొత్తభాష్యం చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రానికి సమీపంలో శనివారం దళితి, గిరిజన, బీసీ మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
"20 ఏళ్లుగా బిడ్డాల్లా పెంచిన నిమ్మ తోటలను నిర్దాక్షిణ్యంగా కూలదోశారు" అని బాధిత మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.
పట్టాలు ఇవ్వడానికి వారు అనర్హులు. రెండు కిలోమీటర్ల దూరంలో వారు సాగు చేసిన భూములు ప్రభుత్వానివి" అని సైదాపురం తహసీల్దార్ సుభద్ర చెబుతున్నారు.
"రెవెన్యూ అధికారుల ఆదేశాలతో బందోబస్తు ఏర్పాటు చేశాం" అని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపల్లెకు సమీపంలో 793 సర్వే నంబర్ లో 114 ఎకరాల కొండపొరంబోకు భూములు ఉన్నాయి. అందులో అక్కడి గ్రామంలోని గిరిజనుుల, ఎస్సీలు, బీసీ రైతులు దాదాపు 40 ఎకరాలు ముళ్లపొదలు, రాళ్లు చదును చేసుకున్నారు. వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇదంతా దాదాపు 20 ఏళ్ల కిందట జరిగింది. ఆ భూముల్లో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలు నిమ్మ తోటలు సాగు చేశారు. కాయలు కూడా కోతకు వచ్చాయి. వ్యవసాయ బోర్లు లేని స్థితిలో బిందెలు, ట్యాంకర్లతో నీరు పోసి నిమ్మ తోటలు సాగు చేశామని అనుభవదారులు చెబుతున్నారు.

బిందెలతో నీళ్లు పోసి, నిమ్మ తోట సాగు చేసుకున్నాం. మా కష్టం ఇలా తీరిపోయిందని పల్లేటి కృష్ణమ్మ తన గోడు వెళ్లబోసుకుంది. 20 ఏళ్లగా బిడ్డల్లా పెంచుకుంటే, గ్రామంలోని వాళ్లు నోటీసులు పంపించి, మా బతుకులు దెబ్బతీశారని క‌ష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

పట్టాల కోసం ప్రయత్నం..
దాదాపు రెండు దశాబ్దాలుగా కమ్మవారిపల్లెకు సమీపంలో కొండపొరంబోకు స్థలాలను చదును చేసుకుంటున్నా, ఎవరూ నోరు మెదపలేదు. నిమ్మ తోటలు సాకులోకి రావడంతో గ్రామంలోని పెత్తందార్ల కన్ను పడినట్లు ఉంది. ఆ భూములు సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేయడంతో నిమ్మ తోటలు సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన బయలు దేరింది.
నిబంధనలు అంగీకరించవు..
పట్టాలు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన తురగ మస్తానయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. " విషయాన్ని తహసీల్దార్ సుభద్ర 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని ఆమె తెలిపారు. గ్రామంలో పరిస్థితిని రెవెన్యూ ఉన్నతాధికారులు గతంలో సమీక్షించారని కూడా చెప్పారు.
"ప్రభుత్వ కొండపొరంబోకు భూమిలో సాగుదారులకు పట్టాలు ఇవ్వడానికి నిబంధనలు అనుమతించలేదు" అని తహసీల్దార్ సుభద్ర వివరించారు.
"కొండపొరంబోకును చదును చేసి, సాగు చేసిన తోటలు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందువల్ల వారికి పట్టాల మంజూరుకు చట్టం ఒప్పుకోదు" అని తహసీల్దార్ స్పష్టం చేశారు.
గ్రామానికి సమీపంలో ఉన్నారు కదా అని ప్రశ్నిస్తే, ఆమె నుంచి సమాధానం లేదు.
అధికారుల ఆదేశాలతోనే నిమ్మ తోటలు కూల్చాల్సి వచ్చిందని మాత్రమే ఆమె చెప్పారు.
"ఆ నిమ్మ చెట్లు తొమ్మిదేళ్ల వయసే" ఉద్యానవన శాఖాధికారి కూడా నిర్ధారించారని తహసీల్దార్ సుభద్ర అంటున్నారు.
నాయుడు పెత్తనమే..

మాకు ఉన్నా ఆధారం కూడా లేకుండా చేశారని బాధిత మహిళ యాటగిరి రమణమ్మ ఆవేదన చెందారు. గ్రామంలోని పల్లేటి వెంకటేశ్వర్లు, చౌదరి అనే వారి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన చెందారు. మా బతుకుపై నిప్పులు పోశారని ఈవేదన చెందారు.
వారి తిరుగుబాటు, కన్నీటి వేదన ఏమిటో ఈ వీడియోలో చూడండి.

Read More
Next Story