Nelloore | మళ్లీ చెలరేగిన కత్తి రౌడీలు... పట్టపగలే స్వైరవిహారం..
x

Nelloore | మళ్లీ చెలరేగిన కత్తి రౌడీలు... పట్టపగలే స్వైరవిహారం..

దాడిలో ఇద్దరికి గాయాలు. నగరంలో మళ్లీ కలకలం.


ఉలిక్కిపడిన నెల్లూరు, చాలని సింహపురి పోలీసుల యాక్షన్.

ప్రశాంత నెల్లూరు నగరం రౌడీలకు అడ్డాగా మారింది. పోలీసుల చర్యలు సరిపోలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. రోడ్డుపై అడ్డుగా నిలిపిన బైక్ పక్కకు తీయమని కోరిన పాపానికి డ్రైవర్, కండక్టర్ పై ఐదుగురు యువకుల గ్యాంగ్ బ్లేడ్లతో చెలరేగారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరు నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటనతో నెల్లూరు నగరం మరోసారి ఉలిక్కిపడింది.

నెల్లూరు నగరంలో సీపీఎం ప్రజానాట్య మండలి కాళాకారుడు పెంచలయ్య హత్య తరువాత పోలీసులు జూలు విదిల్చారు. పెంచలయ్యను హత్య చేసిని గంజాయి బ్యాచ్ లోని యువకులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడ్డారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు కూడా గాయపడిన విషయం తెలిసిందే..
రోడ్డుపై రౌడీల పరేడ్...

ఈ సంవత్సరంలో నెల్లూరు నగరంలో హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్య తరువాత కిరాయి హత్యలు చేసే ముఠా వ్యవహారం వెలుగు చూసింది. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో రౌడీషీటర్ తో అరుణ అనే మహిళ రాసలీల వ్యవహారంతో సుపారీ హత్యలు, గంజాయి సరఫరా డాన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. సీపీఎం నేత హత్య ద్వారా గంజాయి విక్రయాల్లో డాన్ గా మారిన మహిళా కస్తూరి అరాచకాలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు సామాజిక శిక్షను అమలు చేశాయి. నెల్లూరు నగరం రూరల్ మండల పరిధిలోని దాదాపు 45 మంది రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించారు. వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు రౌడీషీటర్లను కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, వర్షం కురుస్తున్నా రోడ్డుపై నడిపిస్తూ, నిర్వహించిన ప్రదర్శన చూసి నగర ప్రజలు నోరెళ్లబెట్టారు. మొదటిసారి పోలీసులు విధించిన ఈ తరహా శిక్ష వల్ల రౌడీలు తోకముడుస్తారని అందరూ భావించారు.
బ్లేడుతో దాడిలో ఇద్దరికి గాయాలు..

నెల్లూరు నగరంలో పోలీసులు అమలు చేసిన సామాజిక శిక్ష ప్రభావం రౌడీషీటర్లే కాదు. దాడులు చేయాలనే వారిని కూడా ఏమాత్రం భయపెట్టలేదనేందుకు ఆదివారం జరిగిన సంఘటన నిదర్శనంగా కనిపిస్తోంది.
బైక్ పక్కకు తీయమన్నాడనీ..
నెల్లూరు నగరంలో ఆదివారం ఓ ప్రైవేటు టౌన్ బస్సు యథావిధిగానే ప్రయాణికులతో బయలుదేరింది. పట్టణంలోని నక్కలోళ్ల సెంటర్, బోసు బొమ్మ మధ్య బస్సు ప్రయాణిస్తుండగా, ట్రంక్ రోడ్డులో పల్సర్ బైక్ ను యువకులు బస్సుకు అడ్డంగా నిలిపారు. పక్కకు తీయమని డ్రయివర్ చెప్పగానే, బైక్ ఉన్న యువకుడు, ఇంకొందరిని పోగేశాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో బస్సు డ్రైవర్, కండక్టర్ పై దాడి చేశారు. గొంతు తోపాటు ముఖంపై ఇస్టానుసారంగా కొట్టడంతో రక్తస్రావం అవుతున్న వారిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు సిబ్బందిపై దాడి చేసిన అనంతరం ఐదుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయాని తెలిసింది.
ఆస్పత్రికి తరలింపు..
యువకులు దాడిలో గాయపడిన బస్సు డ్రైవర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన మన్సూర్, కండక్టర్ ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలీంగా గుర్తించారు.
"బస్సు ఆపగానే దాడికి దిగారు. మా ఇద్దరిపై ఐదుగురు యువకులు దాడి చేశారు. రక్తం కారుతున్నా, వదలలేదు. స్థానికులు పోగయ్యే లోపల పారిపోయారు" అని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మన్సూర్ మీడియాకు వివరించారు. వారంతా పల్సర్ బైకుల్లో వచ్చారని ఆయన చెబుతున్నారు. రోడ్డపై బైకు అడ్డుగా ఉంచారని, పక్కకు తప్పించమని కోరినందుకే దాడి చేశారని మన్సూర్ వివరించారు.
నెల్లూరు నగరంలో బోసు బొమ్మ సర్కిల్ రావడానికి ముందే సైడ్ ఇవ్వలేదని డ్రైవర్ పై యువకులు దాడికి దిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం. ఈ ఘటనపై సంతపేట పోలీసులు దర్యాప్తులోకి దిగారు. దాడికి పాల్పడిన యువకుల కోసం గాలింపు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More
Next Story