మావోయిస్టు అగ్రనేత ఛత్తీస్ ఘడ్ ఒడిశా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో రామచంద్రారెడ్డిగారి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి ప్రాణాలు కోల్పోయారు. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లె. ఈయన పెద్దన్న శ్రీరాములు రెడ్డి చనిపోయారు. రెండు అన్న చంద్రశేఖరరెడ్డి మదనపల్లెలో నివాసం ఉంటారు. మూడో వ్యక్తి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి.
ఈయన మరణించారనే విషయం మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పైపల్లె గ్రామం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
పచ్చదనంతో ఆహ్లాదంగా ఉన్న పైపల్లెలో సాాధారణ రోజులకు భిన్నంగా జనసంచారం కనిపించలేదు. ఈ విషయాన్ని ఆ ప్రాంత మీడియా ప్రతినిధులు కూాడా చెప్పారు. ఇళ్ల నుంచి బయటికి వచ్చిన వారు తక్కువ. కనిపించిన వారిని ఏమి అడిగినా మీకు తెలియదు అనేదే సమాధానం. అలా సాగుతూనే చలపతి రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లే సరికి చలపతిరెడ్డి పెద్దన్న శ్రీరాములురెడ్డి భార్య కుమారికి వయసుమీద పడడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు.
ప్రతాపరెడ్డి మరణం ఎలా తెలిసిందని అడిగితే.. నిన్న టీవీల్లో చూశాం. పేపర్లలో వచ్చిన కథనాలు చూశాం. అనేది కుమారి మాట. 35 ఏళ్ల కిందట వెళ్లిపోయాడు. విజయనగరంలో ఉద్యోగం చేసేటప్పుడు ఒకసారి వచ్చాడు. మళ్లీ రాలేదు. ఫోన్ చేసినప్పుడు ప్రతాపా... మామిడికాయలు కోతుకు వచ్చాయి. రాబ్బా.. అని పిలిచా. కాపు అంతా అయినాక చెబుతాండావు అక్కా ఇంకోసారి వస్తాలే అన్నాడు. అని కుమారి కొన్నేళ్ళ నాటి మాటను గుర్తు చేసుకుంటుండగా, కళ్ల నుంచి నీటి చుక్కలు జలజలా రాలాయి.
ప్రతి సంవత్సరం మామిడికాపు వస్తావుండాది. పోతా ఉండాది. మా ప్రతాప్ మాత్రం రాలేదు. ఇంక రాడేమో అని గుడ్లనీరు కక్కుకుంటూ, కుమారి కుమిలిపోయింది. ప్రతాప్ నన్ను వదినా పిలిచింది లేదు. చిన్నప్పటి నుంచి అక్కా అని పిలవడమే అలవాటు. అని కుమారి అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ, మౌనంగా ఉండి పోయింది. ఆమె మాటలతో వారి ఇంటివద్ద శ్మశాన నిశ్శబ్ధం రాజ్యమేలింది.
మావోయిస్టు అగ్రనేత ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి స్వగ్రామం తవణంపల్లి సమీపంలోని మత్యం పైపల్లె గ్రామంలో పరిస్థితి తెలుసుకునేందుకు తిరుపతి నుంచి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధులు వెళ్లారు. తిరుపతి చిత్తూరు జాతీయ రహదారిలో గంట ప్రయాణం తరువాత పూతలపట్టుకు మూడు కిలోమీటర్లకు ముందే సర్వీస్ రోడ్డులోకి మళ్లితే.. కాణిపాకం వరకు సింగిల్ రోడ్డులో ప్రయాణం. రోడ్డుకు ఇరుపక్కలా కళకళలాడుతున్నవరి, చెరుకు, మామిడి తోటలు విస్తారంగా కనిపించాయి. వాటికి కనుచూపు మేరలోనే ఆకాశాన్ని తాకే ఎత్తులో గుట్టలు, రాళ్లు. అలా సాగిన ప్రయాణం కాణిపాకం ఆలయానికి వెళ్లడానిక ముందే ప్రధాన రోడ్డులో ఆర్చి వద్ద వాహనం ఆపాం. ఒకరు ఖాకీ చొక్కా ధరించారు. మరొకరు సాధారణ వ్యక్తి. ఇద్దరు సామాన్యులే.
అన్నా... తవణంపల్లెకు వెళ్లాలి.. మార్గం ఏదంటే.. నేరుగా వెళ్లండి. అనేది వారి సమాధానం.
అక్కడి నుంచి మత్యం పైపల్లెకు ఎలా?
ఓ అదా.. నేరుగా వెళితే క్రాస్ రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్లి, ఎడమపక్కకు తిరిగితే. ఆ ఊరికి వెళ్లవచ్చు అని మార్గం చెప్పారు.
వెంటనే నేను... అన్నా అక్కడ నక్సలైట్ చలపతి ఇల్లు అనగానే వారి మొఖంలో ఒక్కసారిగా మెరుపు కనిపించింది. అంతలోనే తమాయించుకుని ఏమోన్నా.. మాకు తెలియదు. అనేది వారి సమాధానం. నాతో పాటు ఉన్న సహకర ప్రతినిధితో కలిసి ప్రయాణం సాగింది.
తవణంపల్లెకు వెళ్లగానే క్రాస్ రోడ్డు కనిపించినా, ముందుకు వెళ్లగానే ముగ్గురు ప్రెస్ స్కిక్కర్లు వేసుకుని బైక్ లపై కూర్చుని మాటల్లో ఉన్నారు. మనజాతి పక్షులే కాదా అని. నేరుగా నక్సల్ చలపతి ఇంటి కోసం వాకబు చేయగానే..
అదోన్నా.. వెనక్కి పది అడుగులు వేస్తే కనిపిస్తాండ్ల క్రాస్ రోడ్డు అని చెప్పడమే కాదు. మా వెనుక అనుసరిస్తూ, వచ్చిన ఆ జర్నలిస్టు బైక్ ముందుకు వెళ్లి మార్గం చూపించారు.
నిజంగా మీరు నమ్మరు. ఆ ప్రాంతం చిత్తూరు జిల్లాలో ఉందంటే.. సింగిల్ రోడ్డు ఇరుపక్కల పొలాలు పచ్చగా ఉన్నాయి. దారి వెంబడి పెద్ద మిద్దెలు, ఇళ్ల వద్ద వ్యవసాయ యంత్రాలు, కార్లు, ట్రాక్టర్లు కనిపించాయి. మలుపుల దారిలో అరగంట ప్రయాణించాక మత్యం గ్రామం వచ్చింది. అక్కడ రోడ్డు పక్కనే పెద్ద చర్చి, ఆ తరువాత రాములవారి ఆలయం. వీధులకు రెండు పక్కలా అధునాతన భవంతులు.
నిజంగానే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నామా? అనిపించింది.
అలా.. రెండు కిలోమీటర్లు ప్రయాణించగానే పైపల్లెకు చేరుకున్నాం. అదే నక్సల్ చలపతిరెడ్డి ఊరు. రోడ్డు పక్కనే పంచాయతీ సచివాలయం. ఎదురుగా వీధి నుంచి రెండు నిమిషాలు నడిస్తే, కుడిపక్కకు తిరగ్గానే చలపతి రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాం.
సాధారణంగా పల్లెల్లో అమ్మలక్కల మాటలు. పిల్లల సందడి ఉంటుంది. మేము వెళ్లే సరికి వీధులన్నీ బోసిపోయి ఉన్నాయి. ఏ ఇంటి తలుపు కూడా తెరిచి లేదు.
ఆ తరువాత తెలిసింది. చలపతిరెడ్డి మరణవార్త తెలిసిన తరువాత గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడిందని.
గ్రామానికి చుట్టూ కూడా పొలాలు అనేక రకాల పంటలతో కళకళలాడుతున్నాయి. దూరంగా రాళ్లతో నిండిన గుట్టలు కూడా పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ఆ పరిసరాలు గమనిస్తూ, చలపతి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లగానే పెద్దగేటు మూసి ఉండడం కనిపించింది.
చిన్నపాటి ఇంటి ముందు వేసిన రేకుల షెడ్డు కింద గేదెలు మేత మేస్తూ కనిపించాయి. అక్కడే ఎర్ర చీర ధరించిన ఓ పెద్దావిడ మంచంపై కూర్చుని ఉన్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఓ మీడియా ప్రతినిధి ఎర్రచీర ధరించిన పెద్ద మహిళ, ఆమెకు దగ్గర ఉన్నఓ యువతి కూడా ఎర్రరంగు డ్రస్ ధరించి కనిపించారు.
సాయుధ బలగాల దాడిలో కురిసిన తూటాలకు ఛత్తీస్ ఘఢ్ నక్సలైట్లు ప్రాణం వదిలారు. వారి రక్తంతో అటవీప్రాంతం ఎర్రబారినట్టే కనిపించింది. వారికి లాల్ సలాం చెబుతున్నట్లుగా చలపతి వదిన కుమారి, మనవరాలు మౌనిక ఎర్రటి దుస్తులే ధరించి కనిపించారు. ఇది యాధృశ్ఛికంగా జరిగిందే కావచ్చు. అయినా, ఎర్రరంగు ప్రత్యేకత కనిపించింది.
"దగ్గరికి వెళ్లి పలకరించగానే..
ఎక్కడి నుంచి వచ్చారు నాయన?
మంచినీళ్లు తాగుతారా?
చానా దూరం ప్రయాణించి వచ్చినట్టున్నారు" అని మావోయిస్టు చలపతిరెడ్డి వదిన (అన్న భార్య) కుమారి మమ్మల్ని పరామర్శించినట్లు మాటలు వినగానే మాటలు రాలేదు.
మావోయిస్టు చలపతి ప్రస్తావన తీసుకురాగానే..
నిన్న ఉదయం టీవీలో చూశాను నాయనా. చాలా బాధ అనిపించింది అంటూ ఉండగానే కుమారి కళ్ళలో నుంచి నీళ్లు జరజలారాలాయి.
ప్రతాప్ .. నన్ను వదిన అని కాదు. అక్కా అని పిలుస్తాడు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు. కుటుంబాన్ని చూసుకుంటా అన్నాడు. ఈ భూమి మీద లేకుండా పోయాడని చెబుతున్నారు. అని మాటలు రాకుండా మౌనంగా ఉండిపోయారు.
చిన్నప్పటి నుంచి చదువులో మంచి జ్ఞానం ఉంది. చురుకుగా ఉండేవాడు.
మదనపల్లి, తిరుపతిలో చదువుకున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగం వచ్చిన తర్వాత, విజయనగరం వెళ్ళాడు. ఆ తర్వాతే ప్రతాప్ లో మార్పు వచ్చింది. అని ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అన్న భార్య కుమారి వివరించారు.
అక్కడ ఉద్యోగం చేసేటప్పుడే విప్లవ సాహిత్యం తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రతాప్ ను నేను అడిగాను. ఈ పుస్తకాలు ఎందుకు మనకు అని.
దానికి ప్రతాప్ చెప్పిన సమాధానం ఒకటే. ఇందులో మంచి విషయాలు ఉన్నాయి. చదవాలి పేదల కోసం పనిచేయాలి అని చెప్పేవాడు. పేదల కోసం పని చేయాలంటే ఇంటి వద్ద ఉండి అదే పని చేయమని చెప్పాము మా మాట వినలేదు. అని కుమారి వివరించారు.
మటల్లో తెలిసింది. కుమారిది చిత్తూరు వద్ద కట్టమంచి. ఆమె పదో తరగతి చదువుకున్నారు. అందువల్లే విప్లవ సాహిత్యంపై ఆమెకు అవగాహన ఉందనే విషయం.
విజయనగరం నుంచి ఒకటి రెండుసార్లు వచ్చాడు. అప్పుడు కూడా చెప్పి చూశాం. మాట వినలేదు. లేదక్కా.. అక్కడ పేదోళ్లు చాలా కష్టాల్లో ఉన్నారు. వారికోసం పనిచేయడంలో ఆనందం ఉందని చలపతి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు.
పేదల కోసం ఇక్కడ కూడా పనిచేయవచ్చు. వ్యవసాయం చూసుకో. పాడి ఆవులు ఉన్నాయి. అని కూడా చెప్పినా వినలేదు.
చాలా ఏళ్ల కింద ఒకసారి అట్టా అయిన వస్తాడని అనుకుని ప్రతాప్.. మామిడికాయలు కోతకు వస్తున్నాయి. రాబ్బా. తిందువు అని పిలచా.
అక్కా... సీజన్ అంతా అయిపోయినాక పిలుస్తాండావు. ఈసారి వస్తాలే అన్నాడు.
అవే మా ప్రతాప్ తో మాట్లాడిన చివరిసారి మాటలు అని కుమారి కన్నీటి పర్యంతం అయ్యారు.
కుమారి నుంచి వీడ్కోలు తీసుకుంటూ ఉంటే... నాయనా.. ఒకసారి ఇలా రా.. పిలవడంతో నేను వెనక్కి వెళ్లక తప్పలేదు.
ఇంటిలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్లిన ఆమె కళ్లలో నుంచి వస్తున్న నీటి చుక్కలు చెంగుతో తుడుచుకుంటూ బయటికి వచ్చింది.
చేతిలో చిన్న పుస్లకాలు ఉన్నాయి. శివసందేశం అని ముద్రించిన బుక్ లెట్ ఇచ్చిన ఆమె.. మీ స్నేహితులకు ఇవ్వండి అందరికీ మంచి జరుగుతుంది. అని సెలవు తీసుకున్నారు.
కాసేపటికి ఉదయకుమార్ రెడ్డి వచ్చి, పరిచయం చేసుకున్నారు. ఈయన నక్సల్ ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి పెద్దన్న శ్రీరాములురెడ్డి కొడుకు.
ఇప్పుడే వస్తా అని ఎటో పోయాడు..
"విజయనగరంలో పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగానికి వెళ్లిన మా బాబాయ్ ప్రతాప్ రెడ్డి (చలపతి) చిన్నప్పుడే చూశాను. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ. ఎందుకంటే ఆయన మాతో ఉన్న రోజులు చాలా తక్కువ" అని ఉదయకుమార్ రెడ్డి చెప్పారు.
"ఒకసారి మా చిన్నాన్న చంద్రశేఖరరెడ్డి మదనపల్లెలో ఉంటారు. పట్టుపరిశ్రమలో రిటైర్డ్ అయ్యారు. విజయవనగరంలో వెళ్లి మా బాబాయ్ ప్రతాప్ రెడ్డిని కలిశారు. ఇక నీకు ఇక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి పోదాం పద అని వెంట తీసుకుని బయలురారు" అని ఉదయకుమార్ రెడ్డి వివరించారు. "చంద్రశేఖరరెడ్డితో కలిసి రైల్వే స్టేషన్ వరకు వచ్చిన ప్రతాప్ రెడ్డి (చలపతి) ఇప్పుడే వస్తా ఉండు" అని చెప్పి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి, మళ్లీ కనిపించలేదు" అని ఉదయ్ చెప్పారు.
ఇదంతా సుమారు 30 ఏళ్ల కిందట జరిగింది. అని ఆనాటి రోజులను ఉదయకుమార్ రెడ్డి గుర్తు చేసుకుంటూ, భోరున విలపించారు.
"మానాన్న (శ్రీరాములు రెడ్డి )చనిపోయిన తరువాత కుటుంబ బాధ్యత చూసుకుంటా అని కూడా బాబాయ్ ప్రతాపరెడ్డి చెప్పారు. నేను చిన్నతనంలో ఉండడం వల్ల చలపతితో సాన్నిహిత్యం తక్కువే" అని మధుసూదన్ తీవ్ర వేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం వద్దు. ఇంటివద్దే ఉందువు రా. అని రెండుసార్లు నా భర్త శ్రీరాములు రెడ్డి (ఈయన చలపతి పెద్ద అన్న. ఇప్పుడు లేడు చనిపోయాడు.) వెళ్లి పిలిచినా రాలేదు. పెళ్లి చేసి, ఇంటి వద్దే ఉంచుకుందాం అనేది మా ఆశ. ప్రతాప్ మనసు మారలేదు. అని కుమారి కూడా చెప్పిన మాట.
చదువుకునే రోజుల్లో ప్రతాప్ రెడ్డి (చలపతిరెడ్డి) రెడ్డి చురుగ్గా ఉండడమే కాదు. తెలివివంతుడు కూడా అని వారు చెప్పిన మాటల్లో స్పష్టం అవుతోంది. విజయనగరం వెళ్లే వరకుమా బాబాయ్ పలపతికి నక్సటైట్లతో సంబంధాలు, లేవు. అక్కడికి వెళ్లిన తరువాతే అన్నలతో పరిచయం ఏర్పడడం, అటు నుంచి అడవిమార్గం పట్టారని చెబుతున్నారు.
"మమ్మలందరినీ కాదనుకునే వెళ్లిపోయాడు. ఇక ఆయన శవం తీసుకుని వచ్చి చేసేది ఏముంది?" అనేది చలపతి వదిన కుమారి, ఈమె కుమారుడు ఉదయకుమార్ రెడ్డి చెబుతున్నారు. లేని అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నట్లే వారి మాటల్లో కనిపించింది.
ప్రతాపరెడ్డి అసియాస్ చలపతి మరణవార్త మీడియా ద్వారా దావానలంలా వ్యాపించడంతో మదనపల్లె డివిజన్ పడమటి ప్రాంతంలో చర్చ జరుగుతోంది. చలపతి స్వగ్రామం మత్యం, పైపల్లె ప్రజలు గుంభనంగా ఉన్నారు. అన్నీ తెలిసినా ఏమి తెలియనట్లే ఎవరి పనుల్లో వారు కనిపించారు. చలపతి మరణ వార్తతో గ్రామంలోకి కొత్తవారిని రాకుండా కట్టడి చేయాలని మొదట నిర్ణయించుకున్నట్లు అక్కడి మీడియా ప్రతినిధులు చెప్పిన మాట. ఆ తరువాత ఏమనుకున్నారో? ఏమో? మౌనంగా మిగిలి పోయిన ఆ పల్లె జనం ఈ విషయాలపై నోరు మెదపడం లేదు. కాగా, ప్రతాప్ (చలపతి) గతంలో మాదిరి మళ్లీ తప్పించుకుని ఉండవచ్చు. అనే భావనలోనే ఆయన కుటుంబీకులు ఉన్నారు.