జనసంద్రంగా మారిన నారావారిపల్లె
మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి భౌతికకాయాన్ని నారావారిపల్లెకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అనారోగ్యంతో సీఎం చంద్రబాబు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు. అదే విమానంలో రామ్మూర్తి భార్య ఇందిర, కొడుకులు సినీ కథానాయకుడు నారా రోహిత్, నారా గిరీష్, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్ తోపాటు నారా, నందమూరి కుటుంబీకులు కూడా రేణిగుంటకు చేరుకున్నారు.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో పాటు జిల్లా యంత్రాంగం దాదాపు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి నారా రామ్మూర్తి భౌతిక కాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు రోడ్డు మార్గాన తరలించారు.
సీఎం చంద్రబాబు రాక
తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సీఎం ఎన్. చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. తమ్ముడ నారా రామ్మూర్తికి కడసారి నివాళులు అర్పిస్తారు. తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే తమ కుటుంబ ఆచారం ప్రకారం తమ్ముడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి అంతిమ సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు స్వయంగా పరిశీలించనున్నారు. ఈ పాటికే సీఎం చంద్రబాబు బంధువులు ఆ ఏర్పాట్లు చేస్తున్నాట్లు సమాచారం.
కిక్కిరిసిన పల్లె...
మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు తమ్ముడు మరణించారనే వార్త వినడంతోనే స్వగ్రామం నారావారిపల్లెతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లా అధికారులు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం చంద్రబాబు నివాసంతో పాటు, గ్రామంలో బందోబస్తు పటిష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు పరిశీలిన చేశారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జేసీ శుభం బన్సల్ ,తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
భారీగా ప్రముఖుల రాక
చంద్రగిరి సమీపంలోని నారావారిపల్లెకు ఉదయం ఎనిమిది గంటలకు నారా రామ్మూర్తి భౌతికకాయం తీసుకుని వచ్చారు. వారి కుటుంబ లాంఛనాలు ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు అంత్యక్రయలు జరుగుతాయని కుటుంబీకులు ప్రకటించారు. కాగా,
నారా రామ్మూర్తి అంత్యక్రియలకు రాష్ర్ట మంత్రులు, ప్రముఖులు భారీగా హాజరు కానున్నారు. ఆ మేరకు జిల్లాకు సమాచారం అందింది. మహారాష్ట్ర గవర్నర్ సీ. రాధాకృష్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
Next Story