
రేయ్ బరిలోకి దిగరా బాబూ.. కొడుకును ప్రోత్సాహించిన లోకేష్
దేవాన్ష్ ఏ బహుమతి సాధించాడు? సీఎం దంపతులను మురిపించిన సంబరాలు ఎలా సాగాయంటే..
సంక్రాంతి సంబరాలతో నారావారిపల్లె సందడిగా మారింది. గ్రామంలోని ప్రజల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం కూడా కలిసిపోయింది. గ్రామంలోని పిల్లలతో కలిసి మనవడు నారా దేవాన్ష్ పోటీకి దిగడం చూస్తూ వేదికపై ఉన్న చంద్రబాబు దంపతులు మురిసిపోయారు. చప్పట్లు కొడుతూ, పిల్లలను ప్రోత్సహించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన పిల్లల్లో మొదటి గ్రామస్తులకు, తరువాత మనవడు దేవాన్ష్ కు చంద్రబాబు దంపతులు బహుమతులు అందించారు.
పోటీకి దిగరా బాబూ..
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే పిల్లలకు క్రీడాపోటీలు ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఛైర్ పోటీ బరిలోకి దిగడానికి నారా దేవాన్ష్ మారం చేస్తున్నాడు. ఆయన బాబాయ్ ఎంపీ శ్రీభరత్ ప్రోత్సాహించిన మాట వినకపోవడం గమనించిన మంత్రి నారా లోకేష్ తన కొడుకును ప్రోత్సహించారు. పోటీల బరిలోకి దిగారు. మనవడు దేవాన్ష్ మారాం చేయడం, కొడుకు లోకేష్ వెళ్లి పోటీలోకి దించడాన్ని వేదికపై నుంచి ఈ దృశ్యాలు చూస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి మురిసిపోయారు.
సంక్రాంతి సంబరాల కోసం సొంత ఊరు నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం గ్రామస్తులతో కలిసిపోయింది. పెద్ద, చిన్న తారతమ్యాలు ఏమి ఉండవనే విధంగా ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించారు.
పిల్లల కోసం పొటాటో గ్యాదరింగ్, బెలూన్ గేమ్, గిన్నీ బ్యాగ్ వాకింగ్, మ్యూజికల్ చెయర్స్, లెమన్ ఇన్ స్పూన్, టెయిల్ పికింగ్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి ఆటలు వయస్సు వారీగా నిర్వహించారు. ఊరిలోని పిల్లలతో సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కూడా కలిసిపోయాడు. పోటీల తరువాత గ్రామంలోని పిల్లలు, ఆ తరువాత దేవాన్షకు కూడా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు బహుమతులు ప్రదానం చేశారు.
నారా.. నందమూరి కుటుంబీకుల రాకతో..
నారావారిపల్లెలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. నారా, నందమూరి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం సొంత ఊరికి చేరుకుంది. భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, భార్య నారా బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. వారితో పాటు నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఆయన సతీమణి తేజస్విని ఉన్నారు. అలాగే, నందమూరి కుటుంబం నుంచి నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర కూడా వచ్చారు. వారంతా సంక్రాంతి సంబరాల్లో నారావారిపల్లె ప్రజలతో కలిసిపోయారు.
గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. నారావారిపల్లెలోని టీటీడీ కల్యాణమండపం ఆవరణలో మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులు వేసి ప్రతిభ ప్రదర్శించారు. ఈ ముగ్గులను నారా భువనేశ్వరితో పాటు కోడలు నారా బ్రహ్మణి, ఆమె చెల్లెలు, విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య తేజస్విని ఆసక్తిగా పరిశీలించారు. ఉత్తమ ముగ్గులు వేసిన వారితో పాటు మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ప్రత్యేక బహుమతులు అందించి, వారితో ఆనందం పంచుకున్నారు.
గ్రామీణ కళల్లో కోలాటం, జానపద నృత్యాలు ప్రదర్శించిన బాలికలతో నారా భువనేశ్వరి కలిసిపోయారు.
విజేతలకు బహుమతులు అందించడంతో పాటు గ్రామస్తులతో కలిసి క్రీడాపోటీలు నిర్వహించిన వేదిక వద్ద గ్రూప్ ఫోటోలు దిగారు.
క్రీడాపోటీల్లో పాల్గొన్న నారావారిపల్లె గ్రామ పిల్లలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు.
Next Story

