అనంతపురం: సూపర్-6లో మామా, అల్లుడు కనిపించలేదే..
x

అనంతపురం: సూపర్-6లో మామా, అల్లుడు కనిపించలేదే..

నందమూరి బాలకృష్ణ ఆరోగ్యానికి ఎమైంది?


అనంతపురంలో బుధవారం నిర్వహించిన "సూపర్ సిక్స్ సూపర్ హిట్" విజయోత్సవ సభలో కొంత స్తబ్దత కనిపించింది. ఈ సభకు మామ, అల్లుడైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు.

ఈ విజయోత్సవ సభలో యువగళం పేరు మారుమోగింది. టిడిపి కూటమి నిర్వహించిన ఈ విజయోత్సవ సభలో సీఎం నారా చంద్రబాబు, జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తర్వాత మంత్రి లోకేష్ ప్రసంగం ఉంటుందని ముందుగానే కార్యక్రమం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ తో పాటు ఆయన మామ, ఎమ్మెల్యే సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా గైర్హాజరు వెనక కారణం ఏంటనేది గుసగుసలు వినిపించాయి. ఇదిలాఉంటే..
టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం తోపాటు బిజెపితో కూడా మళ్లీ స్నేహాన్ని కలపడం ద్వారా కీలక పాత్ర పోషించారనేది తెలిసిన విషయమే. రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండగా టిడిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ యువగలం పేరిట కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్ర యువతలో ఆశలు రేపింది. రాజకీయంగా కూడా లోకేష్ పరిణతి సాధించడానికి ఆయన పాదయాత్ర ఉపయోగపడిందనేది విశ్లేషకులు వెల్లడించిన అభిప్రాయం.
అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో నారా లోకేష్ లేని లోటు ఆ పార్టీ నేతలు ప్రధానంగా యువకులు, యువ ఎమ్మెల్యేలను కాస్త నిరోత్సాహపరిచిందని పార్టీ నాయకులు చెప్పారు. ఈ విజయోత్సవ సభలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంతపురం జిల్లా చెందిన సీనియర్ టిడిపి నేత, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ నారా లోకేష్ గైర్హాజరు వెనక కారణాన్ని వెల్లడించారు.
"నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడి, హింస చెలరేగింది. తెలుగు వాళ్ళు అనేకమంది అక్కడ చిక్కుకుని ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు" అని పయ్యావుల కేశవ్ ప్రకటించారు. దీంతో బహిరంగ సభలో నాయకులు, సభకు హాజరైన యువకుల్లో చెలరేగిన ఊహాగానాలకు కూడా తెరపడింది.
నారా లోకేష్ ఎక్కడున్నారు?

టిడిపి కూటమి అనంతపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ అమరావతికే పరిమితమయ్యారు.
నేపాల్ లో రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై ఆయన దృష్టి సారించారు. అమరావతిలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అక్కడ కూర్చున్న మంత్రి నారా లోకేష్ నేపాల్ లో ఉన్న వారి కోసం ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. నేపాల్ లోని తెలుగువారిని ఆన్లైన్ లో కాంటాక్ట్ లోకి తీసుకుని వీడియో కాల్ లో మాట్లాడడం. అధికారులు మంత్రులను సమన్వయం చేసుకుంటూ నేపాల్ లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
నారా లోకేష్ ప్రతిష్టాత్మక సభకు ఎందుకు రాలేదని విషయంపై సీఎం నారా చంద్రబాబు కూడా తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
" తెలుగు వాళ్ళు ఎక్కడ ఆపదలో ఉన్నా పార్టీ స్పందిస్తుంది. గల్ఫ్ దేశాల్లో Nri తెలుగువారు అర్థించగానే స్పందించాం" అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
"నారా లోకేష్ యువగళం పాదయాత్రతో చైతన్యం రగిలించారు. యువతకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. అందులో భాగంగానే నేపాల్ లో ఆపదలో ఉన్న తెలుగువారిని రక్షించడం కోసం శ్రద్ధ తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ లో కూర్చొని సహాయ చర్యలు పర్యవేక్షించాలని నేనే ఆదేశాలు జారీ చేశాను" అని చంద్రబాబు ఒకింత గర్వంగా ఫీల్ అవుతున్నట్లు ఆయన మాటల్లో ధ్వనించింది.
ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమయ్యారు?
సూపర్ సిక్స్ విజయోత్సవ సభ అనంతపురంలో జరుగుతోంది. ఇదే జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ కూడా సభకు హాజరు కాలేదు. బాలకృష్ణ రాకపోవడంపై కూడా గుసగుసలు వినిపించాయి. సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మంత్రి పయ్యావుల కేశవ్ ఏం చెప్పారంటే..
"బాలయ్య బాబుకు ఆరోగ్యం బాగాలేదు. అందువల్లే ఆయన రాలేకపోయారు" అనే మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అసలు బాలకృష్ణ ఆరోగ్యం పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఉన్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు మాత్రం బాలకృష్ణ రాకపోవడం పై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు.
Read More
Next Story