PAWAN KALYAN | ధైర్యంగా ఉండండి..అండగా ఉంటానని డిప్యూటీ సీఎం హామీ
వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ ఆందోళన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండండి. అండగా ఉంటానని డిప్యూటీ సీఎం ఊరడించారు.
అన్నమయ్య (కడప జిల్లా) రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల ఎంపీడీఓ సీఏ. జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. శనివారం ఉదయం ఆయన కడపకు చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ఎంపీడీఓ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. దాడి జరిగడానికి దారితీసిన పరిస్థితిని కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీయూలో ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబుతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వారి మధ్య సంభాషణ ఎలా సాగిందంటే..
సార్, వాళ్లు నన్ను చంపేస్తారని భయంగా ఉందని ఎంపీడీఓ జవహర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
"మీరేం భయపడవద్దు. వాళ్ల సంగతి నేను చూసుకుంటా. ధైర్మంగా ఉండండి" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.
"అధైర్య పడవద్దు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం" అని హామీ ఇచ్చారు.
మీరు ఆందోళన చెందకండి..
కడప రిమ్స్ ఆస్పత్రి ఐసీయూలోనే ఎంపీడీఓ జవహర్ బాబు భార్య సీ. అర్చన, కుమార్తె హన్సి, కొడుకు జనిత్ తో కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.
"మీరు ఆందోళన చెందవద్దు. మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా అన్ని విషయాలు వివరించాను. ధైర్యంగా ఉండండి" అని పవన్ కల్యాణ్ వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్స వివరాలను అక్కడే ఉన్న వైద్యులు రిమ్స్ ఆస్పత్రి జేడీ అడ్మిషన్ రంగస్వామి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో ఎంపీడీఓ జవహర్ బాబుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా పోలీసు అధికారులను ఆదేశించారు.
Next Story