ప్రధాని మోదీ రాకకు.. కర్నూలులో సన్నాహాలు...
x

ప్రధాని మోదీ రాకకు.. కర్నూలులో సన్నాహాలు...

శ్రీశైల మల్లన్న దర్శనంతో 16న మోదీ పర్యటన ప్రారంభం.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16న పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా అందిన ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో భద్రతాపరమైన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం జిల్లాలోని అనేక ప్రదేశాల్లో పరిశీలించారు. వాహనాల పార్కింగ్ తోపాటు, హెలిపాడ్ ఏర్పాటు, కర్నూలు నగరంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పర్యటించనున్నారు.

కదిలిన పోలీస్ యంత్రాంగం

కర్నూలు నగరంలో వీవీఐపీల పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లకు జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. పర్యటన జరిగే నాటికి చేయాల్సిన ఏర్పాట్ల తోపాటు భద్రతా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై కూడా అంతర్గత సమీక్షించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయ కారణాలు పక్కన ఉంచితే, ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాగించే పర్యటనల నేపథ్యంలో ఏర్పాట్లు చేయడంలో జిల్లా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధం అవుతోంది.
కర్నూలు నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే రోడ్ షో ప్రధాన కార్యక్రమం. ఆ ప్రాంతంలోని అన్ని ప్రదేశాలపై పోలీస్ శాఖ నిఘా వేసినట్లు సమాచారం. ఆ ప్రాంతాల సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు.

ప్రధాని పర్యటన ఇలా..
కర్నూల్, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. తరువాత కర్నూల్ పట్టణంలో జీఎస్టీ సంస్కరణలపై రోడ్ షో నిర్వహిస్తారని ప్రాథమిక సమాచారం అందింది. దీంతో వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లపై ఎపిఎస్పీ 2 వ బెటాలియన్, బి.క్యాంపులోని ప్రభుత్వ బాలుర సిల్వర్ జూబ్లి కళాశాల, నంద్యాల చెక్ పోస్టు, క్రిష్ణానగర్ హైవే, జోహారాపురం రోడ్డు , కర్నూలు పాతబస్తీలో రెవెన్యూ అధికారులతో కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ముందు భద్రతాపరమైన ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ పాటిల్ పోలీస్ అధికారులకు ప్రత్యకంగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హుస్సేన్ పీరా , కృష్ణమోహన్ కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, సిఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, విక్రమసింహా, శేషయ్య, నాగరాజారావు, మన్సురుద్దీన్ , శ్రీధర్ , ఆర్ ఐలు జావేద్, నారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.
Read More
Next Story