రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత ఎమ్మెల్యేలదే..
x

రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత ఎమ్మెల్యేలదే..

అర్థవంతమైన చర్చలకు అవగాహన అవసరం. అధ్యయనంతోనే అది సాధ్యమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధ చేశారు.


రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. తిరిగి గాడిన పెట్టడం ఎమ్మెల్యేలతోనే సాధ్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. దీనికోసం ఎమ్మెల్యేలు చట్టసభను బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రస్తావించడం ద్వారా పరిష్కార మార్గాలు చూపడం తో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మేలు చేసే సూచనలు చేయాల్సిన అవసరాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రస్తావించారు. ఇవన్నీ సవ్యంగా సాగాలంటే సభలో నిబంధనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. సీఎం ఎన్. చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వేదికపై ఆసీనులయ్యారు. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. "కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ శిక్షణ దిక్సూచిలా ఉపయోగపడుతుంది" అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. " రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో అసెంబ్లీ కీలకం. ఇందులో ఎమ్మెల్యేల పాత్ర మరింత బాధ్యతతో కూడుకున్నది. ప్రజా అవసరాలను తీర్చే విధంగా సమస్యలను ప్రస్తావించడం తోపాటు ప్రభుత్వానికి విలువైన సూచనలు కూడా ఇవ్వాలి" అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే, సభలో ప్రవర్తన నియమావళి, నిబంధనలు ప్రధానమైన విషయాన్ని గమనించాలని సూచించారు.
అవగాహన అవసరం
శాసనసభలో మాట్లాడే ప్రతి అంశం పైన ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇందుకోసం సమస్యల పరిష్కారంలో ప్రశ్నోత్తరాలు కూడా ప్రధానమైనవని ఆయన చెప్పారు. ఈ సమయంలో అవకాశం లభించని ఎమ్మెల్యేలు తాము ప్రస్తావించదల్చుకున్న సమస్యలను స్వల్పకాలిక ప్రశ్నలు, జీరో అవర్ లో లేవనెత్తడానికి ఆ నిబంధనలు అధ్యయనం చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఇంకా నేర్చుకోవాలి
నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇంకా తెలుసుకోవాల్సింది.. నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు "నేను, ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులమే" అనే విషయాన్ని ప్రస్తావించారు. సమస్యలు తెలుసుకోవడంతో పాటు, వాటిని ఏ రూపంలో అసెంబ్లీలో ప్రస్తావించడానికి అవకాశం ఉందనే విషయాలు కూడా అర్థం చేసుకుంటే, సభా సమయం వృధా కాకుండా, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం కూడా సులభంగా ఉంటుందని నిబంధనలను వివరించారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోలేకపోవడం దురదృష్టకరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను ఎన్నుకున్న ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మెలగాలంటే చట్టసభలు మించిన వేదిక మరొకటి ఉండదనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
రూల్స్ తెలుసుకోవాలి
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చట్టసభల నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉందనే విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాసనసభ సమావేశాలలో బడ్జెట్ సెషన్ అత్యంత ప్రధానమైందని చెబుతూ, బడ్జెట్ అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆయన కూటమి ఎమ్మెల్యేలకు సూచన చేశారు. ఇవన్నీ శిక్షణ తో పాటు సభలో జరిగే వ్యవహారాలను పరిశీలించి అర్థం చేసుకుంటే ఎమ్మెల్యేలకు అవగాహన కలుగుతుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సభా నిబంధనలు అర్థం చేసుకోవడం ద్వారా ఏమి చేయాలి ఏమి చేయకూడదని విషయాలను తేలిగ్గా గుర్తించవచ్చని చెప్పారు.
Read More
Next Story