మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పినా..  నిర్బంధాలు తప్పవేమో...!?
x

మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పినా.. నిర్బంధాలు తప్పవేమో...!?

పరదాలు కట్టడం, ముందస్తు అరెస్టులు అనుమతించం. అని ప్రభుత్వం ప్రకటించింది. అయినా గత ప్రభుత్వ విధానాలే అమలు అవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.


గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి పాలన ఉంటుందని అన్ని వర్గాలు ఆశించాయి. ఆ దిశగానే తమ పనితీరు ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రభుత్వంలోని పెద్దలు పదేపదే చెబుతున్నారు. వారివి ఉత్తుత్తి మాటలుగా భావించారేమో! పోలీసు శాఖలో పద్ధతులు మాత్రం మార్చుకోవడం లేదు. పోలీసు శాఖలో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ వాసనలు ఇంకా వీడలేదని సీపీఎం నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పోలీసు శాఖ తీరు మారలేదు. హక్కుల కోసం అడిగే వారిని నిర్బంధించారు. నిరసన వ్యక్తం చేస్తారనే సందేహంతో ప్రజాసంఘాల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పే పరిస్థితిని పోలీస్ శాఖ కల్పించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రాసిన నిరసన లేఖను ఏపీ పోలీస్ 100 నంబర్ కు ట్యాగ్ చేస్తూ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా "మమ్మలిని మన్నించండి కామ్రేడ్స్" అని ట్వీట్ చేసే పరిస్థితి ఏర్పడింది.
నెల కిందట...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మొదటి నెలలో అంటే జూలై ఒకటో తేదీ గుంటూరు జిల్లా మంగళగిరి సభలో పింఛన్ల పంపిణీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఆయన తండ్రి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
"సార్ పోలీసులు తీరు ఇంకా మారడం లేదు. పరదాలు కడుతున్నారు" అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించగానే..
"జిల్లాల పర్యటనలకు నేను వచ్చేటప్పుడు పరదాలు కట్టినా, ఆంక్షలు అమలు చేసినా... చర్యలు తప్పవు" అని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు సరిగ్గా నెల క్రితం హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు. అయినా..
ఇదేగా సాక్ష్యం
"మీరు చెప్పేది మీరు చేప్పండి. మా పని మేము చేస్తాం" అన్నట్లు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం అనుసరించిన ఈ వ్యవహారమే నిదర్శనం. మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు.
అనంతపురం జిల్లాలో సీపీఎం నాయకులు ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సాకే హరి, పాపిరెడ్డి ఫృధ్వి "సామాజిక పెన్షన్ల మంజూరులో వివక్ష కొనసాగుతోంది. దళితులు, గిరిజనులకు సామాజిక పింఛన్ల మంజూరులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి అని డిమాండ్ చేశారు" ఈ నేపథ్యంలో సాకే హరిని కూడా గృహ నిర్బధం చేశారని సమాచారం.
సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు పర్యటనతో ఉమ్మడి అనంతపురం (విభజిత సత్యసాయి) పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రజాసంఘాలు, సీపీఎం నాయకులను గృహనిర్బంధం చేసింది. వారికి నోటీసులు జారీ చేసి ఇళ్ళ వద్దే పోలీసులను కాపలా ఉంచారు.
అందులో ప్రధానంగా పెనుగొండలో సీపీఎం నేతలు పెద్దన్న, రమేష్, గంగాధర్, వెంకట్రాముడిని వేకువజామునే ముందస్తుగా అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. మడకశిరలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ ను గృహ నిర్బంధం చేశారు. దీనిపై సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ నిరసన వ్యక్తం చేశారు.

"మా పార్టీ ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదు" అని ఫెడరల్ ప్రతినిధికి స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న వారిని అకారణంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. "గత సీఎం వైఎస్. జగన్ ప్రభుత్వ కాలంలో కూడా ఆయన జిల్లా పర్యటనలకు వస్తే, ఆయా ప్రాంతాల వామపక్ష నేతలను అదుపులోకి తీసుకునే వారు. ఉద్యమాలు, ఉద్యమకారులతో క్రూరంగా వ్యవహరించారు. అందుకే గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు" అని గుర్తు చేశారు.
పెనుగొండలో సీపీఎం నాయకులను వేకువజామునే ఇళ్ల వద్దే ముందస్తుగా అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. దీనిపై పెనుగొండ సీఐ యుగంధర్ ను ఫెడరల్ ప్రతినిధి పలకరించారు. "నిరసనలకు ఆస్కారం ఉంటుందనే ముందస్తు అరెస్టులు చేశా" అని వ్యాఖ్యనించారు. "ఇక్కడి పరిస్థితులు, కార్యక్రమాలు సీఎం స్థాయి నేతకు తెలుస్తయా? అని సీఐ యుగంధర్ ప్రశ్నించారు. అందుకు కూడా కారణం లేకపోలేదు. సమస్యలపై ప్రశ్నించే ఉద్యమకారులు ఎప్పడు ఎలా స్పందిస్తారు? రియాక్ట్ అవుతారనేది? వారికి మాత్రమే తెలుస్తుంది. అందులో సందేహం లేదు. ప్రముఖుల పర్యటనల్లో అపసృుతులు దొర్లితే అంతిమంగా పోలీసులకే పనిష్మెంట్ తప్పదు అనేది తెలిసిందే. దీంతో ఇకపై రాష్ట్రంలో సీఎం ఎన్. చంద్రబాబు పర్యటనలకు ముందు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు తప్పవనే వాతావరణం కనిపిస్తోంది.
సీఎం చంద్రబాబు నాయుడు జోరు వర్షంలోనూ గుండుమల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు, సభలో ప్రసంగించి వెళ్లిపోయారు. తమ పార్టీ శ్రేణులను నిర్బంధించడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
" ప్రభుత్వ అధినేత వస్తుంటే సమస్యలు చెప్పడం తప్పు అవుతుందా? ప్రజల కోసం పనిచేసే తమ పార్టీ శ్రేణులు వినతి పత్రాలు ఇవ్వడం నేరమా"? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. అసలు మా పార్టీ ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకున్నా, ఈ చర్యలు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.


రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పశ్చాత్తాపం వ్యక్తం చేసేలా స్పందించారు. "ప్రజా సంఘాల ఏ కాదు. పార్టీ నాయకులను నిర్బంధించడం అనే పద్ధతికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకం" అని స్పష్టం చేశారు. "తప్పు జరిగింది కామ్రేడ్స్ క్షమించండి. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కానివ్వం" అని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడం, నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం" అని స్ఫష్టం చేశారు. గృహ నిర్బంధాలు పునరావృతం కాకుండా, చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
పాలనలో ప్రక్షాళనకు ఉన్నతస్థాయిలో కలక అధికారులను ప్రభుత్వం ఎడాపెడా బదిలీ చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు చాలా వరకు పాతవారే ఉన్నారు. దశాబ్దాల కాలక్రమంలో లేని ఆంక్షలు గత ఐదేళ్ల పాలనలో అమలు చేశారు. వామపక్ష పార్టీలే కాకుండా, ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా నిర్బంధాన్ని గట్టిగా రుచిచూశాయి. ప్రభుత్వం మారినా, అవే పద్ధతులు అమలు అవుతున్నాయి. నిరసన తెలిపే హక్కులు లేకుండా చేస్తున్నారు. దీనిని తాము ఎంతమాత్రం సమర్థించేది లేదని సీఎం ఎన్. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తున్నారు. రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయనేది వేచిచూడాల్సిందే.
"కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కులు కాలరేసే పద్ధతలు కొనసాగుతున్నాయి" అని సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ నిరసన వ్యక్తం
చేశారు. ఇదే పద్ధతులు కొనసాగితే భంగపాటుకు గురవుతారని స్పష్టం చేశారు.

మడకశిరలో వైఎస్ఆర్ సీపీ నేత, ఏడీసీసీ మాజీ చైర్మన్ ఆనంద రంగారెడ్డికి కూడా పోలీసులు ముందస్తు నోటీస్ జారీ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇచ్చారనేది తెలియదు. దీంతోపాటు , ముందస్తు అరెస్టులపై మడకశిర సీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే "అయన ఫోన్ కాల్ " రిసీవ్ చేసుకోలేదు.
Read More
Next Story