తిరుమల శ్రీవారిని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ధర్మగిరిలో ఎస్వీ వేద విజ్ఞాన పీఠాన్ని కూడా సందర్శించిన ఆయన వేద విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన తెలుగువారి కొంగుబంగారంగా భావించే ఆలయాల సందర్శనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతీ అతిథిగృహాల ప్రాంగణంలో టీటీడీ అధికారులు ఆయన బస ఏర్పాటు చేశారు.
తిరుమలలో బుధవారం ఉదయం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు శ్రీవారి దర్శనం కల్పించారు. ఆ తరువాత రంగనాయకులు మండపంలో టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, చైర్మన్ నాయుడు శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటో, తీర్థప్రసాదాలు అందించారు.
అధికారుల పరిచయం
శ్రీవారి ఆలయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఇతర అధికారులను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, ఆచారాలు, దర్శనాల వివరాలు వివరించినట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి దర్శనంతో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ జిల్లాలో రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది.
మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తరువాత శ్రీకాళహస్తి ముక్కంటీశ్వర ఆలయం, తిరుగు ప్రయాణంలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఇక్కడ శ్రీపద్మావతి అమ్మవారి ఊంజల్ సేవలో కూడా మారిషస్ అధ్యక్షుడు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలోని మూడు ప్రధాన ఆలయాలను దర్శించుకున్నమారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు విశిష్ట అతిథిగా హాజరైన ఆయన, తెలుగు వారి ఇలవేల్పుగా ఉన్న ఆలయాల సందర్శించారు. తద్వారా తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిందచాలనే సందేశం ఇచ్చినట్టే ఆయన రెండు రోజుల యాత్ర సాగింది. జిల్లా అధికారులు కూడా మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పర్యటనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ధర్మగిరిలో..
తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ధర్మగిరిలోని వేద విజ్ణానపీఠాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు.
రుమలగిరురుల్లోని పీఠానికి చేరుకున్న ఆయనను ఘనంగా స్వాగతించారు. వక్తల అభిభాషణను కూడా ఆయన ఆస్వాదించారు.
అనంతరం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ ను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి సతస్కరించారు.