ప్రకృతి చేసిన గాయం.. అల్లాడుతున్న మామిడి రైతు..
x

ప్రకృతి చేసిన గాయం.. అల్లాడుతున్న మామిడి రైతు..

మామిడి తోటలు సాగు చేసే రైతులు నిండా మునిగారు. దిగుబడి తగ్గిపోయి, ఖర్చులు కూడా రాని పరిస్థితి. బహిరంగ మార్కెట్లో ధరలు కొండెక్కాయి.


రైతన్నతో ప్రజాప్రతినిధులే కాదు. ప్రకృతి కూడా జూదమాడుతోంది. వాతావరణం అనుకూలించని స్థితిలో మామిడి దిగుబడి తగ్గింది. ఆ తోటలు సాగు చేసిన రైతులు దిగాలు పడ్డారు. మామిడి ప్రియులకు ధరలు చేదుగా మారాయి. "నేను 12 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నాను. సుమారు 35 నుంచి 40 టన్నుల దిగుబడి రావాలి. ఈ ఏడాది కనీసం రెండు టన్నుల దిగుబడి కూడా రాలేదు. ఎరువులు, కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కలేదు. పెట్టుబడి కూడా చేతికి అందలేదు" అని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం విడపనపల్లెకు చెందిన కే. చిన్నప్ప వివరించారు. ఇలాంటి రైతులు వందల సంఖ్యలో ఉన్నారు.

మార్కెట్లో కూడా మామిడి సరుకు కొరత ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే 1/3 వంతు కూడా దిగుబడి రాలేదని మామిడి మార్కెట్ యార్డులో ఏజెంట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉద్యానవన శాఖాధికారులు ధ్రువీకరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి రైతులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు... కడప జిల్లా రైల్వే కోడూరు, పులివెందుల, రాజంపేట, నెల్లూరు జిల్లా రాపూరు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో వందలాది మంది ఉన్నారు.

తగ్గిన దిగుబడి

ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి, పూత దశలో ప్రకృతి కరుణిస్తే హెక్టారుకు నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది. ఆ లెక్కన గత ఏడాది 12.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. కానీ ఈ ఏడాది అందులో 1/3 వంతు కూడా దిగుబడి లేదు. ఇందుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని చిత్తూరు జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరెడ్డి.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.

"గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు నెల వరకు ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల మామిడి దిగుబడి తగ్గడానికి దారితీసింది. సాధారణంగా ఉష్ణోగ్రతలు 16 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. వరుస తుపానుల ప్రభావం, వర్షాలు విపరీతంగా కురవడం, మంచు ఎక్కువగా ఉన్నది. పగలు మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో పూతదశలో బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత పువ్వు పిందెగా మారి, కాయగా ఏర్పడే దశలో జనవరి నుంచి మార్చి నెల వరకు తగినంత అనుకూల వాతావరణం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది" అని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి విశ్లేషించారు.

మామిడి తోటలకు ప్రసిద్ధి..

కడప జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేట, పులివెందుల, బద్వేలు తదితర ప్రాంతాలు మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా దిగుబడి తక్కువగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ‘‘కడప జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో 2,450 హెక్టార్లలో మామిడి తోటల సాగులో ఉంటే. 2021-22 సంవత్సరంలో 3.60 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. రాజంపేట సమీప ప్రాంతాల్లో 1000 హెక్టార్లలో సాగులోని మామిడి తోటల నుంచి 51, 300 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది’’ అని రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి వివరించారు. "వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమేఈ పరిస్థితికి కారణం" అని లక్ష్మీకాంతబాబు.. ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. ఆయన ఇంకో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు.

రైతుల మేలు కోసం..

‘‘గతంలో పంట ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ కమిటీలకు తీసుకొచ్చి విక్రయించేవారు. పచ్చి సరుకు అంటే ప్రధానంగా కూరగాయలు, మామిడి పంటకు సేస్సు నుంచి కేంద్ర ప్రభుత్వం డి-నోటిఫై చేసింది. ఆ విధానం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. అందువల్ల రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో 22 మందికి దుకాణాల ఏజెన్సీ లైసెన్సులు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది" అని లక్ష్మీకాంత్ బాబు వివరించారు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కమిటీకి తీసుకు రావడం లేదని ఆయన చెప్పారు. "ఉత్తరాది రాష్ట్రాలకు మామిడి సరుకు తీసుకువెళ్లే వ్యాపారులు మాత్రం టన్నుకు రూ.100 స్వచ్ఛందంగా చెల్లించి రసీదు తీసుకువెళుతున్నారు. ఆ రాష్ట్రాల్లో వేబిల్లుతో పాటు, ఈ రసీదు కూడా అవసరమవుతుంది" అని లక్ష్మీకాంత్ బాబు వివరించారు.

తోటల వద్దకే వ్యాపారులు

చిత్తూరు జిల్లాలో పాకాల సమీపంలోని చెరువు మ్యాంగోనగర్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత తిరుపతి మ్యాంగో మార్కెట్ ప్రసిద్ధి చెందినది. చిత్తూరు, పలమనేరు, నగరి, కార్వేటి నగరం మార్కెట్ కమిటీలకు కూడా స్వల్ప ప్రాధాన్యత ఉంది. పొరుగునే ఉన్న కడప జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో మామిడి తోటలు గణనీయంగా ఉన్నాయి. గతంలో మాదిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సరుకు తీసుకు రావడం లేదు. కానీ, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కోల్కతా, హర్యానా, ముంబై రాష్ట్రాల్లోని నగరాల నుంచి కూడా వ్యాపారులు ఈ ప్రాంతానికి ఏటా మామిడికాయల కొనుగోలుకు వస్తూ ఉంటారు.

వ్యాపారులు తోటల వద్దకే వెళ్లి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. 30 నుంచి 35 టన్నుల సామర్థ్యం మోయగలిగిన ట్రక్కులు ఉదయం పల్లెలకు వెళ్తే మధ్యాహ్నానికి నిండిపోయేవి. ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో.. రెండు రోజులకు కానీ ఓ ట్రక్కు నిండని పరిస్థితి ఏర్పడింది. అంటే హెక్టారుకు నాలుగు టన్నుల దిగుబడి రావాల్సిన మామిడితోటల నుంచి అందులో 15% కూడా దిగుబడి లేకపోవడమే అనేది రైతులు, వ్యాపారులు, అధికారులు చెబుతున్న మాట.

చేదెక్కిన ధర...

మామిడి దిగుబడి తక్కువ కావడంతో ఈ ఏడాది రాయలసీమ ప్రాంతంలో ధరలు కొండెక్కాయి. రైతుకు కూడా గిట్టుబాటు లభించని దయనీయ పరిస్థితి ఏర్పడింది. తిరుపతి మామిడి మార్కెట్ యార్డులో 70 మందిలో ఉన్నాయి. వివిధ రకాల మామిడికాయలతో కళకళలాడాల్సిన మార్కెట్లన్నీ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. దిగుబడి బాగా ఉంటే రోజుకు 100 నుంచి 150 ట్రక్కులకు సరిపడా మామిడి కాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు రోజుకు ఐదు నుంచి పది ట్రక్కుల సరుకు కూడా రావడం లేదు. 15 నుంచి 20 టన్నుల కాయలు మాత్రమే మార్కెట్ కు వస్తున్నాయి. అందువల్ల మండీలన్నీ బోసిపోతున్నాయని, మామిడి సరుకు తీసుకొచ్చే రైతులు కూడా తగ్గిపోయారని ఏజెంట్లు విశ్లేషిస్తున్నారు.

" గత ఏడాది దిగుబడి అధికంగా ఉన్నా టన్ను ధర ఆశాజనకంగానే ఉండడంతో రైతులకు మేలు జరిగింది" అని ఓ మండీ యజమాని అబ్దుల్ వహీద్.. ఫెడరల్ ప్రతినిధి చెప్పారు. ‘‘ఈ ఏడాది టన్ను రూ.35 వేలు పలుకుతోంది. దిగుబడి తక్కువగా ఉండటం వల్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. మండీలోని ఏజెంట్లకు కిరాయిల భారం కూడా పడుతుంది" అని అబ్దుల్ వహీద్ వివరించారు. " కొందరు ఏజెంట్లు రైతులకు సహాయంగా నిలుస్తున్నారు. అంటే మామిడి తోటలకు అవసరమైన క్రిమిసంహారక మందులు అందించడం, ఇతరత్రా ఖర్చులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు" అని అబ్దుల్ వహీద్ వివరించారు. "మా వద్ద సరైన ధర లేకుంటే ఇతర వ్యాపారుల వద్ద విక్రయించి, సొమ్ము చేసుకోమని రైతులకు అండగా నిలిచే ఏజెంట్లు కూడా ఉన్నారు" అని అబ్దుల్ వివరించారు. రైతులు బాగుంటే ఏజెంట్లు, వ్యాపారులు నిలకడగా ఉంటారనేది మా అభిమతం అని మనసులో మాట చెప్పారు.

మార్కెట్ కమిటీకి తగ్గిన ఆదాయం

పచ్చి సరుకు మార్కెట్ ఫీజు డీ -నోటిఫై చేసిన నేపథ్యంలో ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం తిరుపతి మామిడి మార్కెట్ యార్డులో టన్నుకు రూ. 300 మాత్రమే వసూలు చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్ యార్డులో నిర్వహణ, అవసరమైన ఖర్చులు కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. మామిడికాయల దిగుబడి తగ్గిన నేపథ్యంలో రు. కోట్లలో ఉండాల్సిన ఆదాయం రూ. ఐదు లక్షలలోపు కిందికి పడిపోయినట్లు తెలుస్తోంది.

కొనలేం.. తినలేం..

ఏది కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు... అనే కోవలో ఈ ఏడాది మామిడికాయలు కూడా చేరిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్ల, మామిడి పండ్ల ధరలు కూడా కొండెక్కాయి. మార్కెట్ యార్డులోనే మండీ ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసే పండ్లను చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు. వారిలో దుర్గారావు అని రిటైల్ వ్యాపారి మాట్లాడుతూ, " కిలో బేనీషా రకం మామిడి పండ్లు రూ.150 విక్రయించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది" అని చెప్పారు. బేరసారాల తర్వాత రూ. 130 నుంచి 135 కు కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు" అని దుర్గారావు చెప్పారు.

కడుపు కాలుతోంది..

మార్కెట్ యార్డులో కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకునే హమాలీలు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. స్థానికులే కాకుండా, కూలీ పనుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మామిడి పంట దిగుబడి లేకపోవడం, పల్లెల నుంచి మార్కెట్ యార్డుకు ట్రక్కులు వేళ్ళ మీద లెక్కించే స్థాయిలో వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమ్మకు చేతినిండా పని లేకుండా పోయిందని కర్నూలుకు చెందిన హమాలి రవి ఆవేదన చెందారు. టన్నుకు రు. 300 దక్కేది. ట్రక్కులు, ట్రాక్టర్లు పల్లెల నుంచి లోడు తీసుకురారేని పరిస్థితిలో పని లేకుండా పోయింది" హమాలి రవి ఆవేదన చెందారు.

Read More
Next Story