
సూర్యప్రభ వాహనంపై బద్రినారాయణుడిగా మలయప్పస్వామి
తేజోమయుడి వాహనంపై మలయప్ప విహారం
బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చిన శ్రీవారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మలయపప్ప స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో వాహనమండపం నుంచి సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు. గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇస్తూ సాగిన వాహనసేవ కనువిందు చేసింది. బద్రినారాయణుడిగా కనిపించిన స్వామివారి పల్లకీ ముందు వేదపారాయణం, జీయర్ స్వాముల గోష్ఠి వినిపించింది. స్వామివారి వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయేది భక్తలు విశ్వాసం.
ఈ రోజు రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమలలో మంగళవారం ఉదయం జరిగిన సూర్యప్రభ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబరు 1న రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.
Next Story