మాధవిరెడ్డి గెలుపు ఓ రికార్డ్
x

మాధవిరెడ్డి గెలుపు ఓ రికార్డ్

కడప అసెంబ్లీ స్థానంలో సరికొత్త రికార్డు నమోదయింది. మూడు దశాబ్దాల తర్వాత ముస్లిమేతర వ్యక్తి అది కూడా, ఓ మహిళ టిడిపి అభ్యర్థి విజయం దిశగా పయనిస్తున్నారు.


కడప అసెంబ్లీ స్థానం ముస్లిం మైనార్టీ ఓటర్లకు నిలయం. ఈ స్థానం నుంచి రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించేవారు. గత మూడు దశాబ్దాల నుంచి టిడిపి, వైయస్ఆర్సీపీ నుంచి ముస్లిం మైనార్టీలే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన"ముస్లిమేతర మహిళ, టిడిపి అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి గెలుపొందడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పారు. డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషాతో టిడిపి అభ్యర్థిగా మొదటిసారి మాధవి రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.

మూడు దశాబ్దాల తర్వాత

కడప అసెంబ్లీ స్థానంలో 2,65,154 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేల పైచిలుకు ఓటర్లు ముస్లిం మైనా రిటీలే. ఆ తర్వాత బలిజ, క్రిస్టియన్, రెడ్డి, దళిత సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషా బేపారిపై టిడిపి అభ్యర్థిగా ఆర్. మాధవిరెడ్డిని పోటీ చేయించారు. మూడు దశాబ్దాల తరువాత ఈ నియోజకవర్గంలో ముస్లిమేతర వ్యక్తి పోటీ చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈమె రెండో మహిళగా ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో రికార్డుల్లో ఎన్నికల చరిత్రలో నమోదయ్యారు.

కడప అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ సాధించాలనే దిశగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పోటీ చేశారు. ఆయనపై పార్టీ వర్గాలనే కాకుండా తన సొంత సామాజిక వర్గం ముస్లింలలో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉండడంతో పాటు ఆయన సోదరుడు కొందరు బంధువుల వల్ల వ్యతిరేకత కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అఫ్జల్ ఖాన్ ను ఆ పార్టీ ఇక్కడనుంచి పోటీ చేయించింది. దీనివల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. ఈ పరిణామాలన్నీ టిడిపి అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి విజయానికి బాటలు వేశాయి. మొదటి నుంచి ఆమె విజయం ఆధిక్యం దిశంగానే సాగింది.

ముస్లిమేతరుల్లో కందుల చివరి ఎమ్మెల్యే

కడప అసెంబ్లీ స్థానం నుంచి 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల శివానందరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ముస్లిమేతర ఎమ్మెల్యేలు కడప స్థానం నుంచి గెలవలేదు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎస్సే ఖలీల్ బాషా, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన సయ్యద్ మహమ్మద్ అహమదుల్లా డాక్టర్ వైయస్సార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కి అవకాశం లేకుండా పోయింది. దీంతో 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది,

డిప్యూటీ సీఎంగా ఉన్న షేక్ అంజాద్ బాషా బేపారి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంగా 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 2014లో అంజాద్ బాషా టిడిపి అభ్యర్థి సుధా దుర్గాప్రసాదరావు పై 45,205 ఓట్లు, 2019లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవాబ్ జాన్ అమీర్ బాబు పై 54,794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో ఈయనకు అనేక కారణాల రీత్యా వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కడప అసెంబ్లీ స్థానం నుంచి ముస్లిం ఇతర అభ్యర్థి, అంతేకాకుండా ఓ మహిళ గెలుపొందడం ప్రత్యేక అంశంగా చెప్పవచ్చు.

మధ్యలోనే నిష్క్రమణ

ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కడప పార్లమెంట్ నియోజకవర్గం లోని ఓట్ల లెక్కింపు కడప నగరంలోనే జరిగింది. పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ప్రతి రౌండ్ లోను టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డికి మెజార్టీ పెరుగుతూ వచ్చింది. అదే పరిస్థితి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో కూడా టిడిపి అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోయారు. ఇక్కడి నుంచి మొదటిసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన యువకుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కూడా విజయం దిశగా పయనించారు.

మైదుకూరు శాసనసభ స్థానం నుంచి రెండోసారి అదృష్ట పరీక్ష కు దిగిన, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా విజయం బాటలోనే పయనించారు. ఈ పరిస్థితుల్లో .. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే, ఓటమిని అంగీకరిస్తూ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యనానికే బయటికి వెళ్లిపోయారు.

Read More
Next Story