
మదనపల్లె:ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆమెను చలి చంపేసిందా..?
శుక్రవారం రాత్రి మైనస్ 13 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.
మదనపల్లెపై మంచు దుప్పటి ముసుగేసింది. అనారోగ్యానికి గురైన ఓ మహిళకు ప్రభుత్వాస్పత్రిలో చలిలో గజగజలాడుతూ ప్రాణాలు విడిచింది. ఆ మహిళ మృతదేహానికి శనివారం ఉదయం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాతే ఆమె చనిపోయిందని నిర్ధారించి, మార్చురీకి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పనితీరు విమర్శలకు ఆస్కారం కల్పించింది.
"ఆమె ఇన్ పేషెంట్ కాదు. ఓపీ తీసుకుని వెళ్లిపోయింది. ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం లేదు" మదనపల్లె జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ చెబుతున్నారు. ఈ ఘటనలోకి వెళ్లే ముందు...
మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వరండాలో మల్లమ్మ మృతదేహం వద్ద వైద్య సిబ్బంది
పడిపోయిన ఉష్ణోగ్రతలు
మదనపల్లె పట్టణంలో తాజా పరిస్థితిని పరిశీలిస్తే, శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారేవరకు మైనస్ 14 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం పగటి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మదనపల్లె పట్టణం సముద్రమట్టానికి 2,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. పేదవాడి ఊటీ హార్సిలీహిల్స్ 3,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీంతో శీతాకాలం పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రిళ్లు మంచు దుప్పటి ముసుగు వేయడంతో చలితో పిల్లలు, వృద్ధులు గజగజ వణుకుతున్నారు. ఈ నెల 20వ తేదీ కూడా పగలు 20 డిగ్రీలు నమోదైతే, రాత్రి ఎనిమిది డిగ్రీలకు పడిపోయింది. వారం నుంచి ఇదే తరహా వాతావరణం ఉంటోంది.
"మదనపల్లెలో మూడు దశాబ్దాల తరువాత పూర్వకాలం నాటి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి" అని పట్టణానికి చెందిన శివకుమార్ వ్యాఖ్యానించారు. వర్షాలు కురవడం, ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఉండడం కూడా వాతావరణంలో మార్పులకు ఆస్కారం కల్పించదని అభిప్రాయపడ్డారు. ఈ విషయం ఇలా ఉంచితే..
ఆమె ఎందుకు మరణించింది?
తంబళ్లపల్లి మండలం బలకవారిపల్లెకు చెందిన రాగిణి వెంకటప్ప భార్య మల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం మదనపల్లె ఆస్పత్రికి వచ్చింది. ఓపీ తీసుకుని చికిత్స చేయించుకుంది. ఆమె వెంట ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆరుబయట వరండాలో గచ్చు నేలపై పడుకుంది. ఆస్పత్రిలో తాత్కాలిక వైద్యం చేయించుకున్న ఆమో చేతికి క్యాన్ల ( చేతికి సూది మందు వేయడానికి అమర్చే పరికరం) అలాగే ఉంది. సెలయిన్ లేదా సూది మందు వేయడానికి ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లకు మాత్రమే ఇది అమరుస్తారు.
ప్రాణం ఉందా? లేదా? ఆస్పత్రిలో మృతదేహాన్ని పరీక్షిస్తున్న సిబ్బంది
మదనపల్లె ఆస్పత్రి ఆవరణలో నేలపై పడుకున్న ఆమె శనివారం నిర్జీవంగా మారింది. ఇదే ఇక్కడ సమస్యగా మారింది. ఆస్పత్రి సిబ్బంది చనిపోయిన మహిళను ఉదయం గుర్తించారు. వెంటనే అత్యవసర విభాగంలోనికి తీసుకువచ్చి డాక్టర్లు పరీక్షించగా చనిపోయిందని నిర్ధారించారు. మల్లమ్మ వద్ద ఉన్న ఆధార్ కార్డులో అడ్రసు ద్వారా పట్టణంలో ఉన్న కూతురికి సమాచారం అందించారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఈ వ్యవహారం బయటికి పొక్కింది. ఆస్పత్రిలో చేర్చుకుని ఉంటే, చలికి ఆమె ప్రాణం పోయేది కాదని కూడా మిగతా రోగుల సంబంధీకులు అభిప్రాయపడ్డారు. అత్యవసర సేవల విభాగం వద్దే ఈ ఘటన జరిగడం వల్ల సిబ్బంది పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మదనపల్లె ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఏమన్నారంటే..
"ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన నా దృష్టికి రాగానే ఆర్ఎంఓతో పాటు అత్యవసర విభాగంలో మల్లమ్మకు వైద్య సేవలు అందించిన డాక్టర్ తో కూడా మాట్లాడాను. వివరాలు తెలుసుకుంటున్నాను. ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించాం" అని డాక్టర్ రమేష్ చెప్పారు. పోస్టుమార్టం చేయడానికి మల్లమ్మ సంబంధీకులు అంగీకరిస్తే, ఆమె ఎలా చనిపోయిందనేది వెల్లడి అవుతుందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వెంట సహాయకులు లేకపోవడం కూడా సమస్యగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story

