YCP vs TDP | జగన్ కు లిక్కర్ స్కాం  కంపరం
x

YCP vs TDP | జగన్ కు లిక్కర్ స్కాం కంపరం

జనం లోకి వెళితే ఖర్చు పెట్టె వాళ్ళు కరువు!


ఏపీ లిక్కర్ స్కాం వైసీపీని కుదిపేస్తోంది. మాజీ సీఎం వైఎస్. జగన్ ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. కీలక నేతలను జైలుకు పంపింది. తన వంతు రాకముందే జగన్ జనంలోకి వెళ్లాలనే వ్యూహంపై కసరత్తు సాగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనివల్ల ఒకవేళ అరెస్టులు జరిగినా జనం సానుభూతి లభిస్తుంది. పార్టీ శ్రేణుల నిరసనలు పెల్లుబుకితే మేలు జరుగుతుందనేది అంచనా వేస్తున్నట్లు తెలిసింది.

యాత్రలు సాగించడానికి ఆర్థికభారం ఎవరు మోస్తారు? ఇదే ప్రస్తుతం వైసీపీలో ప్రధాన చర్చ సాగుతున్నట్లు తెలిసింది.

చిత్తూరు జిల్లాలో ఆర్థిక భారం మోసే నేతలు రిమాండ్ కు వెళ్లారు. నెల్లూరులో కీలక నేత సైలెంట్ అయ్యారు. ఉత్తరాంధ్రలో ప్రధాన నేత చేతులు ఎత్తేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపడితే వనరులు ఎలా? నేతలు భరిస్తారా? అందుకు సిద్ధంగా ఉన్నారా? లేదంటే వైఎస్. జగన్ మాత్రమే భరించాల్సి వస్తుందా? అనే మీమాంసలో పడినట్లు విశ్వసనీయ సమాచారం.
డోలాయమానం ఎందుకంటే...
వైసీపీలో ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ కోటరీలోని నేతలను లిక్కర్ స్కాంలో ఉన్నారు. అంతిమంగా వైఎస్. జగన్ ను ఈ చట్రంలోకి లాగి, జైలుకు పంపించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితికి ముందు పాదయాత్ర, బస్సు యాత్రలకు శ్రీకారం చుడితే యాత్రలకు ఎదురుకాక ముందే జగన్ జనంలోకి వెళితే ఎలా ఉంటుందనే సమాలోచనల వెనుక.. పూర్వ అనుభవాన్ని బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. అందులో..
2017 నవంబర్ 6న వైఎస్. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరిట కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల పాదయాత్రతో రెండు కోట్ల మందిని స్వయంగా కలిశారనేది వైసీపీ వేసి అంచనా.
2019 ఎన్నికలకు మూడు నెలల ముందే పాదయాత్రను ముగించారు. ఆ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లతో సంచలన విజయం సాధించిన వైఎస్. జగన్ రికార్డు సృష్టించారు.
జగన్ జనంలోకి వస్తారా?
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెడుతోందనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ పరిస్థితుల్లో లిక్కర్ స్కాం అనేది వైసీపీని తీవ్రంగా కుదిపేస్తోంది. ఇదే అంశం ప్రధానంగా చర్చ జరుగుతోంది. వైఎస్. జగన్ జనంలోకి వస్తారనే ప్రచారం ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతూనే ఉంది.
వైసీపీ అధికారం కోల్పోయాక పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ తరువాత వరుసగా నేతలు నోరు విప్పారు. ఈ పరిస్థితికి జగన్ కోటరీలోని నేతలే కారణం అని ఆరోపించారు. అధినేతకు జరుగుతున్న పరిణామాలు చెబుదామన్నా కలవనివ్వలేదని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన వైసీపీ చీఫ్ జగన్ ..
"సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనకు వస్తా. ప్రతి సెగ్మెంటులో రెండు రోజులు ఉంటా. కిందిస్థాయి నేతలతో కూడా మాట్లాడతా" అని ఈ ఏడాది మొదట్లనే జగన్ స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత జిల్లా కమిటీలు పూర్తయ్యాక వస్తానని కూడా ఆయన చెప్పారు. మినహా జగన్ మాత్రం జనంలోకి రాలేదు. ఆర్థికవనరులు ఉన్న నేతలు, భరించే శక్తి ఉన్న వారు జైళ్లకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ చీఫ్ జనంలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
వస్తే భారం ఎంత?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో క్యాడర్ కోసం జగన్ యాత్రలు చేపడితే, ఆర్థిక వనరులు ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. పాదయాత్ర, లేదా బస్సు యాత్ర చేపడితే రోజుకు కనీసం 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుందనేది ఓ అంచనా. జగన్ కాన్వాయ్ వాహనాలు, భోజనాలు, విడిది చేయడానికి షిప్టింగ్ పద్ధతిలో ఏర్పాటు చేసే టెంట్లు, జనసమీకరణ, ఇతరత్రా ఖర్చులు ఉంటాయని చెబుతున్నారు.
2017 లో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర
చిత్తూరు జిల్లాలో డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. 260 కిలోమీటర్లు 20 రోజులకు పైబడే సాగింది.
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ స్థానంలో ఔత్సాహికులు కొందరు భారం భరించారు. మిగతాది మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి మోశారనేది పార్టీ వర్గాల సమాచారం.
జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డి, ఆర్కే. రోజాతో పాటు సీనియర్ నేతలు కూడా తలో చేయి వేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా? అనేది చర్చకు తెరతీసింది.
ఇప్పుడు పరిస్థితి ఏమిటి?

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే కేసులతో వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన వారిలో రిటైర్డు అధికారులు, వ్యక్తిగత సహాయకులను టీడీపీ కూటమి జైలుకు పంపింది.
చిత్తూరు జిల్లా నుంచి ఆంతరంగికుడిగానే కాకుండా, పార్టీ కార్యక్రమాలు, జగన్ పాదయాత్ర సందర్భంలో డబ్బు మంచినీళ్లప్రాయంగా వెచ్చించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి జైలుకు వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పూర్తి హవా. ఆయన కొడుకు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా జగన్ కు ఆంతరంగికుల్లో ఒకరు మెలిగారు. తండ్రీ, కొడుకు ఇటు చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వైసీపీ వ్యవహారాలు సాగించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకంగా చిత్తూరులో పెద్దరెడ్డి చెప్పిందే వేదం. చేసిందే శాసనం అన్నట్లు వ్యవహారాలు సాగాయి.
వైసీపీకి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడంలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కొడుకు, ఎంపీ మిథున్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారనే ప్రచారం విస్తృతంగా ఉండేది. లిక్కర్ కుంభకోణంలో నాల్గవ నిందితుడిగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా రెండు రోజుల కిందటే అరెస్టు చేసి, రాజమండ్రి జైలుకు తరలించారు. దీనివల్ల వైసీపీకి ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ ఏదన్నా దీర్ఘాకాలిక కార్యక్రమానికి రంగంలోకి దిగితే, నిధుల భారం భరించే నేత కోసం దేవులాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.
ఎందుకంటే..
వైసీపీ అధికారంలో లేదు. పనులు కావడం లేదు. ఎమ్మెల్యే సంఖ్య కూడా జగన్ తో కలిపితే 11 మందే. వారిలో చిత్తూరు నుంచి ఇద్దరు, కడప నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో బద్వేలు నుంచి ఎస్సీ, ఆలూరు నుంచి బీసీ అభ్యర్థి విజయం సాధించారు. అనంతపురం నుంచి ఒకరు. కర్నూలు నుంచి ఒకరు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేపట్టినా వైఎస్. జగన్ మినహా మరొకరు వనరులు సమకూర్చలేరు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే అంశంపై చిత్తూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ,
"వైసీపీ అధికారంలో ఉండగా, చాలా మంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు కదా" అని గుర్తు చేశారు.
"పార్టీ క్యాడర్ కు ఆత్మస్థైర్యం కల్పించడానికి జగన్ జనంలోకి రావాల్సిన సమయమే. కానీ, ఏ దన్నా సంఘటన జరిగినప్పుడు చురుగ్గానే స్పందిస్తున్నారు" అని ఆ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయినా,
"ఎన్నికలకు నాలుగేళ్ల వరకు సమయం ఉంది. ఉన్న సామ్ము పొగొట్టుకుంటే, ఆ సమయానికి ఎలా అనేది కూడా ఆలోచిస్తారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 ఎన్నికలకు ముందు
పాదయాత్రలో కూడా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండదండలు అందించారు. ఆ జిల్లా మొత్తం బాధ్యత ఆయనే తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లాక సంబంధించి, భారం మోయడానికి మొదట మాజీ మంత్రి పెద్దిరెడ్డి సుముఖత వ్యక్తం చేయకున్నా, ఆయన కొడుకు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చొరవ తీసుకున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరిగింది.
వైఎస్. జగన్ కూడా చిత్తూరు జిల్లాను పార్టీ ఫ్రాంఛైజీగానే పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పగించడం, నిర్ణయాధికారులు కూడా వారికే వదిలేశారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి 40 ఏళ్లుగా నిర్మించుకున్న రాజకీయ కోట లిక్కర్ స్కాంత్ బీటలు బారిందా? సుస్థిరంగా ఉందా? అనే విషయం తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
కన్నకొడుకు లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన వేదన బయటికి కనిపించనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైకి మాత్రం గుంభనంగానే వ్యవహరిస్తున్నట్లు ఆయన అంతరంగిలా ద్వారా తెలిసింది.
ఈ పరిస్థితుల్లో కూటమి దెబ్బకు కలవరం చెందుతున్న పార్టీ శ్రేణులు మాత్రం
"కేసులకు భయ పడం. బెదరం. మేము జగనన్న సైనికులం. పోరాటం నుంచి ఉద్భవించిందే వైఎస్ఆర్ సీపీ" అని నినదిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు స్థైర్యంగాను ఉన్నామని సమాధానం చెబుతున్నారు. అందుకు నిదర్శనం
వైఎస్. జగన్ పల్నాడు పర్యటన. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మామిడి రైతుల పరామర్శకు వచ్చినప్పుడు నిర్బంధాలను కూడా అధిగమించి పార్టీ శ్రేణులు కదిలిరావడాన్ని ప్రస్తావించవచ్చు.
నెల్లూరు పెద్దారెడ్డి సైలెంట్
నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి దన్నుగా నిలిచిన నేత అనడంలో సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన పెద్ద కొడుకు గౌతం రెడ్డి మంత్రిగా పనిచేశారు. గుండెపోటుతో గౌతం రెడ్డి మరణించడం రాజమోహన రెడ్డిని కుంగదీసింది. దీనికి తోడు వయసు రీత్యా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయన రెండో కొడుకు విక్రమ్ రెడ్డి కూడా మౌనంగా ఉన్నారు.
ఉత్తరాంధ్రలో శాసనమండలిలో వైసీపీ పక్ణ నేత బొత్స సత్యనారాయణ, కోస్తా ప్రాంతంలో కొందరు నేతలు కూడా ఖర్చుల విషయంలో డోలాయమానంలో ఉన్నట్లు వినికిడి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులది కూడా దాదాపు అదే పరిస్థితి అని తెలిసింది. ఇదిలాఉంటే..
కడప జిల్లాకు పెద్ద దిక్కు వైఎస్. జగనే. ఆ జిల్లాలో ఓ స్మగ్లర్ తెరచాటున వైసీపీకి ఆర్థిక సహకారం అందించారని చెబుతారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదు.
ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించాలన్నా, వనరులు సమకూర్చడానికి కూడా కీలక నేతలు రిక్త హస్తం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో స్వల్ప ఖర్చులు మినహా, భారీగా భారం భరించే స్థితి కనిపించడం లేదని భావిస్తున్నారు.
పార్టీ క్యాడర్ కోసం వైఎస్. జగన్ కార్యరంగంలోకి దిగి, యాత్రలకు శ్రీకారం చుడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story