"సీమను" సస్యశ్యామలం చేస్తాం.. సీఎం చంద్రబాబు
మౌలిక వసతులతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఓటర్లు కూటమిని, వరుణుడు చంద్రబాబు పాలనను కూడా కరుణించాడనే మాటలు ప్రతిధ్వనించాయి.
ఎన్నికల ఫలితాలే కాదు. వరుణుడు కూడా కూటమిని కనికరించాడని ఆ పార్టీల శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పాలన ప్రారంభమైంది. ప్రకృతి కూడా కరుణించింది. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడం వల్ల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. గతంలో ఉన్న అపప్రద తొలగింది. సీమను సస్యశ్యామలం చేస్తానని సీఎం చంద్రబాబు కూడా సంతోషంగా ప్రకటించారు. జనంలో కూడా ఇదే చర్చ జరిగింది.
సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్. చంద్రబాబు నాయుడు కుప్పం తరువా ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం, ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో పర్యటించారు.
సీఎం చంద్రబాబు పాలనలో వర్షాలు కురవవు అనే విమర్శలు మొదటి నుంచి ప్రతిపక్షాల నుంచి వినిపించేవి. ఈ ఏడాది చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టిన తరువాత సమృద్దిగా కురిసిన వర్షాలు కురిశాయి. నీటి వనరులు జలకళ సంతరించుకోవడం ద్వారా చంద్రబాబుపై ఉన్న అపప్రద చెరిగిపోయిందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాటల్లో కూడా అదే ప్రతిధ్వనించింది. కార్యక్రమం ఆసాంతం సీఎం చంద్రబాబు కూడా ఉత్సాహంగా కనిపించారు. ఈ పరిస్థితుల్లో పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబు శుక్రవారం శ్రీశైలంలో మల్లన్న చెంత ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చారు. ఇందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీలో రెండో పండుగకు కుప్పం తరువాత రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొదటిసారి పర్యటించారు.
కర్ణాటక.. ఆంధ్ర జీవనాడి
ఎగువ ప్రాంతంలోని తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఆంధ్రాలోని రైతులకు జీవనాడి నిండుకుండలా మారింది. తుంగభద్ర జలాశయానికి వరదనీరు పెరిగింది. దీంతో 25 క్రస్ట్ గేట్లు మూడు అడుగులు, మరో ఎనిమిది గేట్లు ఒక అడుగుమేర ఎత్తి, దిగువకు నీరు వదులుతున్నట్లు అధికారిక సమాచారం.1,23,381 క్యూసెక్కులు తుంగభద్ర నదిలోకి, 9379 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున డ్యాంలోకి ఇన్ ఫ్లో 74,,095 క్యూసెక్కులు ఉండగా, కాలువలకు వదిలేనీటిలతో పాటు ఔట్ ఫ్లో 1,32,760 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633.00 అడుగులతో 105 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి 1631.30 అడుగులతో 99.040 నీరు నిలువ ఉంచి, మిగతా నీటిని టీబీ బోర్డు అధికారులు దిగువప్రాంతానికి వదులుతున్నారు. హెచ్ఎల్ (హైలెవల్ కెనాల్) కర్నూలు సమీపంలోని ఆంధ్ర సరిహద్దు వద్ద 1138 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం మల్లన్న చెంతకు ...
తుంగభద్ర బహుళార్థక ప్రాజెక్టు నుంచి గదిగువన ఉన్న శ్రీశైలానికి ఎగువన ఉన్న వరదనీరు పరుగెడుతూ ఉంది. భారీగా వచ్చిన వరదనీటితో శ్రీశైలం జలాశయం దాదాపు నిండింది. ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు సామర్థ్యం 215.81 టీఎం సీలు కాగా, 212.92 టీఎంసీలకు చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మేరకు జలాశయంలోకి 3,80,113 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి 3,09,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరదనీటి ప్రవాహం కాస్త తగ్గడం వల్ల రెండు గేట్లు మూసేసి, ఎనిమిది క్రస్ట్ గేట్ల ద్వారా దిగువన సాగర్ కు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయంలో 312.05 టీఎంసీలకు గానూ, 157.42 టీఎంసీల నీరు చేరింది.
సీఎం చంద్రబాబు జలహారతి
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి వచ్చని నీటితో కళకళలాడుతున్న శ్రీశైలం జలాశయం ఉన్న సున్నిపెంట వద్ద సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. నీటి వనరులు కళకళలాడుతుంటే రైతుల కళ్లలో ఆనందం తాండవిస్తుంది. గంగమ్మకు చీర,సారె, పసుపు,కుంకుమ సమర్పించడం ఆనవాయితీ. ఇందుకోసం సీఎం ఎన్. చంద్రబాబు హెలికాప్టర్లో సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం వద్ద జలహారతి తరువాత, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాగార్జునసాగర్ జలాశయం వద్ద పూజలు నిర్వహించారు.
సీమను సస్యశ్యామలం చేస్తాం...
గతానికి భిన్నంగా తన పాలనలో వరుణదేవుడు కనికరించాడనే ఆనందం కనిపించింది. "రాయలసీమను మళ్లీ రతనాల సీమ చేస్తాం. ఇది సాధ్యం" అని శ్రీశైలం జలాశయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, "మనకు మంచి రోజులు వచ్చాయి. 20 ఏళ్ల తరువాత జలశాయం నిండింది" అని గుర్తు చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. సముద్రంలోకి వెళ్ల నీటిని అన్ని జలాశయాలకు పంపితే, కరువు ఉండదన్నారు. రాయలసీమలో అనేది కరువు అనేది లేకుండా చేయడం మనందరి బాధ్యత అన్నారు. అది దివంగత ఎన్టీఆర్ కల అని కూడా మననం చేసుకున్నారు.
"ఎన్టీఆర్ హంద్రీ నీవా, ఎస్ఆర్బాబీసీ, గాలేరు నగరి రిజర్వాయర్లు పూర్తి చేశా" అని వివరించారు. గతంలో తాను రూ. 69 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఐదేళ్లలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కేవలం రూ. 19 వేల కోట్లు మాత్రమే వెచ్చించారని తెలిపారు. "సీమలో " నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం " అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.
నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు ఎన్ఎండీ. ఫరూఖ్, బీసీ. జనార్ధనరెడ్డి, తో పాటు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, గౌరు చరితారెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గిత్త జయసూర్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో..
రాయలసీమకు కేంద్ర బడ్జెట్లో దాదాపు రూ. నాలుగు కోట్లు కేటాయించారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గుర్తు చేశారు. "సిద్ధేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి మంజూరు అయింది. అక్కడ బ్యారేజీ నిర్మిస్తే, 60 టీఎంసీల నీరు సద్వినియోగం చేసుకోవచ్చు " అని నంద్యాల ఎంపీ బైరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆమె సీఎం చంద్రబాబును కోరారు.
"శ్రీశైలం జలాశయం 20 ఏళ్ల తరువాత జూలైలో నిండడం" శుభదినమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఇలా జరిగిందంటూ పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. "2014-19 కాలంలో నీటి వాటాలకు సమస్య ఉన్నప్పటికీ పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే " అని గుర్తు చేశారు. మొత్తానికి రెండు దశాబ్దాల తరువాత శ్రీశైలం జలాశయం చంద్రబాబు పాలనలో నిండిందనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పదేపదే చెప్పడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఉత్సాహంగా నిర్వహించారు.
Next Story