
శేషాచలం కొండ దిగువకు చిరుతలు ఎందుకు వస్తున్నాయి.
ఎస్వీయూలో చిరుత అలజడి.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుతపులుల సంచారం పెరిగింది. బుధవారం తెల్లవారుజామున యూనివర్శిటీ సిబ్బంది క్వార్టర్స్ కు సమీపంలో తిరుగాడింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల వద్ద సిబ్బంది పెంచుతున్న కోళ్లపై దాడి చేయడానికి విఫలయత్నం చేసింది. అదృష్టవశాత్తు జనసంచారం లేకపోవడం ప్రతిసారి దాడుల నుంచి బయటపడుతున్నారు. అసలు ఈ ప్రదేశంలోనే చిరుతల సంచారం ఎందుకు ఉందనే విషయం చర్చకు ఆస్కారం కల్పించింది.
"విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఏమరపాటుగా ఉండవద్దు" అని అధికారులు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం ఆవరణలో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత జాడలు తెలుసుకునేందుకు అటవీశాఖ కూడా ట్రాప్ కెమెరాలు అమర్చింది.
విశ్వవిద్యాలయలో బుధవారం తెల్లవారుజామున చిరుత సంచారం దృశ్యాలు గమనించిన అధికారులు, అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. స్పందించిన తిరుపతి ఎఫ్ఆర్ఓ (Forest Range Officer) దశరథరెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. చిరుత జాడలు గమనించి, మళ్లీ అటవీప్రాంతంలోకి వెళ్లినట్టు ఆయన నిర్ధారించారు.
అయితే తిరుపతి అటవీ శాఖ అధికారులు చేస్తున్న సూచనలు పాటించడంలో వైఫల్యం కూడా చిరుతల సంచారం పెరగడానికి ఆస్కారం కల్పిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. నగరంలోని అలిపిరి నుంచి జూపార్క్ మార్గంలోని సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం శేషాచలం అటవీ ప్రాంతానికి దిగువనే ఉంటుంది. ఈ మార్గంలోనే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కూడా ఎక్కువగా ఉన్నాయి.
వ్యర్ధాల కోసం కుక్కలు
అలిపిరి నుంచి జూ పార్క్ మార్గంలో రోడ్డు పక్కన వ్యర్ధాలు పడడం వల్ల కుక్కల సంచారం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిరుతపులులు రావడానికి అవకాశం కలుగుతోందని తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దశరధరెడ్డి అభిప్రాయపడ్డారు. రోడ్డు పక్కన వ్యర్ధాలు పడవేయకుండా తిరుపతి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్న ఫలితం ఉండడం లేదు.
ఎస్వీ యూనివర్సిటీలో..
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో అంటే అలిపిరి నుంచి జూపార్క్ మార్గంలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉంది. వ్యర్ధాలు ఎక్కువ పడేస్తున్నారు. దీంతో చిన్నపాటి జింకలు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది. ఈ ప్రదేశాల్లో కుక్కలు, ఆవులు కూడా ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో చిరుత పులులు రావడానికి స్వాగతం పలుకుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా...
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలోనే ఉన్న ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున చిరుత సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. సిబ్బంది క్వార్టర్స్ వద్ద నాటు కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. ఈ వాసన పసిగట్టిన చిరుత ఆ ప్రాంతానికి రావడంతో పాటు నాటు కోళ్లపై దాడి చేయడానికి విఫలయత్నం చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. షెడ్యూల్లోకి చిరుతపుల ప్రవేశించిన సమయంలో బయట మనుషులు లేకపోవడం ప్రమాదం నుంచి బయటపడినట్లు అభిప్రాయపడుతున్నారు.
ఎస్వీ యూనివర్సిటీ సిబ్బంది క్వార్టర్స్ వద్ద సంచరించిన ఆ చిరుత పులి ఆ తర్వాత అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అక్కడి నివాసులు చెబుతున్నారు.
విశ్వవిద్యాలయం ఆవరణలోని పరిపాలన భవనానికి వెనుక పక్క ఉన్న ప్రదేశాలలో ఇప్పటికే అటవీశాఖ అధికారులు కూడా చిరుత పులి సంచారం పై జాగ్రత్తగా ఉండాలని బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.
"వ్యర్ధాలు పడవేయడం మానివేయాలి. కుక్కల సంచారాన్ని నివారించాలి. అప్పుడు మాత్రమే చిరుతపురుల కదలికలను నివారించవచ్చు" అని అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా సూచనలు చేశారు.
Next Story

