
పట్టపురాణికి శ్రీవారి కాసులహారం కానుక..
వైభవంగా శోభాయాత్ర. గజ, గరుడ వాహనాల్లో పద్మావతీ అమ్మవారికి అలంకరణ.
తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారంతో శోభాయాత్ర శుక్రవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ఈ హారాన్ని శ్రీవారికి అలంకరిస్తూ ఉంటారు. కార్తీక బ్రహ్మెత్సవాల వేళ తన పట్టపురాణి అలుమేలుమంగమ్మ (పద్మావతీ అమ్మవారికి) తిరుమల ఆలయం నుంచి కాసులహారం తీసుకుని వచ్చి సమర్పించడం ఆనవాయితీ.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం సమీపంలోని పసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల్లో ఊరేగిస్తే తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం వరకు తీసుకెళ్లారు.
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని తెలిపారు. పౌర్ణమి గరుడసేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీమలయప్పస్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
శుక్రవారం రాత్రి జరుగనున్న గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి.వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

