
కుప్పం: ఉచిత ప్రయాణానికి మహిళలు దూరం
సీఎం ఇలాకాలో నాలుగు రూట్లకు పరిమితం.
మరో రెండు గంటల్లో సీఎం ఎన్. చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయానికి పచ్చజెండా ఊపనున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళలు నాలుగు మార్గాల్లో మినహా, మిగతా ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయానికి దూరం చేశారు.
కుప్పం మూడు రాష్ట్రాలకు కేంద్రం. ఈ నియోజకవర్గం నుంచి సీఎం ఎన్. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం అధికారులు మరిచిపోయినట్టు ఉన్నారు.
కుప్పంలోని నాలుగు మార్గాల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించే పరిస్థితి కల్పించారు. దీనికి బస్సులన్నీ అంతర్రాష్ట్ర సర్వీసులంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు.
రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా మాత్రం రెండు ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ (APS RTC) బస్సుల్లో మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించడం లేదు. ఇందులో ఏపీ సీఎం (Chief Minister) ఎన్. చంద్రబాబు (N. Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహించే కుప్పం (Kuppam) నియోజకవర్గం ఒకటి. సప్తగిరి సర్వీసులు కావడం వల్ల తిరుపతి నుంచి తిరుమలకు ఈ పథకం వర్తింప చేయలేదు.
2024 ఎన్నికల హామీల్లో సూపర్-6 (Super-6) పథకాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం అమలు చేస్తామని సీఎం ఎన్. చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. అనేక దఫాలుగా సమీక్షలతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేశారు. ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఈ పథకాన్ని సీఎం ఎన్. చంద్రబాబు, జిల్లాల్లో మంత్రులు లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు సక్రమంగానే ఉంది.
ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం
రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్ ఐదు రకాల సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా మార్గదర్శకాలు విడుదల చేశారు. అందులో ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ సర్వీసులు, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సీటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అల్ట్రా డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదని ఆర్టీసీ అధికారులు ఈపాటికే ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఉచిత ప్రయాణ పథకం ఏ బస్సులో వర్తిస్తుందనే విషయాన్ని కూడా తెలిసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళలు, బాలికలకు ఇబ్బంది లేకుండా బస్సులపై స్త్రీశక్తి ఉచిత బస్సు అనే స్కిక్కర్లు కూడా అతికించారు.
కుప్పంలో ఎందుకు లేదు..
కుప్పం అనగానే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం ఎన్. చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఇప్పటికి కుప్పం నుంచి ఆయన 1989 నుంచి వసరుగా విజయం సాధిస్తున్న చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఎనిమిది దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాష్ట్రం మొత్తం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి వచ్చినా కుప్పంలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది.
కుప్పం మూడు రాష్ట్రాలకు కూడలి. ఈ పట్టణానికి పది నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక, తమిళనాడు విస్తరించి ఉంది.
"కుప్పం నుంచి వెళ్లే అంతర్రాష్ట బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు" అని డిపో మేనేజర్ ( kuppam Depo Manager) కుళాయిస్వామి చెప్పారు.
కుప్పం నుంచి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 15 మార్గాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు. ఈ మార్గాల్లో అల్ట్రా డీలక్స్ సర్వసుల్లో ఆర్టీసీ విధించిన నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం అనుమతించకపోవడం సహజమే. ఇదే మార్గాల్లో ఆర్డినరీ బస్సుల్లో కూడా వర్తింప చేయడంలేదు.
"కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాల పట్టణాలకు వెళ్లే మార్గంలో ఆంధ్రా పల్లెలు ఉన్నప్పటికీ ఈ పథకం వర్తించడం లేదు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం" అని కుప్పం డిపో మేనేజర్ కుళాయిస్వామి చెప్పారు.
ఈ మార్గాల్లో ఉచితం లేదు..
కుప్పం డిపో పరిధిలోని 15 మార్గాల్లో మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం దక్కకుండా పోయింది. నాలుగు రూట్లలో మాత్రమే ప్రయాణించే సదుపాయం ఏర్పడింది. అంతర్రాష్ట్ర సర్వీసులు అని చెబుతున్నప్పటికీ, ఆ మార్గాల్లో పల్లె వెలుగు బస్సుల్లో కూడా వర్తింపచేయడం లేదు. ఆ సర్వీసులు ఇవీ..
1) కుప్పం - కృష్ణగిరి : 4 సర్వీసులు
2) కుప్పం - తిరుపత్తూరు : 3 సర్వీసులు
3) కుప్పం - గుండ్లమడుగు - తిరుపత్తూరు: 01 సర్వీసు
4) కుప్పం - వేపనపల్లి: 02 సర్వీసులు
5) కుప్పం - Kgf : 05 సర్వీసులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)
6) శాంతిపురం - Kgf : 1 సర్వీసు
7) విజిలాపురం - kgf : 1 సర్వీసు
8) ధర్మపురి - తిరుమల : 1 సర్వీసు
9) కృష్ణగిరి - Tirumala: 16 సర్వీసులు
10) కృష్ణగిరి - తిరుపతి: 2 సర్వీసులు
11) గెసికపల్లి - Kgf : 1 సర్వీసు
12) కుప్పం - vkota- పెర్నంబట్ : 01 సర్వీసు
13) కుప్పం - Kgf - Vellore : 02 సర్వీసులు
14) కుప్పం - వానియంబడి : 01 సర్వీసు
15) కుప్పం - Barugur :02 సర్వీసులు
నోట : ఈ మార్గాలన్నీ అంతర్రాష్ట్ర సర్వీసులు అని డిపో మేనేజర్ స్వామి వెల్లడించారు.
"కుప్పం- తిరుపతి, పొరుగు రాష్ట్రాకు వెళ్లే మార్గంలో ఉన్న ఆంధ్రా పరిధిలోని పొగురుపల్లె, బల్ల, యనమనాశనపల్లె, చిన్నొబ్బ సర్వీసుల్లో ఇతర ట్రిప్పులు ఉన్నా, డా మహిళలకు స్త్రీ శక్తి వర్తించదు" అని కుప్పం డిపో మేనేజర్ స్వామి సిబ్బందికి సర్క్యులర్ జారీ చేశారు.
ఓ ఉదాహరణ పరిశీలిద్దాం.
కుప్పం నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు ప్రతినిధులుగా ఇక్కడే ఎంఎల్సీసి కంచర్ల శ్రీకాంత్, కడా ప్రత్యేకాధికారి ఇక్కడి పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం నేపథ్యంలో పరిస్థితులను వారు సమీక్షించలేదనే విషయం స్పష్టమైంది. కుప్పం చుట్టుపక్కల పట్టణాలు తమిళనాడు, కర్ణాటక మధ్య రాకపోకలు ఉంటాయి. ఈ మార్గంలో ఆంధ్రా పల్లెలు ఉన్నప్పటికీ మహిళలు, బాలికలు ప్రయోజనం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
1. కుప్పం నుంచి తమిళనాడులోని కృష్ణగిరి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడికి అల్ట్రా డీలక్స్ సర్వీసులతో పాటు ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా నడుపుతున్నారు. ఈ మార్గంలో ఆర్డీనరీ బస్సుల్లో కూడా మహిళకు ఉచితంగా ప్రయాణించే సదుపాయం లేకుండా పోయింది.
కుప్పం దాటగానే ఇదే మార్గంలో మూడు ఆంధ్రా పరిధిలో తంబిగానిపల్లె, నడుమూరు, వెండిగంపల్లె, బిరుద పల్లె, మోడల్ స్కూల్ తోపాటు మరో రెండు పల్లెలు ఉన్నప్పటికీ వారికి కూడా ఉచిత ప్రయాణం వర్తించదని డిపో మేనేజర్ స్వామి చెబుతున్నారు. ఆర్డినరీ బస్సు అయినా అంతర్రాష్ట్ర సర్వీసుగానే భావిస్తున్నారు. దీంతో ఉచిత ప్రయాణం వర్తించని పరిస్థితి.
2. కుప్పం నుంచి పేర్నాంబట్టు మార్గంలో ప్రయాణం కూడా విచిత్రంగా ఉంటుంది. ఆంధ్ర పరిధిలోని శాంతిపురం, పలమనేరు నియోజకవర్గం వి.కోట మీదుగా రాజపేటరోడ్డు మార్గం నుంచి కర్ణాటకలోకి వాహనాలు వెళతాయి. కానీ ఆ మార్గంలో ఉన్న ప్రధాన మండల కేంద్రాలు, పల్లెల మహిళలు కూడా టికెట్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతర్రాష్ట్ర సర్వీసులు తిరిగే మార్గాల్లో ఆర్టీసీ నిర్దేశించిన ఐదు సర్వీసుల్లో కూడా కుప్పం ప్రాంతంలోని ఆంధ్ర మహిళలు లబ్ధిపొందలేని పరిస్థితిపై అధికారులు ముందస్తుగా సమీక్ష నిర్వహించలేదని ఆర్టీసీ అధికారుల ద్వారా తెలిసింది. దీనిపై రాష్ట్ర రవాణా శాఖాధికారుల స్పందన ఏమిటనేది వేచిచూడాల్సిందే.
Next Story