
తిరుమల శ్రీవారి పాదాలను స్పర్శించనున్న కృష్ణమ్మ
ఏడాదిలోపు యాత్రికుల దాహం తీర్చనున్న కృష్ణా జలాలు.
కర్నూలు జిల్లా మల్యాల నుంచి కృష్ణా జలాలు 738 కిలోమీటర్లు ప్రయాణించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువకు మధ్యలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి పైపులైన్ ద్వారా తిరుమలకు కృష్ణమ్మ పరవళ్లు సాగనున్నాయి.
చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చంద్రగిరి నుంచి కల్యాణి డ్యాం నుంచి ఎత్తిపోతలు, పైప్ నిర్మాణంతో కృష్ణా జలాలు చేరనున్నాయి. ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం 126 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆదేశాలు జారీ చేసింది.
జలవనరుల శాఖపై ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జలవనరుల శాఖపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే..
"తిరుపతి పారిశ్రామిక అవసరాలు, తిరుమలలో యాత్రికుల దాహం తీర్చడానికి కృష్ణా జలాలు తరలిస్తాం" స్పష్టంగా ప్రకటించారు. అంతకుముందు జూలైలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నపుడు కూడా అదే మాట చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిధులు కూడా విడుదల చేయడం ద్వారా మాట నిలుపుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.
తిరుమలకు కల్యాణి డ్యాం వరం..
శేషాచలం పర్వతసానువులకు దిగువన చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని కల్యాణి డ్యాం నుంచి ఇప్పటికే నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరుపతి తోపాటు తిరుమలలో యాత్రికుల నిత్యావసరాలకు నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వసతి కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు ప్రారంభించడం గమనార్హం.
చంద్రగిరిలో వెయ్యి ఎకరాల సాగు
చిత్తూరు జిల్లా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో 126 కోట్ల రూపాయాలతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
అడవిపల్లె రిజర్వాయరు నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణం డ్యాం ద్వారా తిరుమల, తిరుపతికి తాగు నీరు అందించే పథకంలో ఎత్తిపోతలతో నిర్మించే పైప్ లైన్ నిర్మాణానికి టీడీపీ కూటమి ప్రభుత్వం 126 కోట్లు కేటాయిస్తూ, ఈ నెల 15న జీఓ ఆర్టీ నంబర్ 560 నంబర్ తో ఉత్తర్వులు జారీ చేసింది.
"సంవత్సరం లోపల ఈ పథకం పూర్తి చేయడానికి వీలుగా ఆదేశాలు అందాయి. నిధులు కూడా విడుదల చేశారు" అని తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వంలోనే పునాది.. నీటి విడుదల
నాలుగు దశాబ్దాల పాటు రాజకీయంగా ఆరోపణలు, విమర్శలకు హంద్రీ నీవా కాలువ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత సీఎం నారా చంద్రబాబు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా నిర్థిష్ట కాలవ్వవధిలో కాలువ నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి చేయించడం ద్వారా ఈ సంవత్సరం ఆగష్టు 29వ తేదీ కుప్పం వద్ద హంద్రీనీవా జలాలకు హారతి ఇవ్వడం ద్వారా రైతుల సుదీర్ఘ స్వప్నం సాకారం చేశారు.
రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 38 అసెంబ్లీ స్థానాల పరిధిలో హ్ంద్రీనీవా కాలువలో ప్రవహించే కృష్ణాజలాలను కీలక రిజర్వాయర్లతో పాటు 550 చిన్న, పెద్ద చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడింది.
తిరుమల కోసం మరో యజ్ణం
రాయలసీమకు వరప్రసాదిని అయిన హంద్రీనీవా కాలువకు మాజీ సీఎం ఎన్టీరామారావు కాలంలో పునాది వేస్తే, నాలుగు దశాబ్దాల తరువాత మళ్లీ టీడీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ పథకాన్ని తిరుపతికి చేరవ చేయడానికి కూడా మార్గం సిద్ధం చేశారు. సీఎం నారా చంద్రబాబు ఆలోచనకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాచరణ పనిచేసింది.
కడపకు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవి.పల్లె మండలంలో ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చంద్రగిరి మీదుగా తిరుమలకు తాగునీటిని అందించే భృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
పుంగనూరు బ్రాంచ్ నుంచి..
పుంగనూరు బ్రాంచ్ కాలువ నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణిడ్యాం వరకు పైప్ లైన్ నిర్మాణంతో కృష్ణా జలాల తరలింపునకు కార్యక్రమం సిద్ధం చేశారు. దీనికి 126 కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టుకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుగంగ సీఈ చంద్రశేఖర్ కూడా ఈ విషయం ధృవీకరించారు.
పైప్ లైన్ ఇలా...
పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చంద్రగిరి మీదుగా కల్యాణి డ్యాం వరకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మీదుగా భీమవరం చెరువు, మూలపల్లె చెరువు సమీపంలోని మరో మూడు చిన్న చెరువులకు ఎత్తిపోతల ద్వారా ఎత్తపోతల ద్వారా కృష్ణా జలాలు తరలిస్తారు. అక్కడి నుంచి కొండ్రెడ్డి కండ్రిగ, కణితి మడుగు, నాగపట్న వెంకటరాయుని చెరువులను కృష్ణా జలాలతో నింపడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ఊరిపిపోయనున్నారు. ఆ తరువాత కల్యాణిడ్యాంకు జలాలు తరలిస్తారు.
తాగునీటి అవసరాల కోసం..
చంద్రగిరి మండలం పోలీస్ శిక్షణ కళాశాల వద్ద కల్యాణి డ్యాం 1975లో నిర్మించారు. శేషాచలం అటవీప్రాంతానికి దిగువన ఉన్న ఈ డ్యాంలోకి తిరుమల గిరుల తోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీటితోనే నిండుతుంది. తిరుపతి, తిరుమలలో తాగునీటి అవసరాల కోసమే ఈ డ్యాం నిర్మించారు. 1999లో కల్యాణి డ్యాంకు తాగునీటిని తరలించడానికి రెండు చోట్ల పంప్ హౌస్ లు, నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని 1999లో టీడీపీ ప్రభుత్వంలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
కృష్ణా జలాలు కల్యాణి డ్యాంలోకి తరలించడం ద్వారా వర్షాభావ పరిస్థితి ఏర్పడినా తిరుమలలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పం నెరవెరనున్నది.
తిరుమలకు ప్రస్తుతం కల్యాణి డ్యాం నుంచే కాకుండా, తిరుమలగిరుల్లోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కొండకోనల్లో ఏర్పాటు చేసిన కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టుల నుంచి నీటిని శుద్ధి చేసి, తిరుమలకు తరలిస్తున్నారు.
"కృష్ణా జలాల తరలించే ప్రక్రియ ప్రారంభమైతే తిరుమలలో నీటికి కొరత అనే మాటకు చోటు ఉండదు" అని సీనియర్ జర్నలిస్టు పీవీ. రవికుమార్ అభిప్రాయపడ్డారు.
"దశాబ్దాల కాలంగా కృష్ణా జలాల తరలింపు ప్రక్రియ రాజకీయ అస్త్రంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వ చొరవ వల్ల చిత్తూరు ప్రజలు, ప్రధానంగా రాయలసీమ వాసులు సుదీర్ఘ కల నెరవేరింది" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
"తిరుమలకు కృష్ణా జలాలు తరలించడానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమర్ రెడ్డి ఆలోచన ఉపయోగపడింది" అని రవికుమార్ చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నసమయంలోనే కృష్ణా జలాలు తిరుపతి వరకు తీసుకుని రావాలనే ఆలోచన చేయడంతో పాటు తంబళ్లపల్లె నుంచి చిత్తూరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు వరకు కాలువ పొడించాలనే సవరణ వల్ల తిరుమలకు కృష్ణా జలాలు తిరుమలకు చేరేందుకు మార్గం ఏర్పడింది" అని వివరించారు.
తాగునీరు.. సేద్యపు నీరు
కల్యాణి డ్యాంకు దిగువన, సమీప ప్రాంతాల్లోని పొలాలకు తగినంత సేద్యపు నీరు అందని పరిస్థితి ఉంది. కృష్ణా జలాలు కల్యాణి డ్యాంలోకి చేరితే తిరుపతి ప్రజలు, తిరుమల యాత్రికులకు దాహం తీరడంతో పాటు డ్యాం సమీప ప్రాంతాల్లోని రైతుల కష్టాలు కూడా తీరేందకు ఆస్కారం ఉంది. డ్యాంలోకి నీరు చేరితే దిగువ ప్రాంతంలోని వ్యవసాయానికి కూడా మేలు జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖలోని తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్ ఏమంటున్నారంటే..
"అడవిపల్లె రిజర్వాయర్ నుంచి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం. ఆ తరువాత గ్రావిటీ ద్వారా 40 క్యూసెక్కుల నీటిని మూలపల్లె చెరువు నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుమలకు సమీపంలో ఉన్న కల్యాణి డ్యాంకు తరలిస్తాం" అని చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్ వివరించారు. ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల నాలుగు చెరువులను అనుసంధానం జరుగుతుంది. తద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో 1,154 ఎకారాల్లో సేద్యపునీటి అవసరాలు తీరుతాయని ఆయన చెప్పారు. ఏడాదిలోపు తిరుమలకు కృష్ణా జలాలు అందించడానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన స్నష్టం చేశారు.
Next Story