TDP | స్వపక్షాన్ని ఇరుకున పెట్టేలా కోటంరెడ్డి అడుగులు?
x

TDP | స్వపక్షాన్ని ఇరుకున పెట్టేలా కోటంరెడ్డి అడుగులు?

నెల్లూరులో కొత్తరాజకీయం ప్రారంభమైంది. జమిలీ ఎన్నికలు వస్తే, వైసీపీ నేర్పిన బాటలో తమ్ముడికి కోసం టీడీపీ ఎమ్మెల్యే తెరతీశారు. ఈ కార్యక్రమం చర్చకు తెరతీసింది.


సింహపురిలో పార్టీ ఏదయినా సరే. రాజకీయాలు పెద్దరెడ్ల మధ్యే పరిభ్రమిస్తాయి. మిగతా వారి సంగతి పక్కకు ఉంచితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు వ్యూహాత్మంగా వేస్తున్న అడుగులు చర్చనీయాశంగా మారాయి. స్వపక్షంలో ఉంటూ, రాజకీయ చర్చకు తెరతీశారు.

సమీప కాలంలో ఎన్నికలు లేవు. అయినా, తమ్ముడు కోటంరెడ్డి గిరిధరరెడ్డి చేపట్టిన కార్యక్రమానికి ఆయన అన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అండగా నిలిచారు. "గడప గడపకు గిరిధరరెడ్డి" పేరిట చేపట్టిన కార్యక్రమం వెనక ఆంతర్యం ఏమిటనే విషయం చర్చకు తెరతీసింది. దీని వెనుక పక్కా వ్యూహం ఉందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. కుదిరితే అసెంబ్లీ లేదంటే కార్పొరేషన్ లో పాగా వేయాలనేదే ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన చేపట్టిన కార్యక్రమంతో ..

నెల్లూరు నగరంలో కీలకమైన రామలింగాపురం సర్కిల్ బుధవారం కిటకిటలాడింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి మద్దతుదారులు, టీడీపీ శ్రేణులతో బహిరంగసభను తలపించింది. "అధికారంలో ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా. మాకు ప్రజల మధ్య ఉండడమే ప్రధానం" అని గిరిధరరెడ్డి ముక్తాయించారు.
ఎమ్మెల్యేగా ఉంటూనే సూటి ప్రశ్నలతో స్వపక్షాన్ని కూడా ఇరుకున పెట్టడంలో కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మహానేర్పరి. దిట్ట అని కూడా సింహపురి నేతలు చమత్కరిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా... అధికారపక్షంలో ఉన్నా సరే. ప్రశ్నించి, ఇరుకున పెట్టడంలో శ్రీధరరెడ్డి తన ప్రత్యేకతను చాటుకోవడంలో ఏమాత్రం తగ్గనే తగ్గరు. తద్వారా జనంలో తన ఇమేజ్ పెంచుకోవడంలోనే కాదు. ప్రజా సమస్యలపై "ప్రశ్నించే తీరులోనూ తగ్గేదే లే" అని కూడా అనిపించుకున్న ఘటనలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు..
మొదట వైసీపీ "గడప గడపకు" పేరును తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కూడా వీధిబాట పట్టించిన విషయం తెలిసిందే. అందులో తొలుత వైసీపీలో ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన వారిలో ఒకరు. ఆ కోవలో ఆయన తమ్ముడు గిరిధరరెడ్డి చేపట్టారు. దీని మర్మం ఏమిటనేది పరిశీలకులు మధిస్తున్నారు.
రాజకీయంగా అన్నదమ్ముల వ్యూహం వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఏదో ఉందనే విషయంపైనే నెల్లూరు జిల్లాలో చర్చ జరుగుతోంది. వారి రాజకీయ వ్యవహారాల్లో పదేళ్లు వెనక్కు వెళితే...
2014 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధరరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 25,653 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే,
నెల్లూరు రూరల్ లోని చాణక్యపురి వద్ద మురుగునీరు ప్రవహించే మార్గం లేక జనం ఇబ్బంది పడుతున్నారు. నగర పాలక సంస్ధ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోలేదు.
2018 డిసెంబర్ 5న "మోకాలిలోతు మురుగునీటిలోకి దిగి, గంటపాటు కదలకపోవడం" ఆయనకే చెల్లింది. కాలువపై బ్రడ్జి నిర్మాణ పని గంటలో పని ప్రారంభించి, 45 రోజుల్లో పూర్తి చేస్తాం" అని అధికారులు హామీ ఇచ్చే వరకు బయటకు రాకుండా ప్రజల్లో మాస్ క్రేజ్ పొందారు.
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పై 20,776 ఓట్ల మెజారిటీతో కోటంరెడ్డి శ్రీధరరెడ్డి విజయం సాధించారు. తన అసెంబ్లీ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చారు. అప్పటి సీఎం వైఎస్. జగన్ ఓకే అన్నారు. అయినా నిధులు మంజూరు కాలేదు. జీఓలు విడుదల చేయలేదు. దీంతో..
"ప్రతిపక్షంలో సీఎం చంద్రబాబు నా అసెంబ్లీ సెగ్మెంట్ కు పనులు మంజూరు చేశారు. అధికార పార్టీలో ఉండి కూడా నేను పనులు సాధించుకోలేకపోతున్నా. జనం, కమ్యూనిస్టులు ప్రశ్నిస్తే, నేనేమి సమాధానం చెప్పాలి అధ్యక్షా.." అని
ఏకంగా అసెంబ్లీలోనే వైసీపీ ప్రభుత్వాన్ని అప్పటి సీఎం వైఎస్. జగన్ ను ఇరకాటంలో పెట్టడం కూడ ఆయనకే సాధ్యమైందనే విషయం సుస్పష్టం. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి, టీడీపీ నేత పెంచుమర్తి అనూరాధ విజయానికి సహకారం అందించారు. అనే ఆరోపణలపై వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి ఆ పార్టీకి దూరం కావడం, టీడీపీలో చేరడం తెలిసిందే.
2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డిపై 34,480 ఓట్ల భారీ మెజారిటితో కోటంరెడ్డి శ్రీధరరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు.
ఆయన మాటల్లో చెప్పాలంటే "నా తమ్ముడు గిరిధరరెడ్డి నాకు పెద్దబలం" అని మమకారాన్ని చాటుకున్నారు.
సాధారణంగా "పుడతా అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు" అనేది ఓ సామెత. కోటంరెడ్డి సోదరులు మాత్రం తామెప్పటికీ అలా ఉండమనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నట్లే కనిపిస్తోంది.

తమ్ముడి కోసం..

నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. అన్నకు తోడుగా ప్రజాక్షేత్రంలో తమ్ముడు గిరిధరరెడ్డి అన్నీ తానై వ్యవహారాలను చక్కదిద్దారనేది ఆ జిల్లా నేతలే కాదు. మీడియా ప్రతినిధులు కూడా చెబుతున్నమాట.
సమీపకాలంలో ఎన్నికలు కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తమ్ముడు "గడప గడపకు గిరిధరరెడ్డి" కార్యక్రమం నిర్వహించడం వెనుక ఓ లక్ష్యం ఉన్నట్లే ఆ జిల్లా మీడియాతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.
" ఈ నియోజకవర్గం నుంచి తన వారసుడిగా" తమ్ముడు గిరిధరరెడ్డిని ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. "పార్టీ ఏదయినా సరే. జనంలో పట్టు కోల్పోకూడదు" అనే వ్యూహంతోనే కోటంరెడ్డి సోదరులు పావులు కదుపుతుంటారని చెబుతున్నారు. ఆ కోవలోనే గిరిధర రెడ్డి "గడప గడపకు" కార్యక్రమం చేపట్టిన ప్రధాన ఉద్దేశం అని కొందరు చెబుతుంటే, వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఆశించి, భంగపడిన శ్రీధరరెడ్డి, ప్రస్తుతం సీఎం ఎన్. చంద్రబాబు వద్ద తన పరపతి ఏ స్థాయిలో ఉందో నిరూపించుకోవడానికే కొత్త ఎత్తుగడ వేసినట్లు కూడా కనిస్తోందని ఇంకొందరు భావిస్తున్నారు. తద్వారా..
నెల్లూరు నగర కార్పొరేషన్ కు మరో రెండేళ్లలోపే ఎన్నికలు జరగనున్నాయి. రూరల్ నియోజకవర్గం పరిధిలో 26 డివిజన్లు ఉంటే, కోటంరెడ్డి సోదరులదే హవా. కుదిరితే ఈ పదవి. లేదంటే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదనంగా నెల్లూరు బిట్ -1,2,3 అసెంబ్లీ సెగ్మెంట్లుగా విభజించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమం చేపట్టారనేది చర్చ జరుగుతోంది.
రామలింగాపురం సర్కిల్ లో....
నెల్లూరు రామలింగాపురం సర్కిల్ ఓ ల్యాండ్ మార్క్. కోటంరెడ్డి గిరిధరరెడ్డి శ్రీకారం చుట్టిన గడప గడపకు కార్యక్రమంతో బుధవారం ఈ సెంటర్ బహిరంగ సభను తలపించింది. టీడీపీ శ్రేణులు, కోటంరెడ్డి మద్దతుదారులు ఆ స్థాయిలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై గిరిధరరెడ్డి ఏమంటున్నారంటే..

"గడచిన పదేళ్లలో మా అన్న, రూరల్ ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి నాలుగుసార్లు ప్రతి ఇంటికీ వచ్చారు" అని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అని గిరధరరెడ్డి స్పష్టం అన్నారు.
"ఎన్నికలు ఉన్నా, లేకున్నా, మేము నిరంతరం ప్రజల మధ్యే ఉంటాం. అని టీడీపీ నేత గిరిధరరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం" అని కూడా ఆయన చెప్పారు.
మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డి సోదరుల ఎత్తుగడ ఏంటనేది పక్కన ఉంచితే, కొత్త చర్చకు తెరతీశారు. చాలా మంది నోటి నుంచి వినిస్తున్న మాట ఏమిటంటే.. నియోజకవర్గాల విభజన జరిగితే ఒకతీరు. లేదా స్థానిక సంస్థల్లో కీలక పదవిలో పాగా వేయాలనేది వారి మదిలో ఉన్న ఆలోచనను వెల్లడి చేస్తున్నట్లే భావిస్తున్నారు. దీనిని టీడీపీ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది. కోటంరెడ్డి సోదరుల వ్యూహాలు ఫలించే విషయంలో సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
Read More
Next Story