
మధ్యాహ్న భోజనం కల్తీ.. పది మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రొద్దుటూరు జెడ్పీ హైస్కూల్ లో ఏమి జరిగింది?
పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థుల్లో దాదాపు పది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసినా ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు మీడియాకు సమాచారం అందించడంతో స్పందించిన టీచర్లు బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
ప్రొద్దుటూరు పట్టణం వసంతపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఆ ఆహారం తీసుకున్న విద్యార్థులు కొంతసేపటికి అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్లో కొందరు వాంతులు చేసుకోవడం, ఇంకొందరు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. దాదాపు గంటపాటు ఇబ్బంది పడినట్టు తెలిసింది. వెంటనే పాఠశాల హెడ్మాస్టర్ గుర్రప్ప స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల నుంచి ఈ సమాచారం తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు వెళ్లడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలిసింది.
ఆస్పత్రికి తరలింపు..
వసంతపేట జెడ్పీ హైస్కూల్ లో సుమారు 200 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. మధ్నాహ్న భోజనం చేసిన తరువాత వారిలో సుమారు పది మంది విద్యార్థులు వాంతులు, కడపునొప్పితో బాధపడ్డారు. ఆ డిన విద్యార్థులను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించకుండా ఉపాధ్యాయులు ఆపివేయించారని తెలిసింది.
కారణం ఇదీ..?
విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు భావిస్తున్నారు. అందుకు ప్రధానంగా కందిపప్పు పురుగు పట్టకుండా నివారించడానికి గుళికలు వేశారని సమాచారం. అయితే ఆహార పదార్ధాల తయారీలో ప్రధానంగా పప్పు వండే సమయంలో గుళికలు తీసి వేయకుండా, వండడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

