
తండ్రిని బంధించి.. తల్లిని హత్య చేసి.. పాటలు విన్న కొడుకు!
ప్రొద్దుటూరులో అమానుష ఘటన.
ప్రేమానురాగం, ఆప్యాయతలు మంట గలుస్తున్నాయి. కుటుంబాల్లో జరుగుతున్న ఘటనలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అనే మాటను నిజం చేసే సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.
ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి పంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బందీ చేశాడు. తల్లిని చంపిన తరువాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానే తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. ఆ వివరాలివి.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరాంనగర్ కు చెందిన లక్ష్మీదేవి, విజయభాస్కరరెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీ.టెక్ చదవాడు. హైదరాబాదులో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతినెలా తల్లిదండ్రులు లక్ష్మీదేవి, విజయభాస్కరరెడ్డి ప్రతి నెలా డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట మూడు వేల రూపాయలు పంపిస్తే, పది వేలు కావాలని పట్టుబట్టడాని తండ్రి విజయభాస్కరరెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు.
తల్లిని చంపి పాటలు వింటూ..
ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కరరెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టిన బంధించాడని తెలిసింది. తరువాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తు కూర్చున్నట్లు చెబుతున్నారు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కరరెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కరరెడ్డిని విడిపించారని తెలిసింది. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతని తండ్రి విజయభాస్కరరెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Next Story