
కడప:ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్
ఒంటిమిట్టలో మధ్యాహ్నం అరువాత ఉద్రిక్తత. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో తక్కువ పోలింగ్ నమోదు.
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముఖ్య సమయానికి..
పులివెందులలో 76. 44 శాతం, ఒంటిమిట్టలో 79.39 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 14వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఆ తర్వాత ఎవరు విజేతలు అనేది భవిష్యత్తు తేలనుంది.
ఇదిలావుంటే.. పులివెందుల జెడ్పిటిసి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆయన స్వగ్రామంలో వందలాది మంది మహిళలు కూడా ఓటు వేయలేదు. ఒంటిమిట్టలో ఊహించని విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఒంటిమిట్టలో ఉద్రిక్తత
ఒంటిమిట్ట మండలంలో...
మధ్యాహ్నం తర్వాత టిడిపి నాయకులు పోలింగ్ కేంద్రంలో ఉన్నారనే సమాచారం బయటకు తెలిసింది. రాజంపేట ycp ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ys. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఒంటిమిట్టలో పోలింగ్ కేంద్రంలోకి రవీంద్రనాథ్ రెడ్డి దూసుకుని వెళ్లారు. అదే సమయంలో ఆయన వెంట వైసీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
పోలీసుల వలయాన్ని కూడా ఛేదించుకొని రవీంద్రారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి దూసుకుని వెళ్లారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒంటిమిట్ట వద్ద అర్ధగంటసేపు పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత పరిస్థితి చక్కదిద్దడంతో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లతో వారి హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి ఏడో నెంబర్ పోలింగ్ కేంద్రంలో కూడా ఉద్రిక్త పరిస్థితి రాజ్యమేలేంది. వైసిపి నాయకులు, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా రంగం లోకి ఒంటిమిట్ట మండలంలో పోలింగ్ సరలిని పర్యవేక్షించారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..
"వైసిపి ప్రభుత్వానికి భిన్నంగా టిడిపి కూటమి ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చింది. అభ్యర్థులు పోటీ చేయడమే కాకుండా, ఓటర్లు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాం" అని మంత్రి రాంప్రసాద్రెడ్డి వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు కూడా వేసే పరిస్థితి కూడా లేకుండా చేసిన విషయాన్ని మంత్రి మండిపల్లి గుర్తు చేశారు.
"మేము కూడా అలా అనుకుని ఉంటే, ఉప ఎన్నికలను ఏకపక్షం చేసి ఉండేవాళ్ళం. టిడిపి నైజం అది కాదు" అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పులివెందుల ప్రశాంతం
కడప జిల్లాలో జడ్పిటిసి ఉప ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల పరిస్థితిని తలపించింది. ఇందులో ప్రధానంగా పులివెందులలో చెదురు మొదలు సంఘటనలు మినహా వైసిపి నేతల నుంచి ప్రతిఘటన తక్కువ అనడం కంటే ఏమాత్రం లేదని చెప్పడంలో సందేహం లేదు.
"టిడిపి నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారికి పోలీసులు సహకారం అందించారు" అనేది కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి ఆరోపణ. పులివెందులలో వైసీపీ నుంచి ప్రతిఘటన లేకపోవడం కూడా చెదురు మధురు సంఘటనలు మినహా ఉద్రిక్తతకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగడం కూడా ఓ విధంగా ఆశ్చర్యమే.
రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి 30 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. సగం వంతు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సరళి జరగడం ఇక్కడ ఈసారి ప్రత్యేకంగా కనిపించింది. మండల పరిధిలో జరిగే ఎన్నిక కావడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి చేయి దాటకుండా చర్యలు తీసుకున్నారు.
కడప జిల్లాలో జరిగిన జెడ్పిటిసి ఉప ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయో అనే చర్చకు కూడా తెరతీశాయి.
Next Story