
రాజంపేట మండలం తాళ్లపాక వద్ద చెట్టు కింద మృతదేహంతో భార్య కొడుకు.
ఇదేనా మానవత్వం..! వీధిలోనే ఆగిన మృతదేహం..
రాజంపేట వద్ద అద్ద ఇంటి యజమాని తీరుతో తల్లడిల్లిన కుటుంబం.
మానవత్వానికి కట్టుబాటు అడ్డుగోడగా మారింది. మృతదేహాన్ని ఇంటి ఆవరణలోకి అనుమతించలేదు. వీధిలోనే చెట్టు నీడలో భర్త మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టిన భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా, అద్దె ఇంటి యజయాని మనసు కరగలేదు. ఆ పల్లె కూడా కనికరించ లేదు. ఈ అమానవీయ ఘటన కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాకకు సమీపంలోని ఎల్లాగడ్డ గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
భర్త మృతదేహాన్ని వీధిలోనే చెట్టు కింద మంచంపై పడుకోబెట్టారు. భార్య, ఇద్దరు కుమారులు మినహా వారికి నా అనేవారు లేరు. తన మెడలో మూడు ముళ్లు వేసిన భర్త మృతదేహం కాళ్ల బొటనవేళ్లకు తాడు కడుతూ ఆ మహిళ పొగిలి పొగిలి రోదించింది. అయినా, ఆ ఊరి జనంలో మానవత్వం మేలుకోలేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసిన తరువాత కూడా ఇంటి యజమానిలో ఎలాంటి మార్పు లేదు. ఈ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నుంచి బతుకుదెరువు కోసం జోగారావు, వెంకటలక్ష్మి దంపతులు కొన్నేళ్ళ కిందట రాజంపేటకు వచ్చారు. తాళ్లపాక గ్రామానికి వెళ్లే మార్గంలో ఎల్లాగడ్డ వద్ద వారు ఓ బీసీ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. జోగారావు పెయింటింగ్ పనులు చేస్తుంటే, భార్య వెంకటలక్ష్మి ఓ ప్రయివేటు కాలేజీలో చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. వారికి 7,8 తరగతులు చదువుతున్నకొడుకులు, ఓ కూతరు ఉంది.
అనారోగ్యానికి గురైన జోగారావును చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. గుండెపోటుతో ఆయన అక్కడే మరణించారు. నా అనే వారు లేని స్థితిలో భర్త జోగారావు మృతదేహాన్ని కొడుకులతో కలిసి అంబులెన్స్ లో తీసుకుని భార్య వెంకటలక్ష్మి ఎల్లాగడ్డ వద్ద ఇంటికి తీసుకుని వచ్చింది.
వీధిలోనే మృతదేహం.. కనికరించని జనం
గుండెపోటుతో మరణించిన జోగారావు మృతదేహాన్ని ఇంటి సమీపంలోకి తీసుకుని రావడానికి యజమాని అడ్డు చెప్పారు. గంటల తరబడి అంబులెన్స్ లోనే మృతదేహం ఉంచిన భార్య వెంకటలక్ష్మి, కొడుకులు కన్నీరు మున్నీరయ్యారు. అయినా, గ్రామంలోని వారెవరు స్పందించకుండా అమానవీయంగా వ్యవహరించారు. చివరాఖరికి గ్రామస్తులు కూడా ఎవరు దరిదాపుల్లోకి రాలేదు.
గత్యంతరం లేని స్థితిలో వీధిలోనే ఓ మంచంపై భర్త మృతదేహాన్ని పడుకోబెట్టింది. ఓ చిన్న గన్నేరునపూల మొక్క నీడలో ఉంచి. తల వద్ద దీపం వెలిగించిన వెంకటలక్ష్మి, హిందూ సంప్రదాయం ప్రకారం భర్త కాళ్లను ఒక్కటిగా చేసి, బొటనవేళ్లను కూడా తెల్లటిదారంతో కడుతూ, కన్నీటి పర్యంతమైంది. దగ్గరే ఉన్న ఇద్దరు కొడుకుల కంట కన్నీటిధారలు కనిపించాయి.
భర్త చనిపోయిన విషయాన్ని తాను పనిచేసే కాలేజీ యజమానికి వెంకటలక్ష్మి సమాచారం ఇచ్చింది. ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. స్పందించిన రాజంపేట పట్టణం మన్నూరు సీఐ జే. ప్రసాద్ బాబు, హెడ్ కానిస్టేబుల్ నాగూరు అహ్మద్ సిబ్బందితో కలిసి ఎల్లాగడ్డ గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు చెబుతున్నా, అద్దె ఇంటి యజమాని దిగి రాలేదు. గ్రామంలో కట్టుబాటును గుర్తు చేసిన ఆ యజమాని శవాన్ని ఇంటి ఆవరణలోకి కాకుండా, వీధిలో ఉంచడానికి మాత్రమే అంగీకరించారు. చనిపోయిన జోగారావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానవాటికలో గెయ్యి తీయడానికి యజమానే ముందుకు వచ్చాడని మన్నూరు హెడ్ కానిస్టేబుల్ నాగూరు అహ్మద్ చెప్పారు. మృతుడి కూతురు హైదరాబాద్ లో ఉందని, ఆమె వచ్చాక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
Next Story