కడప ఉక్కు ఊసేది?  నిర్మలమ్మ నోట మాటే లేదే..!
x

కడప ఉక్కు ఊసేది? నిర్మలమ్మ నోట మాటే లేదే..!

వెనుకబడిన రాయలసీమకు మాటలతో కేంద్రం ఊరడింపేనా? కడప ఉక్కు మాట లేదు. దీక్షలు చేసిన నేతలు, కింగ్ మేకర్ సీఎం చంద్రబాబు ఏమి చేయబోతున్నారు?


కడప ఉక్కు పరిశ్రమ రాజకీయ నినాదంగా మార్చేశారు. రాయలసీమకు వరప్రసాదంగా 2014 విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. లాభదాయకం కాదని, ఆ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకున్నట్లు వ్యవహరిస్తోంది. చివరాఖరికి 2024 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఊసేలేపోవడంపై ఈ ప్రాంత నేతలు తీవ్ర అసంత‌ృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు" కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలమ్మ ప్రశాంతంగా ప్రకటించారు. అయితే, పరిశ్రమ ఏర్పాటు ద్వారా అభివృద్ధి, ఉపాధి కల్పించే దిశగా ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేది మాత్రం చెప్పలేదు. ఈ ప్రాంతాన్ని మరింత నిర్లక్ష్యం చేయడమే అనే భావన ఉంది.

కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ కూటమి బలమైన మిత్రపక్షంగా ఉంది. 25 లోక్ సభ స్థానాల్లో 21 చోట్ల టీడీపీ కూటమి విజయం సాధించింది. అందులో సొంతంగా టీడీపీ 16 మంది ఎంపీలతో టీడీపీ బలమైన పార్టీగానే కాకుండా, ఆ పార్టీ సారధి, సీఎం ఎన్. చంద్రబాబు కీలకంగా ఉన్నారు. ఎన్డీఏకి మద్దతుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో పది పార్లమెంట్ స్థానాల్లో ఎనిమిది మంది టీడీపీ సభ్యులే. ఈ పరిస్థితుల్లో "కడప ఉక్కు.. రాయలసీమ హక్కు" అని నినదించిన వెనకబడిన ఈ ప్రాంత ప్రజలకు ఏమి సమాధానం చెబుతారనేది చర్చకు తెరతీసింది.


అప్పడు దీక్ష.. ఇప్పుడు సీఎంతో మాట్లాడా..
2018 జూన్ లో కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేసిన ఎంపీ సీఎం రమేష్, అంతకుముందు బీటెక్ రవి పది రోజుల ఆమరణదీక్షను సీఎం ఎన్. చంద్రబాబు విరమింప చేశారు. వారిద్దరితో పాటు కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న శ్రీనివాసవర్మ స్పందన ఏమిటి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అనకాపల్లి నుంచి కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ బీజేపీగా ఎంపిగా గెలిచారు. మొదటిసారి ఇటీవల కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్ధనల అనంతరం మీడియాతో మాట్లాడారు. "కడప స్టీల్ ప్లాంట్ పై సీఎం ఎన్. చంద్రబాబుతో చర్చించాం. యుద్ధప్రాతిపదికన ప్లాంట్ నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారు" అని వ్యాఖ్యనించిన రోజుల వ్యవధిలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అసలు ఈ విషయంపై రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మంత్రులు ప్రస్తావించారా? అనేది కూడా రాయలసీమ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పుగలరా? అంటే.. అందుకు కారణం కూడా లేకపోలేదు.

2014 విభజన చట్టంలో "కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పరిశీలన చేయాలి" అని ప్రస్తావించారు. దీనికి కేంద్రం కూడా మొదట చర్యలు తీసుకుంది. ఆ తరువాత పరిశ్రమ నిర్మించే బాధ్యత రాష్ర్టం తన చేతుల్లోకి తీసుకుంది. ఇదే అదనుగా "కడపలో ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదు" అని ఎందుకు చేతులెత్తేసింది? 14 ఏళ్లుగా ఈ వ్యవహారం అడుగు ముందుకు నాలుగు అడుగులు ఎందుకు వెనక్కు ఉడుతూ, ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారిందనేది పరిశీలిద్దాం.

మూడు శంకుస్థాపనలు

2007 జూన్ 10న అప్పటి సీఎం డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అంబవరం సమీపంలో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్ధాపన చేశారు.
"భూసేకరణ లేకుండానే అందుబాటులో ఉన్న భూమిలో నిర్మాణంచేస్తాం" అని అప్పట్లో ప్రకటించారు. గండికోట నుంచి రెండు టీఎంసీల నీళ్లు, ముద్దనూరు నుంచి రైల్వే లైన్ ఏర్పాటు, ముద్దనూరు ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

"ఎకరా రూ. 18 వేల వంతున 10 వేల ఎకరాలు బ్రహ్మణి కంపెనీకి అప్పగించారు" అని టీడీపీ ఘాటుగా ఆరోపించింది. ఆ తరువాత పునాది రాయి ఎక్కడ ఉందనేది కూడా కనిపించని స్థితిలో పొదల మధ్య నిర్మానుష్యంగా మారింది.
2013లో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 333 ద్వారా బ్రహ్మణి స్టీల్స్ కు ఇచ్చిన భూములు వెనక్కు తీసుకుంది. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో..


ఇక్కడే తప్పటడుగు పడిందా?
2018 డిసెంబర్ 27న గండికోట రిజర్వాయర్ ఎగువలోని కంబాలదిన్నె ప్రాంతంలో సీఎం ఎన్. చంద్రబాబు మళ్లీ శంకుస్ధాపన చేశారు.
"రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ నిర్మిస్తుంది. ఏపీ పునర్వభజన చట్టం ప్రకారం ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలి" అని సీఎం చంద్రబాబు అప్పట్లో కోరడం గమనార్హం. కేంద్రంపై ఒత్తిడి ద్వారా సాధించుకోవాల్సిన హక్కును నెత్తికి ఎత్తుకున్నారు. ఆ తరువాత కొన్ని నెలలకే టీడీపీ అధికారం కోల్పోయింది. దీనిపై

సామాజిక విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "విభజన చట్టంలో ఉంది. పరిశీలన జరిగింది. ఆ తరువాత కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలంటే కుదరదు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కేంద్రమే చెబుతోంది. కడప స్టీల్ ప్లాంట్ ద్వారా అభివృద్ధికి ఊతం ఇవ్వాలని తెలియదా" అని ప్రశ్నించారు.


2019 డిసెంబర్ 23న సీఎం హోదాలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెదనందలూరు గ్రామాల సమీపంలో 3,275.66 ఎకరాలు ప్లాంట్ కోసం కేటాయించి, రూ. 10 లక్షల మూలధనంతో ఏపీ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్గా మార్చింది.

"భాగస్వామ్య పద్ధతిలో ప్లాంట్ ఏర్పాటుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ ఆహ్వానించడంతో దేశంలోని దిగ్గజ సంస్థలు టాటా, ఎస్ఆర్. జిందాల్ వంటి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి" అని మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రకటించడం గమనార్హం. ఆ తరువాత సమీక్షలకే పరిమితమైంది.
2023లో మళ్లీ సజ్జన్ జిందాల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి సీఎం వైఎస్. జగన్ పాల్గొన్నారు. "మూడేళ్లలో ప్లాంట్ పూర్తవుతుంది" అని అప్పట్లో వైఎస్. జగన్ ప్రకటించినా, మళ్లీ గడువు పొడిగించడం గమనార్హం.

తప్పుకున్న సంస్థలు
ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన 2007 ఏడు నుంచి అనేక మంది సీఎం లు మారారు. బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మణీ స్టీల్స్ సంస్థ మొదలు, దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. సీఎంలు మారినప్పుడల్లా, ఆయా సంస్థలు తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటూ పోయారు. మినహా కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం అధికారం మారినప్పడు సీఎంలుగా బాధ్యతలు నిర్వహించిన వారు ఒత్తిడి చేయలేని స్థితిలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు శంకుస్థాపనలకే పరిమితమైంది.
కేంద్రం కూడా...
2014 విభజన చట్టంలో వెనకబడిన రాయలసీమకు ఉక్కు పరిశ్రమ ప్రతిపాదన ఉంది. 2017లో కేంద్రం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పరిశీలన సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతామం అని 13వ షెడ్యూల్ లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'సెయిల్' జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై పరిశీలన జరిపింది. అక్కడ ప్లాంట్ ఏర్పాటు లాభదాయకం కాదని వెల్లడించింది

2017లో కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పరిశీలనకు ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ ను ఇందులో భాగస్వామ్యం చేసింది.
"విభజన చట్టానికి అనుగుణంగా ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై పరిశీలన అనంతరం నివేదిక ఇస్తుంది" అని ప్రకటించినా, పత్తా లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ప్లాంట్ ఏర్పాటు అనేది సాధ్యం కాదు. పర్యావరణ అనుమతులు, కాస్టివ్ మైన్స్ కేటాయింపు, ప్రధానంగా పెట్టుబడి నిధులు ఇవ్వాల్సింది కేంద్రం చేతుల్లోనే ఉంది.

కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదంటూ జులై 25న కేంద్ర మంత్రి మానవేంద్ర రాయ్ లోక్‌సభలో ప్రకటించారు. అయితే 2017లోనే కేంద్రం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. విభజన చట్టానికి అనుగుణంగా ఏపీలో స్టాల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందని ఆనాడు ప్రకటించారు. కానీ నేటికీ ఆ విషయంలో అతీగతీ లేదు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తావించ లేదు.
ఇదే సాకుతో...
ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం మేరకు హామీలు అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, కడప ఉక్కు పరిశ్రమపై వాదన జరిగింది. దీనిపై కేంద్రం "కడపలో నాణ్యమైన ఖనిజం లేదని సెయిల్ స్పష్టం చేసింది" అని అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వ్యవహరించింది.
ఇదే ఊపులో...
ఈ పరిణామాల నేపథ్యంలో 2013 జూలై 25న పార్లమెంటులో కేంద్ర మంత్రి మానవేంద్రరాయ్ ఓ ప్రకటన చేశారు.
"కడపలో ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదు" అని విస్పష్టంగా ప్రకటించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (ప్రస్తుతం కేంద్ర మంత్రి) అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ ప్రకటన ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం అవుతోంది.

"ఆయన అప్పట్లో సమాధానం. తాజా బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊసు ఎత్తకపోవడం తగదు" అని సామాజిక విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. "రాయలసీమ వెనకబడిన ప్రాంతంగా కేంద్రమే గుర్తించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవసరాన్ని కూడా గుర్తించాలి. బ్రహ్మణి స్టీల్స్ కు అప్ప2007 లో అనుమతి ఇవ్వలేదా? ఖనిజం గనులు కేటాయించలేదా? ఏపీ విభజన చట్టంలో ఉన్నట్లు ఇస్తాం అన్నారు కదా? అప్పడు లాభమైంది. ఇప్పడు ఎందుకు కాదు? ఖచ్చితంగా అమలు చేయాల్సిందే" అని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బడ్జెట్ లో కడప ఉక్కు పరిశ్రమ కూడా లేకున్నా, ఈ ప్రాంత ఎంపీలు ఏమి చేస్తున్నారు. నోరు విప్పరా? సామాజిక బాధ్యత కలిగిన వారు దీనిని చూస్తూ ఊరుకోరు అని ఆయన హెచ్చరించారు.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వల్ల 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 50 వేల మందికి పైగానే ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పరిశ్రమ ఏర్పాటులో నిర్లక్ష్యంపై రాష్ట ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story