
బోగీ కింద పరిశీలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
జయంతి ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
కడప జిల్లా నందలూరు వద్ద ఘటన.
నడుస్తున్న రైలులో ఏసీ బోగీ కింద మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కడపజిల్లా నందలూరు రైల్వేస్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ వివరాల్లోికి వెళితే..
కన్యాకుమారి నుంచి పూణే కు జయంతి ఎక్స్ప్రెస్ బయలుదేరింది.
కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ ఆ తర్వాత హస్తవరం రైల్వే స్టేషన్ నుంచి జయంతి ఎక్స్ప్రెస్ క్రాస్ అయింది. అదే సమయంలో ఏసీ బోగీ కింద నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే జయంతి ఎక్స్ప్రెస్ సాధారణ వేగంతోనే ప్రయాణిస్తుంది. దీంతో మరింత పొగలు ఎక్కువగా రావడం వల్ల ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జయంతి ఎక్స్ప్రెస్ గార్డ్ వాకి టాకీ ద్వారా వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు.
చెయ్యరు నది బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న జయంతి ఎక్స్ప్రెస్ దగ్గరలోని నందలూరు రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. అప్పటికే పొగ వాసన వస్తూ ఉండటంతో ఏసీ బోగీలోనే ప్రయాణికులు ప్రాణ భయంతో కిందికి దిగేశారు.
జయంతి ఎక్స్ప్రెస్ లోని మిగతా కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులు కూడా ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఆందోళనకు గురయ్యారు.
రైల్వే స్టేషన్ మేనేజర్ రైల్వే పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిగమాపక సిబ్బంది పొగలు వచ్చిన ఏసీ బోగీ కింద పరిశీలించారు. మిగతా కంపార్ట్మెంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు.
నందలూరు రైల్వే స్టేషన్లో జయంతి ఎక్స్ప్రెస్ ఉన్నఫలంగా ఆగిపోవడంతో సమీపంలోనే ఉన్న స్థానికులు కూడా భారీగా రైలు వద్దకు చేరుకున్నారు. ఈ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న రైల్వే సిబ్బంది కూడా జయంతి ఎక్స్ప్రెస్ వద్దకు చేరుకుని తనిఖీలకు సహకారం అందించినట్లు తెలిసింది.
జయంతి ఎక్స్ప్రెస్ ను ఏసీ కోచ్ తోపాటు మిగతా కంపార్ట్మెంట్లలో కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ప్రమాదం లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు బయలుదేరి వెళ్ళింది. ఈ సంఘటన నేపథ్యంలో సుమారు గంటకు పైగానే నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ప్రెస్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
Next Story