Peddireddy| పుంగనూరులో పెద్దిరెడ్డి కట్టడికి ఎత్తులు వేస్తున్న జనసేన
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని కూటమి ఉవ్విళ్లూరుతోంది. పుంగనూరుపై జనసేన దృష్టిసారించింది. ఓ నేతను రంగంలోకి దించింది.
రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నేత. పుంగనూరులో ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టాలని జనసేన తహతహలాడుతోంది. గతంలో ఆయన, మద్దతుదారుల నుంచి ఎదురైన సవాళ్లకు దీటుగా సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లే కనిపిస్తోంది. దీనికోసం పుంగనూరుపై జనసేన దృష్టి నిలిపింది. స్థానిక సంస్థలు, రానున్న సార్వత్రిక ఎన్నికలకు పట్టు సాధించాలని కూటమిలోని టీడీపీ, జనసేన ఉమ్మడిగా కదులుతున్నాయి.
పుంగనూరు నియోజకవర్గంలో జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడిన చదళ్ళ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డిని రంగంలోకి దించింది. ఇటీవల కొన్ని రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. ఆ ఉత్సాహంతో నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన వేణుగోపాలరెడ్డి సారథ్యంలో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎదురులేని నేతకు గట్టి దెబ్బ
చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యంగా నాయకత్వం నెరిపిన పెద్దిరెడ్డికి గత సార్వత్రిక ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరులో భారీగా చదళ్ళ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి తగ్గడమే దీనికి నిదర్శనం.
పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ అరంగేట్రం చేసీ, 1978 ఎన్నికల్లో పీలేరులో జనతా పార్టీ నుంచి పోటీ చేసి మొగల్ సైఫుల్లాబేగ్ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత పీలేరు నుంచి ఆరుసార్లు పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1989, 1994, 1999 ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
నియోజకవర్గాల విభజన నేపథ్యంలో 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి 2024 ఎన్నికల్లో వరుసగా పుంగనూరు నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచేది. ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పాదం మోపిన తరువాత టిడిపికి అవకాశం లేకుండా పోయింది.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం టి సదుం మండలం ఎర్రాతివారిపల్లె కూడా ఉంది. అంతకు ముందు నుంచే ఈ నియోజకవర్గంలో అనుచరులు, నాయకులు తన వెంట మలుచుకోవడంలో పెద్దిరెడ్డి చాతుర్యమే ప్రదర్శించారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో
2019 ఎన్నికలకు ముందు జనసేన మద్దతుదారులపై దాడులు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగడానికి ఏర్పాటుచేసిన హెలిపాడ్ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత కుమారుడికి వచ్చిన పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డారు.
"ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. దీనిపై సరైన సమయంలో తగిన విధంగానే సమాధానం చెబుతాం" అని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే హెచ్చరించారు.
ఆ సమయం వచ్చిందా..?
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ సత్తా చాటే స్థాయిలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. గడచిన పదేళ్లలో జనసేన ఉనికిని చాటే కార్యకర్తలు, అభిమానులు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో..
2024 ఎన్నికల కోసం బెంగళూరులో బిల్డర్ గా ఆర్థిక స్వావలంబన సాధించిన పుంగనూరు నియోజకవర్గం చదళ్ళ గ్రామానికి చెందిన ఎన్. వేణుగోపాలరెడ్డి జనసేన రాజకీయ తెరపైకి వచ్చారు. టీడీపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో జనసేనకు ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వేణుగోపాలరెడ్డి అనే ఈ వ్యక్తి టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. ఎందుకనో తెలియదు కానీ, సీఎం ఎన్. చంద్రబాబు రొంపిచర్ల మండలానికి చెందిన చల్లా రామచంద్రారెడ్డి ( చల్లా బాబు) కి అవకాశం ఇచ్చారు. ఈయనతో పాటు బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పంటికింద రాయిలా మారారు.
2009 ఎన్నికల్లో పెద్దిరెడ్డికి టిడిపి అభ్యర్థి ఎం వెంకటరమణ రాజు గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి 43,356 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2014 ఎన్నికల్లో మళ్లీ వారిద్దరి మధ్య పోటీ జరిగినా, పెద్దిరెడ్డి 72,856 ఓట్లతో గెలుపొందడం వెనక అరాచక పనులకు తెగబడడం వల్లే ఇది సాధ్యమైందని టిడిపి ఆరోపించింది.
2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి పై మాజీ మంత్రి, పలమనేరు టిడిపి ఎమ్మెల్యే ఎన్ అమర్నాథరెడ్డి తమ్ముడు భార్య అనూష రెడ్డి పోటీ చేశారు. గట్టి పోటీ ఎదురు కావడంతో పెద్దిరెడ్డి మెజారిటీ 63,876కు తగ్గింది. ఈ ఐదేళ్ల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో, టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైసిపి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని రంగంలోకి దిగాయి. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించాలని మన పరిస్థితి ఏర్పడింది.
ఊహించని షాక్
2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊహించని షాక్ తగిలింది. గతంలో పీలేరు ఆ తర్వాత పుంగనూరు నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. సీఎం చంద్రబాబు, బిజెపి కేంద్ర నాయకుడు, మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పవన్ కళ్యాణ్ వంటి నాయకులు అందరూ సుడిగాలి పర్యటనలు చేసిన నేపథ్యంలో, వేధింపులకు గురైన టిడిపి, జనసేన నాయకులు, ఆ పార్టీ శ్రేణులు కసిగా పని చేశాయని ఫలితాలే చెబుతాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఊహించని రీతిలో కేవలం ఆయన 6619 అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కగలిగారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురు గాలివీయడానికి దారి తీసిన పరిస్థితులు కూడా పుంగనూరులో ప్రభావం చూపించాయి అనే విషయం ఈ ఫలితం స్పష్టం చేస్తుంది.
ఇదే అదునుగా..
పుంగనూరులో టిడిపి సహకారంతో జనసేన కూడా తన రాజకీయ వ్యవహారాలను ముమ్మరం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకు కూటమికి మాజీ సీఎం వైయస్ జగన్, ఆ తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన రాజకీయ విరోధిగానే పరిగణిస్తున్నాయి. అందుకు నిదర్శనం.. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను టిడిపి కూటమి వెలుగులోకి తీసుకు వస్తుండడమే. శ్వేత పత్రాల ద్వారా అనే కాకుండా, సహజ వనరుల దోపిడీ ఎలా జరిగిందనే విషయాలను టిడిపి కూటమి ప్రజాకోర్టులో ఉంచింది.
పట్టు సాధించాలనే ఆశ
ఇదే పరిస్థితిని పుంగనూరులో కూడా వివరించడం ద్వారా పట్టు పెంచుకోవాలని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకోసం నియోజకవర్గంలోని చదళ్ళ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. దీనికి జనసేన అండగా నిలిచింది. రెండు రోజుల కిందట జనసేన ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సారధ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు వీలుగా, పుంగనూరులో సోమవారం భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.
Next Story