తిరుపతి : వారాహి డిక్లరేషన్ లీక్ ..?  పవన్ అడుగులు ఎటు?
x

తిరుపతి : వారాహి డిక్లరేషన్ లీక్ ..? పవన్ అడుగులు ఎటు?

జనసేన ప్రస్థానం ఇకపై ఎటు? ఆ అజెండా మారబోతోందా? తిరుపతిలో పవన్ కల్యాణ్ ఇంకొన్ని గంటల్లో వారాహి డిక్లరేషన్ -2024 ప్రకటించనున్నారు. అందులో అంశం లీక్ చేశారా?


జనసేన అంటే ప్రజాసైన్యం. ప్రశ్నించే గొంతుక. ఆ లక్ష్యంతో పార్టీ ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట మారింది. హిందూత్వ అజెండాను భుజానికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం ఇంకొన్ని గంటల్లో తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించే అంశాలు స్పష్టం చేయనున్నాయి.


2014 ఎన్నికల నుంచి బీజేపీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. జనసేన ఆవిర్భావం నుంచి పదేళ్ల ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే పవన్ కళ్యాణ్ ప్రశ్నించే గొంతుకగా నిలిచారు.ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన "టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు" అని వైసీపీ సూటిగా ప్రశ్నించింది. వాటికి కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో దీటుగానే సమాధానం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో కూడా పడ్డారు.

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ 21 సీట్లకు పోటీ చేసి, అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ఆయన స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నోట హిందుత్వం, సనాతన ధర్మం, ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో .. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన మూడు నెలల తర్వాత
సెప్టెంబర్ 18: "తిరుమల లడ్డు అపవిత్రం అయ్యింది" అని సీఎం ఎన్. చంద్రబాబు చేసిన ప్రకటన దేశంలో రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. కొన్ని రోజుల తరువాత ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ చెప్పలేని మాటలు పవన్ కళ్యాణ్ నోటా ప్రతిధ్వనించాయి. దేశంలో హిందూ సంప్రదాయం ఆలయాల పరిరక్షణ కోసం "సనాతన ధర్మ రక్ష బోర్డు" కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా,

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అక్టోబర్ రెండో తేదీ (24 గంటల క్రితం) విరమించారు. అదే సందర్భంలో ఆయన చెప్పిన "వారాహి డిక్లరేషన్-2024" చర్చనీయాంశంగా మారింది. అందులో ఏముంది అనేది మాత్రం చెప్పలేదు. ట్విట్టర్ ద్వారా ఆయన ఏ స్పందించారంటే..

"వారాహి డిక్లరేషన్" ను చాలా సీరియస్‌గా తీసుకోవాలని మరియు భారతదేశం అంతటా దాని గురించి అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను... APలో హిందువులు & హిందూ సంప్రదాయాలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. వారాహి డిక్లరేషన్ హిందూ స్పృహ యొక్క పునరుజ్జీవనం (ప్రారంభం) మరియు దానిని అట్టడుగు స్థాయి నుంచి రక్షించే దిశగా మొదటి అడుగు" అని ఎక్స్ వేదిక గా ట్వీట్ చేశారు.

దీని ద్వారా పవన్ కళ్యాణ్ హిందూత్వ అజెండాను ప్రధానంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రతిగా చాలామంది సానుకూలంగా వ్యతిరేకంగా స్పందించారు. అందులో ఓ ఔత్సాహిక జనసైనికుడు రీ ట్వీట్ చేస్తూ.. ఓ చిత్రం వాడారు.

"కొత్త వాహనం వినియోగించేటప్పుడు, దిష్టి పూజలు చేసి టైర్ల కింద నిమ్మకాయలు ఉంచుతారు. వాటిని తొక్కించుకుంటూ వాహనం ముందుకు కదిలిస్తే దిష్టి పోతుంది" అని విశ్వసిస్తారు. అన్ని మతాల వారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఆ తరహాలో .. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కింద ఓ ఔత్సాహికుడు వైఎస్ జగన్ బొమ్మతో ఉన్న నిమ్మకాయను టైరు కింద ఉంచిన ఫోటోను ట్యాగ్ చేశారు. అంటే, అన్యమతస్తులను సనాతన ధర్మ పరిరక్షణలో ఎలా తొక్కించుకుంటూ ముందుకు సాగడమే కర్తవ్యం అని అర్థం వచ్చేలా అందులో పేర్కొన్నారు.
తిరుపతిలో ఈ సాయంత్రం

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా తిరుమలలో ఉన్నారు. అక్టోబర్ మూడవ తేదీ అంటే ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. తిరుపతి ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పూలే విగ్రహానికి పవన్ కళ్యాణ్ పూలమాలతో నివాళులర్పిస్తారు. అనంతరం ఇక్కడి బాలాజీ కాలనీ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఈ సభలోనే " వారాహి డిక్లరేషన్-2024" వెల్లడించనున్నారు. దీని ద్వారా జనసేన అడుగులు ఏ వైపు పయనిస్తాయనేది వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Read More
Next Story