జనసైనికుడికి దక్కిన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి..
x

జనసైనికుడికి దక్కిన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి..

సామాన్యుడికి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం కల్యాణ్.


చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆలయాల్లో ఒకటి శ్రీకాళహస్తి దేవస్థానం. ఈ ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి జనసేన పార్టీలో సామాన్యుడు కొట్టే సాయిప్రసాద్ కు దక్కింది. శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటకు చెందిన ఆయనకు ఫ్యాన్సీ షాపులు మినహా, ఇతర వ్యాపకాలు లేని ఆయన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కు అత్యంత దగ్గరి వ్యక్తిగా మెలిగారు. వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన ఓ మహిళా సీఐ ఆయనపై దాడి చేసిన సమయంలో పవన్ కల్యాణ్ తిరుపతికి వచ్చారు. అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేయడం ద్వారా సాయిప్రసాద్ తోపాటు జనసేన క్యాడర్ లో జోష్ నింపారు. ఇదిలాఉండగా,

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు పాలక మండలి చైర్మన్లు నియమిస్తూ దేవాదాయ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయిప్రసాద్ నియమితులయ్యారు. కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా వి.సురేంద్రబాబు (మణినాయుడు)కు అవకాశం దక్కింది. దీంతో

చిత్తూరు జిల్లాలో తిరుమల తరువాత కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు ప్రధానమైనవి. టీడీపీ కూటమి ఏర్పిడిన తరువాత 15 నెలలకు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు పాలక మండళ్లు కూర్పు సాధ్యమైంది. ప్రధానంగా శ్రీకాళహస్తి చైర్మన్ పదవికి టీడీపీ నుంచే తీవ్ర పోటీ ఏర్పడింది. కూటమిలో భాగస్వామ్య పార్టీల్లో జనసేన తరువాత బీజేపీకి కాస్త ఉనికి ఉంది. దీంతో
ముక్కోణ పోటీలో..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కొట్టె సాయిప్రసాద్

మూడు పార్టీల నుంచి శ్రీకాళహస్తి చైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు.వారిలో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా మెలిగిన వారిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్య నాయుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ కూడా ఆయనకే మద్దతు తెలిపారు. ఈయనతో పాటు ఏర్పేడు మండలం నుంచి రెడ్డివారి గురవారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. వారికి తోడుగా బీజేపీ నేత, ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్ తన భార్యకు పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు సాగించినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలావుంటే..
సామాన్యుడికి పదవి

కొట్టే సాయిప్రసాద్ (తెలుపురంగు చొక్కా)

టీడీపీ కూటమిలోని మూడు పార్టీల నుంచి శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం పోడీ పడ్డారు. రాహుకేతు పూజలకు ప్రధాన కేంద్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి తిరుమల తరువాత అంతప్రాధాన్యత ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రధానంగా తమిళనాడు నుంచి ఎక్కువ మంది యాత్రికులు ముక్కంటి క్షేత్రానికి వస్తుంటారు. అయితే, టీడీపీ కూటమిలోని అనేక మంది పోటీ పడినా, సామాన్యుడైన కార్యకర్త కొట్టే సాయిప్రసాద్ కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి దక్కింది. దీంతో అన్ని పార్టీల నేతలు విస్మయానికి గురయ్యారు.
జనసేనలో రెండో ధృవం
శ్రీకాళహస్తి జనసేన పార్టీలో కోట వినూత, చంద్రబాబు దంపతులు కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడంలో అనేక ఆటుపోట్లకు గురయ్యారు. కేసులు ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం సాధించడంలో విఫలం అయ్యారనే అపవాదుతో పాటు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కొట్టే సాయిప్రసాద్ రెండో కేంద్రంగా మారారు. బలజ సామాజిక వర్గానికి చెందిన సాయిప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ హత్య కేసులో కోట వినూత దంపతులు పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో పాటు, జైలుపాలయ్యారు.
కల్యాణ్ అండ
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలజ (కాపు సామాజికవర్గం ) ఓటర్ల ప్రభావం ఎక్కువే. ఆ సామాజికవర్గం నుంచి వచ్చిన కొట్టే సాయిప్రసాద్ ఓ బాలిక మిస్సింగ్ కేసులో ధర్నాకు దిగిన సాయిప్రసాద్ ను అప్పటి మహిళ సీఐ చెంపకొట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాచారం అందుకున్న జనసేన చీఫ్ పవన కల్యాణ్ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడంతో పాటు సీఐపై ఫిర్యాదు చేయడానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్వయంగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి రావడం ద్వారా జనసైనికుల్లో మరింత జోష్ పెంచింది. ఆ ఉత్సాహంతోనే గత ఎన్నికల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి విజయం కోసం జనసైనికులను చురుగ్గా కదిలించాడనే పేరు సాయిప్రసాద్ కు దక్కింది. అంటేకాకుండా, మొదటి నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనుసన్నల్లో మెలిగేవాడనే వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా రాజకీయ వారసత్వం లేని వ్యక్తికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి దక్కడం చర్చకు ఆస్కారం కల్పించింది.
కాణిపాకం ఆలయం
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా వి. సురేంద్రబాబు (మణినాయుడు)కు దక్కింది. కాణిపాకం పరిసర ప్రాంతాల్లో 14 ఉభయదాతల పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెలకు చెందిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. బొమ్మ సముద్రం గ్రామానికి చెందిన మణినాయుడు గతంలో2018లో కూడా చైర్మన్ గా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన 019లో రాజీనామా చేశారు. కాణిపాకం ఆలయ చైర్మన్ పదవి కోసం కాణిపాకం మాజీ సర్పంచ్ కేసీ. మధుసూదనరావు,, పూతలపట్టు తెలుగు మహిళ అధ్యక్షురాలు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తిరుణంపల్లెకు చెందిన ముల్లగూరి, లత కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ పదవి విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పై కూడా ఒత్తిళ్లు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే సీఎం నారా చంద్రబాబు మణినాయుడుకు అవకాశం కల్పించారు.
Read More
Next Story