JANSENA - Pithapuram | నాలుగు అంశాలపైనే జనసేన జయకేతనం..!
x

JANSENA - Pithapuram | నాలుగు అంశాలపైనే జనసేన 'జయకేతనం'..!

జనసేనాని కార్యాచరణపై రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఈ సాయంత్రం పిఠాపురంలో జరిగే సభలో తిరుపతి డిక్లరేషన్ ప్రతిధ్వనించి, సనాతనానికి పదును పెట్టే అవకాశం ఉంది.


పిఠాపురంలో ఇంకొన్ని గంటల్లో ప్రారంభమయ్యే జయకేతనం సభ)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరిశీలకులు కూడా అటు దృష్టి సారించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభకు కొనసాగింపుగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సభలో సనాతన ధర్మపోరాటం, యాత్రలపై జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

విప్లవం, ఆదర్శం, చేగువేరా పోరాట స్ఫూర్తితో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ఊపిరి పోసిన జనసేన పార్టీకి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ పార్టీ చిహ్నం దేశ చరిత్ర, పోరాటాలను నిర్వచించే ఒక దళాల కలయికగా ఆయన అభివర్ణించారు. కాగా, పదేళ్ల ప్రస్థానంలో జనసేన రూటు విప్లవం వైపు నుంచి హిందూత్వానికి మళ్లింది. ఏ మతమైనా, ఏ ధర్మానికైనా భంగం కలిగితే ఒకేలా స్పందిస్తాం అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే... సనాతన ధర్మం పేరిట అడుగులు వేశారు. పిఠాపురం సభలో కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
జయకేతనం సభలో..
పిఠాపురం సభలో జనసేన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా
1. సనాతన ధర్మ పరిరక్షణపై జనసేన తన విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత పార్టీ శ్రేణులు దానిని ఎలా స్వీకరిస్తాయి. ప్రజల్లో దీనికి ఎలాంటి స్పందన ఉంటుందనేది వేచిచూడాల్సిందే.
2. తెలుగు రాష్ట్రాల్లో జనసేన విస్తరణపై పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం కూడా చేయనున్నారు.
3. ఇతర పార్టీల నాయకులకు ద్వారాలు తెరిచే ఆహ్వానం పలకేందుకు విధానం ప్రకటించనున్నారు.
4. జయకేతనం సభ తరువాత జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన యాత్ర ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2022 మార్చి 14వ తేదీ తరువాత ఆవిర్భావ సభ ఇంకొన్ని గంటల్లో (14వ తేదీ శుక్రవారం) పిఠాపురంలో జయకేతనం పేరిట 12వ వార్షికోత్సవం పిఠాపురంలో ప్రారంభం కానుంది. పదేళ్ల కాలగమనంలో జనసేన విప్లవ, ఆదర్శాల నుంచి హిందూత్వం పక్కన పయనిస్తోంది. ఈ రోజు జరిగే జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు కీలక అంశాలపై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలోని 21 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి, వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన విషయం తెలిసింది. ఆ విజయోత్సాహంతో పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించే అంశాలపై ప్రాధాన్యత, రాజకీయ పరిశీలకులకు ఆసక్తి ఏర్పడింది. మాస్ లీడర్ కావడం వల్ల పార్టీ శ్రేణులు కూడా ఆయన ఇచ్చే మార్గంలో ప్రయాణించడానికే ఉత్సాహంగా ఉండడం సహజం.
2024 అక్టోబర్ 3న తిరుపతి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసింది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే సీఎం చంద్రబాబు ఆరోపణలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాయశ్చిత్త దీక్షలోనే కాషాయం దుస్తులతో పవన్ కల్యాణ్ అంతకుముందు రోజు తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనం, వారాహి డిక్లరేషన్ పుస్తకం స్వామివారి చెంతకు తీసుకువెళ్లి, వచ్చారు.
తిరుపతి పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐదు ప్రధాన అంశాలుగా వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. "సనాతన ధర్మ పరిరక్షణ కోసం అడుగులు వేస్తా" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన మరో డిమాండ్ కూడా కేంద్రం ముందు ఉంచారు.
"సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు" ఏర్పాటు చేయాలని కూడా నినదించారు.
ఏ మతానికి, ఏధర్మానికైనా భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకిక వాదాన్ని పాటించాలంటూ సన్నాయి నొక్కులు కూడా నొక్కారు.
1. సనాతన ధర్మం కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం ఒకే చట్టం తేవాలి.
2. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలి.
3. సనాతన ధర్మాన్ని కించపరిచే, ధ్వేషం చిందే వ్యక్తులు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి
ఆలయాల్లో జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధ్రువీకరించే విధానం అవసరం
4. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాదు. విద్యా వికాస, కళ, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా విరాజిల్లాలి. దీనికోసం ప్రణాళిక సిద్ధం కావాలని ప్రకటించారు.
ఈ సభ అని కాదు. కానీ,
2014 ఎన్నికల వేళ నుంచే పవన్ కల్యాణ్ బీజేపీతో చేరువయ్యారు. రాష్ర్ట విభజన తరువాత తిరుపతిలో జరిగిన ఎన్డీఏ సభలో సీఎం చంద్రబాబు, ప్రదాని మోదీతో కలిసి ప్రసంగించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ "కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావ్" (కాంగ్రెస్ ను తప్పించండి. దేశాన్ని కాపాడండి) అని నినదించడం ద్వారా బీజేపీ అభిమానానికి మరింత ప్రీతిపాత్రుడిగా మారారనడంలో సందేహం లేదు. మధ్యలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని కాస్త కినుకు వహించిన 2019లో కూటమికి టీడీపీ దూరంగా ఉన్నప్పటికీ, అందరినీ ఏకం చేయడంలో పవన్ కల్యాణ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
విప్లవం గాలికి..
తిరుపతి వారాహి సభ ద్వారా పవన్ కల్యాణ్ "విప్లవం, ఆదర్శం గాలికి పోయింది. చేగువేరాను వదిలేశారు. హిందూత్వ వాదం ఎత్తుకోవడం ద్వారా కల్యాణ్ బీజేపీ గొంతుకగా మారారు" అనేది పరిశీలకుల అభిప్రాయం. దీనిని సాకారం చేస్తున్నట్లుగానే ఇటీవల కొన్ని రోజులపాటు కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్రలు సాగించి విషయం తెలిసిందే. ఇదిలావుంటే..
పిఠాపురం సభలో..
తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పవన్ కల్యాణ్ సారధ్యంలో జయకేతనం పేరిట నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఏ అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడతారు? మళ్లీ హిందూత్వం, సనాతనధర్మం, తిరుపతి వారాహి డిక్లరేషన్ సభకు పిఠాపురం కొనసాగింపుగా దిశా నిర్దేశం చేస్తారా? అనే విషయాలపై పరిశీలకులు గమనిస్తున్నారు. ఈ సభ వేదికగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
"ఈ సభను తెలుగు చరిత్రకు అద్దం పట్టేలా నిర్వహిస్తాం" అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వేదికపై పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తోపాటు 250 మంది కూర్చేనే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశామని కూడా ఆయన స్పష్టం చేశారు. 21 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరయ్యే కార్యక్రమానికి సకల ఏర్పాట్లు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ సాయంత్రం నాలుగు గంటలకు జనసైనికులను ఉద్దేశించి, పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే వేలామంది పిఠాపురం చేరుకున్నారు. పార్టీ ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లాల సారధులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఎలాంటి డిక్లరేషన్ ప్రకటిస్తారనేది వేచిచూడాలి.
Read More
Next Story