
శ్రీనివాసా.. జనసేనానికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు స్వామీ..
జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు కూడా కొట్టి ప్రార్ధనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసైనికులతో కలిసి కొబ్బరి కాయలు సోమవారం మధ్యాహ్నం కొట్టారు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో గత ఐదు రోజులుగా బాధపడుతుండటంతో శ్రీవారికి ఎమ్మెల్యే నేతృత్వంలో జనసైనికులు మొక్కులు చెల్లించుకున్నారు.
అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొడుతున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్టీ నేతలు
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలిపిరి పాదాలమండపం వద్ద సోమవారం కొబ్బరికాయలు కొట్టి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించారు. తమ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా జనంలోకి రావాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు వేడుకున్నారు. జనం కోసం, పేదల కోసం అహర్నిశలు ఆలోచన చేయడమే కాదు. పనిచేసే నేతకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాకు చెప్పారు.