మామ జగన్ పై తొడగొట్టనున్న రాజారెడ్డి..!
x

మామ జగన్ పై తొడగొట్టనున్న రాజారెడ్డి..!

కొడుకును రాజకీయ అడుగులు వేయించిన షర్మిలారెడ్డి. వైఎస్ఆర్ రాజకీయ కుటుంబ కథాచిత్రం.


తన కుటుంబంలోనే వైఎస్. జగన్ కు రాజకీయంగా మరో ప్రత్యర్థి సిద్ధం అవుతున్నారు. మేనమామ జగన్ పై సమరానికి కొడుకు రాజారెడ్డిని పీసీసీ (PCC) వైఎస్. షర్మిలారెడ్డి సిద్ధం చేస్తున్నారు. రాజకీయంగా ఓనమాలు దిద్దించడానికి వైఎస్. షర్మిలా రెడ్డి సోమవారం కర్నూలు నుంచి అడుగులు వేయించారు.

కర్నూలులో ఉల్లి సాగు చేసే రైతులకు ఆసరాగా నిలవాలని సోమవారం ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తల్లి షర్మిల వెంట కుమారుడు రాజారెడ్డి కూడా వచ్చారు.
హైదరాబాదులోని నివాసం నుంచి బయలుదేరడానికి ముందు అమ్మమ్మ వైఎస్. విజయమ్మ పాదాలకు వందనం చేసిన రాజారెడ్డి ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఈ సన్నివేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ దృశ్యాన్ని చూస్తూ వైఎస్. షర్మిల కూడా అక్కడే నిలబడి ఉన్నారు.
అమ్మమ్మ వైఎస్. విజయమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్న షర్మిల కొడుకు రాజారెడ్డి

అమ్మమ్మ వైఎస్. విజయమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్న షర్మిల కొడుకు రాజారెడ్డి

రాజకీయ పాఠాలు నేర్పాలనీ..
నగరంలోని ఉల్లి మార్కెట్లో రైతులతో షర్మిలారెడ్డి మాట్లాడుతున్నారు. తల్లి వెంట వచ్చిన రాజారెడ్డి ప్రజల స్థితిగతులు గమనిస్తూ ఉన్నారు. రాజకీయ పాఠాలు నేర్పించడానికి షర్మిలారెడ్డి తన కొడుకును మొదటిసారి కార్యక్రమానికి తీసుకొని వచ్చినట్లు కనిపించింది. రైతుల సమస్యలపై షర్మిల రెడ్డి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో తన కొడుకు రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై కూడా ఆమె స్పందించారు.
తల్లి వైఎస్. షర్మిలారెడ్డికి నీడలా రాజారెడ్డి

తల్లి వైఎస్. షర్మిలారెడ్డికి నీడలా రాజారెడ్డి

"సరైన సమయంలో నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారు" అని వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబం నుంచి ప్రధానంగా షర్మిలరెడ్డి తన కుమారుడు రాజారెడ్డిని కూడా అన్నపై సమరానికి సిద్ధం చేయిస్తున్నట్లు స్పష్టమైంది.
జగన్ కు మరో ప్రత్యర్థి
పులివెందుల రాజకీయాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చుట్టూనే పరిభమిస్తుంటాయి. పదవుల్లో కూడా వారి కుటుంబానిది ఐక్యతరాగంగా సాగింది. వైఎస్సార్ మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ జగన్ సొంతంగా వైసిపి ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి జగనన్న స్పందించిన బాణాన్ని అంటూ ఆయన చెల్లెలు వైఎస్. షర్మిల దూసుకుపోయారు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవి దక్కని పరిణామాలు అన్నా, చెల్లెలు జగన్, షర్మిల మధ్య అగ్గి రాజుకుంది.
తెలంగాణ నుంచి ఆంధ్రలోకి..
అన్న విబేధించిన షర్మిల సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుని, తెలంగాణకు పరిమితమయ్యారు. బీఆర్ఎస్ ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ పై సమరం సాగించారు. రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలకుండా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఏపీసీసీ బాధ్యతలు అప్పగించాలనే ఒప్పందం కుదిరింది. దీంతో..
2024 ఎన్నికలకు ముందు వైఎస్. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సొంత అన్న వైఎస్ జగన్ సారథ్యం వహిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతా కలియదిరిగారు. ఫలితాలు వచ్చాయా లేదా అనేది పక్కన ఉంచితే కుటుంబ కలహాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో వైఎస్సార్ కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో
మాజీ మంత్రి, బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రధాన అస్త్రంగా ప్రయోగించారు. అన్న వైఎస్. జగన్ పై బాణం ఎక్కుపెట్టారు. బాబాయ్ వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డితో కలిసి కడప జిల్లాలో షర్మిలారెడ్డి విస్తృతంగా సాగించారు. ప్రచారంలో అన్న జగన్ పై మాటల తూటాలు పేల్చారు. ఆ తర్వాత కూడా ఆస్తుల పంపకం విషయంలో అన్నా చెల్లెలి మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో వారి తల్లి వైఎస్. విజయమ్మ తన కూతురు షర్మిల వైపే నిలిచారు. కాగా, దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి, జయంతి రోజు మాత్రమే ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద కొడుకు వైఎస్. జగన్ తో విజయమ్మ కాసేపు మాట్లాడగలుగుతున్నారు. అది మినహా కుటుంబ సభ్యులందరూ కలిసిన దాఖలాలు లేవు. ఇదిలావుంటే..
రాజకీయ తెరపైకి రాజారెడ్డి
వైఎస్ రాజా శేఖరరెడ్డి అంటే షర్మిలకు వల్లమాలిన ప్రేమ. ఆమెతో వైఎస్సార్ కూడా అదు అనుబంధం. తన కొడుకుకు రాజారెడ్డి అని పేరు పెట్టడం ద్వారా షర్మిల తాతపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. అయితే, వైఎస్సార్ కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. వారిలో ys. వివేకానంద రెడ్డి తరువాత బాబాయ్ కొడుకు వైఎస్. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. అన్న జగన్ తో విభేదించిన వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ఆస్తుల పంపకాలు, కుటుంబంలో కలతల నేపథ్యంలో తన కొడుకు రాజారెడ్డి ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా అన్న జగన్ ను మరింత గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్లే కనిపిస్తోంది.
పాఠాలు నేర్పాలనేనా..
తన కొడుకు రాజారెడ్డిని పార్టీలోకి తీసుకుని రావడానికి ముందు రాజకీయంగా పాఠాలు చెప్పడానికి షర్మిలారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కర్నూలు నగరంలో ఉల్లి రైతులకు సంఘీభావం ఊరట కల్పించి ఓదార్చాలని బయలుదేరిన వైయస్ షర్మిల రెడ్డి తన కొడుకు రాజారెడ్డిని కూడా వెంట తీసుకుని రావడం వెనుక ప్రత్యేక కారణం ఉందనే విషయం ఆమె స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలకు పైగానే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే తన కొడుకును రాజకీయంగా పరిణితి చెందేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Pcc అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూల్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
"సరైన సమయంలో పార్టీలోకి తీసుకొని వస్తా" అని చెప్పడమే నిదర్శనం.
బోధనల నుంచి రాజకీయాలకు..
అమ్మమ్మ, తల్లిదండ్రులు బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల, చెల్లెలితో రాజారెడ్డి

అమ్మమ్మ, తల్లిదండ్రులు బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల, చెల్లెలితో రాజారెడ్డి

వైఎస్ షర్మిలారెడ్డి కొడుకు రాజారెడ్డి కూడా తండ్రి బ్రదర్ అనిల్ కుమార్ బాటలోనే సాగుతున్నారు. క్రైస్తవ మత బోధనలు చేయడంలో బ్రదర్ అనిల్ కుమార్ ఎవాంజెలిస్ట్ గా మంచి గుర్తింపు సాధించారు. అయిన కొడుకు రాజారెడ్డి కూడా అదే బాటలో మంచి వక్తగా రాణిస్తున్నారు. క్రిస్టియన్ సామాజిక వర్గంలో ఇప్పుడిప్పుడే ఆయన గుర్తింపు పొందుతున్నారు. రాజకీయ ఓనమాలు నేర్చుకోవడం ద్వారా తల్లికి తోడుగా ఎదగడానికి రాజారెడ్డి కర్నూలు నుంచి అడుగులు వేసినట్లు కనిపిస్తోంది.. రానున్న ఎన్నికల నాటికి మేనమామ వైఎస్ జగన్ కు ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నారు? ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నియోజకవర్గ నుంచి బరిలోకి దిగుతారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.
Read More
Next Story