
Mango price crisis || చిత్తూరులో జగన్ 'ఫీవర్'.కాకరేపుతున్న పర్యటన
మామిడి రైతులను పరామర్శించడానికి మాజీ సీఎం 9న బంగారుపాలెంలో పర్యటించనున్నారు.
సంక్షోభంలో చిక్కుకున్న మామిడిరైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించనున్నారు. ఆయన పరామర్శ యాత్ర మీద పోలీసుల ఆంక్షలు ఉన్నపటికి పర్యటన విజయవంతమయ్యేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పరామర్శయాత్ర ఆరోజు ఉదయం పదిగంటలకు మొదలవుతుంది.
బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ బంగారుపాలెంకు చేరుకుంటారు. దీనికోసం జాతీయ రహదారి నెంబర్ 4లో చెన్నై- బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో తగ్గువారిపల్లె పంచాయతీ కొత్తపల్లి వద్ద హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు.
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం వద్ద ఉన్న ప్రైవేటు మామిడికాయల మండీ ఆయన సందర్శించనున్నారు. అక్కడి రైతులతో జగన్ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
రూట్ మ్యాప్ పై సందిగ్ధం
పలనాడు జిల్లా రెంటపాళ్ళ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత రాష్ట్రంలో జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారు.
బంగారుపాళెంకు వైఎస్. జగన్ రాక సందర్భంగా వైసిపి జన సమీకరణకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పోలీసు అధికారులు జగన్ పర్యటనకు ఆంక్షలు విధించారు. దీంతో వైసిపి చీఫ్ పర్యటన పై సర్వత్ర ఆసక్తి ఏర్పడింది.

బంగారుపాళెం సమీపంలోని కొత్తపల్లె వద్ద సిద్ధం చేస్తున్న హెలీపాడ్
1. బంగారుపాలెం వద్ద ఏర్పాటు చేసే హెలిపాడ్ నుంచి ఒక రూట్లో వెళ్లాలని వైసిపి నిర్ణయించింది
2. పోలీసు అధికారులు భద్రతా కారణాల రీత్యా ఇంకో మార్గాన్ని సూచించారు.
ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
"మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లభించింది" అని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.
"సోమవారం (ఈరోజు) సాయంత్రం అనుమతులకు సంబంధించిన పత్రాలు కూడా ఎస్పీ అందిస్తామని చెప్పారు" అని డాక్టర్ సునీల్ కుమార్ వివరించారు.
"మేము జన సమీకరణ చేయడం లేదు. అభిమానంతో వచ్చే పార్టీ శ్రేణులను ఆపడం సాధ్యమవుతుందా? అని కూడా డాక్టర్ సునీల్ వ్యాఖ్యానించారు.
జగన్ పర్యటన ఎందుకు
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడికాయల దిగుబడి అధికంగా వచ్చింది. గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కూడా ప్రకటించింది. కానీ, పరిశ్రమల వద్ద రైతులకు భంగపాటు తప్పలేదు. అంతేకాకుండా,
చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి మీపంలో ఉన్న దామన్న చర్ల వద్ద ప్రైవేటు మామిడికాయల మండీలు ఉన్నాయి. చంద్రగిరి, పలమనేరు, కుప్పం, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని వేలాది మంది రైతులు ఈ రెండు మార్కెట్లకు ఎక్కువగా మామిడికాయలను తీసుకువస్తున్నారు.
జిల్లాలోని గుజ్జు పరిశ్రమలతో పాటు, ప్రైవేటు మండీల వద్ద కూడా రైతులకు ధర దక్కక మామిడికాయలు రోడ్ల వెంట పారబోయడం, కడుపు మంట భరించలేని రైతులు కొందరు రోడ్లపైనే తోలేశారు. మామిడి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తే మామిడికాయలు కొనుగోలు చేసే గుచ్చుపరిశ్రమలు కిలో 8కి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ధరలు దగా...
గుజ్జు పరిశ్రమలు, అక్కడ ప్రైవేటు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న ర్యాంపుల వద్ద కూడా రైతులకు గిట్టుబాటు ధర లభించలేదు. కిలో తోతాపురి మామిడికి మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రోజుల తరబడి మామిడికాయల లోడుతో ఉన్న ట్రాక్టర్లు రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. తీరా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చే సరికి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల కాయలు మాగిపోయాయి. ఆ మామిడికాయలు కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీల యాజమాన్యం అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో.
రైతుల ఓదార్పు కోసం
ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన రైతులను ఓదార్చడానికి, వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్. జగన్ పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాలెం వద్ద ఉన్న ప్రైవేటు మామిడికాయల మండీని సందర్శించడానికి కార్యక్రమాన్ని వైసిపి నేతలు ఖరారు చేశారు. అప్పటినుంచి ఆంక్షలు తెరపైకి తీసుకురావడం సరైనది కాదని వైసిపి నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
"ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే" అని వైసిపి నాయకులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
"ఎన్ని ఆంక్షలు ఉన్నా చిత్తూరు జిల్లా బంగారుపాలెం లో మా అధినేత జగన్ పర్యటిస్తారు" అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
బంగారుపాలెం మార్కెట్ యార్డులోని రైతులతో జగన్ భేటీ కానున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం వల్ల ఏ మేరకు మేలు జరిగింది అనే విషయాలపై పార్టీ నేతలు చెప్పారు.
"రైతుల కడగండ్లు తెలుసుకోవడానికి తమ పార్టీ అధినేత వైయస్ జగన్ బంగారుపాలెంకు వస్తున్నారు" అని వైసిపి నేతలు స్పష్టం చేశారు.
ఏ మార్గంలో వెళ్ళాలి..
బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈనెల తొమ్మిదో తేదీ 10 గంటలకు బంగారుపాలెం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. ఆయన ఏ మార్గంలో వెళ్లాలని విషయంపై వైసిపి, పోలీస్ అధికారుల రూట్ మ్యాప్ పొంతన కుదరడం లేదు.
చెన్నై బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న బంగారుపాలెం మండలం మొగిలి వెంకటగిరి గ్రామానికి సమీపంలో ఉన్న తగ్గువారిపల్లె పంచాయతీ కొత్తపల్లి వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు.
"అనుమతులు రావడంతో, ఆ పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి" అని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చెప్పారు.
వైసిపి ప్లాన్
బంగారుపాలెంకు నాలుగు కిలోమీటర్లు దూరంలో కొత్తపల్లి వద్ద హెలిపాడ్ఉంటుంది. బంగారుపాలెం మామిడికాయల మార్కెట్ యార్డ్ వద్దకు వెళ్లడానికి కొత్తపల్లి నుంచి నలగాంపల్లె వద్ద ఉన్న ఫ్లైఓవర్ దాటుకొని తగ్గువారిపల్లి మీదుగా మార్కెట్ యార్డ్ వద్దకు వెళ్లాలనేది వైసిపి నేతల ప్లాన్. అంటే ఈ మార్గంలో జనంతో భేటీ కావడంతో పాటు సమీకరణ లేకుండే వచ్చే పార్టీ శ్రేణులు కూడా సులువుగా ఉంటుంది అనేది వైసిపి నేతల అభిప్రాయం.
పోలీస్ రూట్
మాజీ సీఎం వైఎస్. జగన్ బంగారుపాలెంలో పర్యటనకు పోలీసు శాఖ ఓ మార్గాన్ని సూచించింది. కొత్తపల్లి వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ నుంచి నల్లగాంపల్లె ఫ్లై ఓవర్ మీదుగా పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి దాటుకొని తహసిల్దార్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ కు చేరుకునే విధంగా పోలీస్ శాఖ రూట్ మ్యాప్ ఇచ్చింది. దీంతో జగన్ మార్కెట్ యార్డ్ వద్దకు ఏ మార్గంలో ప్రయాణిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
అందుకు కారణం
పలనాడు జిల్లా రెంటపాళ్ల వద్ద జరిగిన ఘటనను పోలీసు వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
"రెంటపాళ్ల రోడ్లు ఇరుకైనవి. తక్కువ మంది ఉండాలి. కాన్వాయ్ ఎన్ని వాహనాలు ఉండాలి" అనే ఆంక్షలు ఉన్నప్పటికీ ఇసుక వేస్తే రాలనంతగా వైసీపీ అభిమానులు తరలిరావడం వల్ల ఆ ప్రాంతం కిక్కిరిసింది. అభిమానుల ఉత్సాహం రెట్టింపుతో పై చివరికి జగన్ ప్రయాణించే వాహనంపై కూడా ఎక్కేశారు. ఇదే సమయంలో జగన్ చూడడానికి వచ్చిన అభిమాని ఆయన వాహనం కిందే నలిగిపోయాడనేది అభియోగం.
ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం లో పోలీసుల మాట చెల్లుతుందా? వైసిపి నేతల పంతం నెగ్గుతుందా?? రైతులను పరామర్శించడానికి వైయస్ జగన్ రాక నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇంకో రోజులో ఏమి జరగబోతుంది అనేది వేచి చూడక తప్పదు.
Next Story