ఇడుపులపాయ: వైఎస్ఆర్ ఘాట్లో జగన్ ప్రార్ధన..   ముందున్న సవాళ్లు ఏమిటి?
x

ఇడుపులపాయ: వైఎస్ఆర్ ఘాట్లో జగన్ ప్రార్ధన.. ముందున్న సవాళ్లు ఏమిటి?

మాజీ సీఎం జగన్ పులివెందులకు వచ్చారు. తన ముందున్న అనేక నేపథ్యంలో ఆయన తండి వైఎస్ ఘాట్ వద్ద ఒక్కరే ఏమని ప్రార్ధించారు.


మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. "తల్లి, చెల్లితో వివాదంతో పాటు ఇంకో రెండు సవాళ్లు జగన్ ముందు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మూడు రోజుల పర్యటనకు పులివెందులకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బెంగళూరు యలహంక విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ల బయలుదేరిన ఆయన ఇడుపులపాయలో దిగారు. జిల్లాలోని కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి తో పాటు ycp మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులుతరలివచ్చారు. ఇడుపులపాయలో తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ సమాధి వద్ద జగన్ మోకాళ్లపై కూర్చొని మౌనంగా ప్రార్థించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇటీవల తల్లి వైఎస్. విజయమ్మ, చెల్లి వైఎస్. షర్మిలపై ఆస్తులు, ప్రధానంగా షేర్ల బదిలీ గిఫ్ట్ వ్యవహారంపై జగన్ కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య వేడిగా ఆరోపణలతో కూడిన మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో..

పర్యటన వెనక కారణం ఏమిటి?
ఇడుపులపాయకు మాజీ సీఎం వైఎస్. జగన్ రావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు భావిస్తున్నారు. తాజాగా కుటుంబంలో మళ్లీ రగిలిన ఆస్తుల గొడవ వివాదం ఒకటైతే, కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సవాళ్లు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారు. ఇంకొందరు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు స్పష్టంగా రాజకీయ వాతావరణం చెప్పకనే చెబుతోంది. దీనికి తోడు పులివెందులలో పట్టుతగ్గున్న వ్యవహారం ఆయనకు పంటి కాంద రాయిలా మారిందని భావిస్తున్నారు.
రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల నుంచి జగన్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథరెడ్డి, బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి డాక్టర్ సుధ వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట ఎంపీగా వారి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప ఎంపీగా జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి గెలిచిన విషయం తెలిసింది.
కడప జిల్లా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సుధ కదలికలపై వైసీపీ నాయకులు సందేహిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమలోని కొందరు నేతలు కూడా, జనసేనలోకి వెళ్లడానికి దారులు వెతక్కుంటున్నట్లు సమాచారం. వారిని కట్టడి చేయడం కూడా ఓ సవాల్ గానే పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో..
జగన్ ముందు సవాళ్లు
తల్లి, చెల్లిపై కోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిని టీడీపీ అస్త్రంగా వాడుకుంటోంది. ఇదే సమయంలో టీడీపీ కూటమి నుంచి కూడా జగన్ ముందు ఇంకొన్నిసవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు టీడీపీ, జనసేనలోకి జంప్ అయ్యారు. అందులో సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన పార్టీ మారడానికి ముందే జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు ఆస్కారం కల్పించాయి.
"పోయేవాళ్లు పోతారు. ఉండేవాళ్లు ఉంటారు" అని అని ఏమాత్రం లెక్కలేని విధంగా మాట్లాడారు. "నాయకుడు అంటే జనంలో నుంచి పుడతాడు. పదవి వచ్చిన తర్వాత అయ్యేది నాయకుడు కాదు" అని కూడా అన్నారు. కాగా, "రాజకీయ పార్టీ నడిపే నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు" అని కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. "ఆ తరహా వ్యాఖ్యలు చేయడం జగన్ లో మార్పు రాలేదు. ఆయనలోని ధిక్కారానికి అవి సంకేతం" అని కూడా విశ్లేషకులు చాలా చర్చల్లో అభిప్రాయపడ్డారు.
పట్టు కోసం ప్రయత్నమా?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంపై వైఎస్సార్ కుటుంబ ఆధిపత్యం 1978లో ప్రారంభమైంది. మొదటిసారి ఇక్కడి నుంచి దివంగత సీఎం వైఎస్సార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు జగన్ విజయంతో వారి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. అందులో వైయస్సార్ కుటుంబంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా వైయస్ జగన్ తో చెల్లి షర్మిల విభేదించి పక్కకు వెళ్లిపోవడం. ఆ తర్వాత వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు, వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదా నుంచి తల్లి విజయమను తప్పించడం, తాజాగా తల్లి తోపాటు చెల్లి షర్మిలపై కూడా జగన్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబంలోనే కాకుండా పులివెందులలో కూడా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. భారీ మెజారిటీ నుంచి, స్వల్పంగాయన సరే గెలిస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు.
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పై 75 వేల మెజార్టీ సాధించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై జగన్ 90,110 ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కింది.
2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏం. రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) నుంచి జగన్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అంతకుముందు రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 61, 176 ఓట్లకు మెజారిటీ పడిపోయింది. అంటే 28 వేల ఓట్ల మెజారిటీ జగన్ కు తగ్గడం గమనించదగిన విషయం.
ఇదీ కారణమే...
దీనికి ప్రధానంగా బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసు నేపథ్యంలో ఈయన కూతురు సునీత, చెల్లి షర్మిల ఒకే వేదికలపై నుంచి అన్న జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వారి ప్రభావం విపరీతంగా పని చేయడంతో పాటు టీడీపీ నాయకుల నుంచి కూడా గట్టి సవాళ్లే ఎదురయ్యాయి. దీంతో జగన్కు మెజారిటీ తగ్గడానికి కారణమైంది. అంతేకాకుండా, వైఎస్సార్ కుటుంబ గొడవల నేపథ్యంలో ఎటువైపు నిలబడాలి అనేది కూడా పులివెందుల ప్రజలు సందిగ్ధావస్థలో పడిపోయారు.
"అన్నా, చెల్లెలు వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు" వీరిని అత్యంత ఎక్కువగా గౌరవించే వైఎస్సార్ అభిమానులను అంతర్మథనంలో పడేశారు" అని ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. కుటుంబ వ్యవహారాన్ని రచ్చ తీర్చుకోవడంపై దశాబ్దాల కాలంగా ఆ కుటుంబాన్ని అభిమానించే నాయకులు, వ్యక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి కల్పించారు" అని ఆ ప్రాంత సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.
అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఇప్పటికీ పలుమార్లు పులివెందుల పర్యటనకు వచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజలను స్వయంగా కలవడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. గత నెలలో పులివెందులకు వచ్చినప్పుడు జనం పలుచగా ఉండడం, మూడో రోజులు ఒకే రకమైన ముఖాలు కనిపిస్తూ ఉండడం జగన్ గమనించారని తెలిసింది. దీంతో సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడని తెలిసింది. ఈ ఆగ్రహం భరించలేక అవినాష్ తన పీఏపై చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అంటే మొత్తం మీద "పులివెందులలో తమ పవర్ తగ్గుతోంది" అని జగన్ పసిగట్టినట్లు భావిస్తున్నారు.
"ఇది వాస్తవమే" అని పులివెందుల ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ స్పష్టం చేశారు. గత పర్యటనలో అవినాష్ పై జగన్ మండిపడిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మూడు రోజుల పర్యటన కోసం మళ్లీ జగన్ మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద చాలాసేపు మౌనంగా ప్రార్థించిన అనంతరం ఆయన నాయకులను కలిశారు. ఆ తర్వాత పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో యథావిధిగానే ఎంపీ అవినాష్, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కడప మేయర్ సురేష్ బాబుతో సహా జిల్లాలోని అనేక ప్రాంతానికి నాయకులు అభిమానులు తరలివచ్చారు. జనం కూడా ఈసారి వలచగానే ఉన్నట్లు ఆ ప్రాంతం నుంచి అందిన సమాచారం. గురువారం వరకు జగన్ పులివెందులలో జనానికి అందుబాటులో ఉండనున్నారు. ఈ సమయంలో నాయకులకు ఆయన ఎలాంటి ఉద్బోధ చేస్తారు. ఎలాంటి అనుభవాలను రుచి చూడబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే.
తండ్రి సమాధి వద్ద ఏమని ప్రార్థించారు?

మూడు రోజుల పర్యటనకు పులివెందులకు వచ్చిన వైయస్ జగన్ ఇడుపులపాయలు తండ్రి సమాధి వద్ద మౌనంగా చాలా సేపు ప్రార్థించారు.. ఇంటి పోరు నుంచి కాపాడాలని కోరుకున్నారా? తల్లి చెల్లిపై కోర్టులో కేసు వేయడానికి దారి తీసిన పరిస్థితి ఏంటని నివేదించుకున్నారా? తన స్వార్జిత ఆస్తుల్లో భాగం ఇవ్వాల్సిన అవసరం ఉందా అని తండ్రిని ప్రశ్నించారా? అక్రమాస్తుల కేసులో వైయస్సార్ పేరు కూడా చేరడం తెలిసిందే. దీనిపై తండ్రి ఆత్మకు జగన్ ఏమని సమాధానం చెప్పుకున్నారు. దేవుని బిడ్డగా, దేవుని వాక్కును పాటిస్తూ తాను సన్మార్గంలోనే పయనిస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారా? రాజకీయ ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఏమి చేయాలో కర్తవ్య బోధ చేయమని తండ్రిని అభ్యర్థించారా? దీనికి పరలోకమందున్న మా తండ్రి ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి మరింత మనోధైర్యం ప్రసాదించమని అభ్యర్థించారా? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అన్ని నివేదించుకున్నట్లే కనిపిస్తోంది.


Read More
Next Story