వినడానికి విడ్డూరమే..!  అనంతలో ఐదెకరాల కొరత..!!
x

వినడానికి విడ్డూరమే..! "అనంత"లో ఐదెకరాల కొరత..!!

వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. టమాటా యార్డుకు ఐదెకరాలు ప్రభుత్వ భూమి కరువైంది. వినడానికి విడ్డూరం అనిపించవచ్చు. ఇది నిజం. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏమంటున్నారు?


"ఐదు ఊర్లు ఇవ్వమని పాండవులు బతిమలాడినా.. దుర్యోధనుడు అంగీకరించలేదు" అని మహాభారతంలో చదువుకున్నాం.

అనంతపురం శివారుల్లో ఐదెకరాల ప్రభుత్వ భూమి లేదంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ టమాటా రైతులకు యార్డు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంది. ప్రైవేటు వ్యక్తులు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న మండీల్లో రూ. లక్షల్లో వ్యాపారం సాగుతోంది. ఇక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులు, ధరలు లభించక దోపిడీకి గురవుతున్నా, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖాధికారులకు చీమ కుట్టినట్టు కూడా కనిపించడం లేదు. స్థలం కావాలనే ప్రతిపాదనలు కూడా పంపలేని స్థితిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
మారిన రైతుల ఆలోచన
అనంతపురం జిల్లాలో వర్షాధారంతో 7.5 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయడం సాధారణమే. ప్రకృతి కరుణించి వర్షాలు కురిస్తేనే పంట చేతికి దక్కుతుంది. వ్యవసాయ బోర్లు ఉన్నవారికి కాస్త ఊరట ఉంటుంది. లేదంటే పెట్టుబడి, సేద్యం ఖర్చులు నష్టపోవాల్సిందే. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారుల చొరవతో పంటమార్పడికి సాహసం చేసిన రైతులు జిల్లాలో టమాటా పంట సాగుకు మొగ్గు చూపారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో టమటా పంట సాగు చేస్తున్నారు.
"ఈ మార్కెట్ కు సోమవారం ఒకరోజే 4,800 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి కరణం రాంప్రసాద్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు తెలిపారు. 15 కిలోలు ఉన్న 30 వేల బాక్సులు లాజ్ సేల్ కూడా జరుగుతుంది" అని తెలిపారు.
రాప్తాడు: నియోజకవర్గంలో రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లె, ఆత్మకూరు మండలాల్లో టమాటా సాగు జరుగుతోంది.
కల్యాణదుర్గం:కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, మండలాలు
ఉరవకొండ ప్రాంతంలో వజ్రకరూరు, కూడేరు మండలాల్లోని 40 వేల ఎకరాల్లో రైతులు టమాట పంటలు సాగు చేస్తున్నారు. వర్షాభావం తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో అందుబాటులోని నీటి వనరులు సద్వినియోగం చేసుకునేందుకు డ్రిప్ పద్ధతిని వాడడంతో పాటు వ్యవసాయ బోర్ల కింద సాగు చేస్తున్నారు.

అనంతపురం రూరల్ పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కుక్కనపల్లె ప్రైవేటు టమాట మార్కెట్కు టమాటాలు తరలిస్తున్నారు. సోమవారం ఒకరోజే 4,800 టన్నుల టమాటాలు తీసుకుని వచ్చారంటే ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఏడాదిలో మే, జూన్, జూలై నెలల్లో దిగుబడి అధికంగా ఉండడం వల్ల ధరలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అది ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే మార్కెట్ యార్డుల్లో మాత్రమే. అనంతపురం ప్రైవేటు టమాటా మార్కెట్లో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

ప్రభుత్వ స్థలం లేదంట..

అనంతపురం పట్టణానికి శివారులో ప్రభుత్వ స్థలం లేదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు గోళ్లు గిల్లుకుంటున్నారు. మినహా, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలనే ఆలోచన మాత్రం చేయలేదు. దీంతో రూ. ఏటా కోట్ల టమాటా వ్యాపార లావాదేవీలు సాగించే రైతులకు వ్యవసాయ మార్కెట్ అందుబాటులోకి రాలేదు. ఆ దిశగా రెండు శాఖల అధికారులు తమాషా చూస్తున్నట్లే వ్యవహరిస్తున్నారు. కళ్లదుటే రైతులు దోపిడీకి గురవుతున్నా, స్పందించిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

"మార్కెట్ యార్డు ఏర్పాటుకు అనంతపురం శివారులో ప్రభుత్వ స్థలం లభించలేదు" అని రాప్తాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కరణం రాంప్రసాద్ చెప్పారు. "మా శాఖ అధికారులు జాతీయ రహదారిలోని పంపాపురం వద్ద కొన్ని ఎకరాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే, చాలా వరకు ఇళ్లు నిర్మించి, ఆక్రమించిన విషయం బయటపడింది" అని ఆయన వివరించారు. అది కూడా ఆ స్థలం ఒకే చోట లేదని ఆయన చెప్పారు.


అడగాలి కదా...
అధికారులు తమ అవసరాలను నివేదిస్తేనే, ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆ దిశగా నామమాత్రపు చర్యలకే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిమితిమైంది. ఇదే విషయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వద్ద "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ప్రస్తావించగా,

"రైతుల సమస్యలపై రెండు రోజుల కిందట నేను సమీక్షించాను. అప్పుడు విషయం తెలిసింది" అని కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అవసరాలు ఏమిటనేది ఆ శాఖలు ప్రపోజల్స్ పంపిస్తే, రెవెన్యూ విభాగం నుంచి మేము చేయాల్సింది చేస్తాం. ఈ విషయంలో "నేనే చొరవ తీసుకుని, రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటా" అని స్పష్టం చేశారు. రైతుల ఆందోళన కూడా నా దృష్టికి వచ్చింది అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

స్థలం ఉన్నా.. కుదరదు..
అనంతపురం నుంచి కదిరికి వెళ్లే మార్గంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు ఏడెకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అక్కడ మార్కెట్ యార్డు మండీలు ఏర్పాటుకు పరిశీలన కోసం ప్రతిపాదనలు పంపించారు. ఆ స్థలం దేవాదాయ శాఖకు సంబంధించినది అని విషయం కూడా ప్రస్తావించారు. "స్థలం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. పక్కా షెడ్లు మాత్రం నిర్మించకండి" అని ఉన్నతాధికారుల నుంచి సమాధానం వచ్చినట్లు కరణం రాంప్రసాద్ చెప్పారు. దీంతో ఈ విషయం అక్కడితో ఆగింది. మినహా ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం రెవెన్యూ విభాగానికి కూడా నివేదించలేదని తెలిసింది. జిల్లా కలెక్టర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అదునుగా...


జోరుగా ప్రైవేటు వ్యాపారం
అనంతపురం పట్టణ శివారు కక్కనపల్లె వద్ద ప్రైవేటు వ్యక్తులు దాదాపు 50 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు తీసుకునే వచ్చే టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి వ్యాపారులపై వ్యవసాయ మార్కెటింగ్ అజమాయిషీ ఏమాత్రం లేకపోవడం కూడా వ్యాపారులు ఇష్జారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. దీంతో టమాట ఉత్పత్తికి ధర లభించక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

తోటల్లో కాయలు కోతకు కూలి మాట పక్కన ఉంచుదాం. 15 కిలోల టమాటాల క్రేటుకు రవాణాకు రూ.25, మార్కెట్ వద్ద అన్ లోడ్ కు రూ. రెండు చెల్లించాలి. కూలీతో కలిపితే ఒక బాక్సుకు రూ. 60 నుంచి రూ.75 రైతు భరించాలి. ఇంతా చేసినా, వ్యాపారుల సిండికేట్ వల్ల 15 కిలోల టమాటాలు వేలం పాటల్లో రూ. 300 నుంచి రూ.400కు కూడా కొనుగోలు చేయడం లేదు. దీంతో గిట్టుబాటు కూడా కావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

"ఈ పరిస్థితి చక్కబడాలంటే ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ ద్వారా లావాదేవీలు సాగించాల్సిన అవసరం ఉంది" అని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి అంటున్నారు. "ప్రైవేటు వ్యక్తులు మండీలు ఏర్పాటు చేయడం వల్ల వారి దోపిడీని ప్రశ్నించే వారు లేరు. గట్టిగా నిలదీస్తే, కొనుగోళ్లు ఆపేస్తారు. దీనివల్ల రైతులు నష్టపోతారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వారికి కప్పం కట్టాలి...
రాజులు పోయారు. సామంతులు పోయారు. కప్పం మాట కనుమరుగు కాలేదు. అనంతపురం మార్కెట్ వద్ద ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు టమాట మార్కెట్ వద్ద లారీ వెల్ఫేర్ అసోసియేషియన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ మార్కెట్ నుంచి టమాటా లోడ్లు తీసుకుని వెళ్లాలంటే స్థానిక లారీలు, టెంపోలే వాడాలి. బయటి నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. అలా చేయాలంటే ప్రతి వాహనం రూ. 5000 వేలు కప్పం కట్టాలి. ఎందుకంటే "ఇక్కడ మాకు భక్తి పోతుంది. ఉపాధి కావాలి. వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమానికి వాడుతాం" అని అనంతపురం లారీ వెల్ఫేర్ అసోసియేషియన్ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. "ఈ లెక్కన వారికి రోజులు కనీసంగా రూ. 70 వేలు వసూలు అవుతుంది" అని స్థానిక వ్యాపారి ఒకరు చెప్పారు.
"కర్ణాటక, జిల్లా పరిధిలోని వాహనదారులు కప్పం చెల్లించకుంటే, టమాటాల కోనుగోళ్లు సాగనివ్వకుండా అడ్డకుంటున్నారు. ఇది కాస్తా రైతులను విపరీతంగా దెబ్బతీస్తోంది" అని రైతు సంఘం నేత చంద్రశేఖరరెడ్డి వివరించారు.

ఈ ప్రైవేటు మార్కెట్ కు ఎంతమేరకు టమాట సరుకు వస్తోంది? ఎంతకకు కొనుగోలు చేస్తున్నారు? అనే విషయాలు మార్కెటింగ్ శాఖాధికారులు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. చెప్పగలగుతున్నారు. కానీ, ప్రభుత్వరంగంలోకి తీసుకుని రావడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ దోపిడీ జరుగుతున్న తీరు కూడా వారికి తెలుస్తోంది. కూరగాయల నుంచి సెస్సు వసూలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసింది. దీంతో మార్కెట్లో రుసుం రూ. నాలుగుకు బదులు రూ. 10 వసూలు చేస్తున్నా, అడిగేవారు లేరు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా స్పందించిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందనేది వేచి చూడాలి.
Read More
Next Story