మళ్లీ... ఒంటరి పోరు తప్పదా!?
x

మళ్లీ..." ఒంటరి" పోరు తప్పదా!?

ఒంటరిగానే వైఎస్. జగన్ యుద్ధానికి సమాయత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి పోరు, అధికార పక్షాల నుంచి ముప్పేట దాడి నుంచి తనను తాను కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకోవాల్సిన స్థితి వచ్చింది.


రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిన తర్వాత అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుంటూ, ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవడం ఓ ఎత్తయితే, ప్రతిపక్షంలో ఉంటూ బలహీన పడిన తర్వాత అధికార పార్టీని ఎదుర్కొని ఓడించడం మరో యుద్ధం లాంటిదే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో విభిన్నంగా ఉన్నాయి.

గతాన్ని స్పర్శిద్దాం..

తండ్రి డాక్టర్ వైయస్సార్ కుటుంబ రాజకీయ వారసత్వంతో వైయస్ జగన్మోహనరెడ్డి 2009 తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం కడప పార్లమెంటు స్థానం నుంచి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత సెప్టెంబర్ రెండవ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోక చనిపోయిన కుటుంబాల కోస చేపట్టిన ఓదార్పుయాత్రకు కొన్ని రోజలు తరువాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అభ్యంతరం చెప్పింది. దీంతో పార్టీ, ఎంపీ పదవికి, పులివెందుల నుంచి ఎమ్మెల్యే తన తల్లి వైయస్ విజయమ్మతో కలిసి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా సత్తా చాటారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సిపి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బలీయమైన రాజకీయ శక్తిగా మారారు.
2012 మే 27వ తేదీ అక్రమాస్తుల ఆరోపణలపై వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలపై సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇందులో మైనింగ్ లీజులు, గనుల కేటాయింపు రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సిబిఐ ఈడి సమన్లు పంపించాయి. 16 నెలలపాటు ఆయన జైలు జీవితం గడపక తప్పలేదు. ఆ కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి.
" ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై అఖిలభారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్ర యాదవ్ స్పందించారు. " ఐదేళ్లపాటు వైయస్ జగన్ కు ఆటుపోట్లు తప్పవు. మొండివాడు అనడం కంటే మూర్ఖుడు అని చెప్పవచ్చు. పిరికివాడు సలహాదారుల మాటలు నమ్మి నట్టేట మునిగారు" అని వ్యాఖ్యానించారు. "ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల వరకు పరవాలేదు. ఆ తర్వాతే ఎలా ఉంటుందనేది చూడాలి. అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నిక ఇది. అనుభవం ఉన్న వ్యక్తి అని విశ్వసించిన ఓటర్లు ఆ ఎన్నికల్లో టిడిపి అని ఆదరించి, పట్టం కట్టారు. వైఎస్ఆర్సిపి 67 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమమైంది. టిడిపి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని వేధించకున్నా, 23 మంది ఎమ్మెల్యేలను తన పక్షానికి లాక్కున్నది. ఆ తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగించిన పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం రక్షణ కూడా కల్పించింది. అక్రమాస్తుల కేసులపై సిబిఐ వైఎస్. జగన్ ను అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. అన్న స్థానంలో సోదరి వైఎస్. షర్మిల ఆ బాధ్యతలు నిర్వహించారు.
2019 ఎన్నికల నాటికి వైఎస్. జగన్ సర్వశక్తులు కూడగట్టుకున్నారు. 151 సీట్లు సాధించి సీఎం అయ్యారు. అధికారం చేపట్టిన నాటి నుంచి రెండో ఆలోచన లేకుండా టిడిపిని ఉక్కుపాదంతో అణిచివేయాలని దిశగా " ప్రజా వేదికను" కూల్చివేయడంతో ప్రారంభించారు. టిడిపి పట్ల ఆయన అనుసరించిన పట్టణ గ్రామీణ స్థాయిలో కూడా ప్రతిబింబించింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, అధినేత ఎన్. చంద్రబాబు " వ్యక్తిత్వ హననం చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇది ఆయనకు గొడ్డలి పెట్టులా మారే పరిస్థితి కనిపిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఫలితాల అనంతరం వైఎస్. జగన్ మాట్లాడుతూ, "ప్రజల తరఫున పోరాడుతాం. పార్టీని, పార్టీ నాయకులను కాపాడుకుంటాం. తిరిగి నిలబడతాం" అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెరచాటు స్నేహ హస్తం
"క్విడ్ ప్రో కో" అనే పదం 2014 ఎన్నికల నుంచి ప్రాచుర్యం లోకి వచ్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడేరనేది ఈడీ, సి.బి.ఐ మోపిన అభియోగం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో అంట కాగిందనేది జగమెరిగిన సత్యం. నరేంద్ర మోదీతో ఆయన సఖ్యతగా మెలిగారు. "ఇదంతా తనపై ఉన్న కేసులను పక్కదారి పట్టించుకోవడానికే" అనే ఆరోపణలను టిడిపి సంధించింది. ఇదంతా గతం. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే..
మారిన సమీకరణలు
గత ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలు సాధించిన వైఎస్ఆర్సిపి ప్రధాని నరేంద్ర మోదీతో సఖ్యతగా మెలిగారు. అందువల్లే తనపై ఉన్న కేసులు కానీ, మాజీ మంత్రి వైయస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ ను కాపాడుకోగలిగారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం విభిన్నమైన పరిస్థితి ఏర్పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయించి, జైలుకు పంపారు. రంగంలోకి దిగిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడంతోపాటు ఏకపక్షంగా మద్దతు కూడా ప్రకటించారు. అంతటితో ఆగక ఢిల్లీలో చక్రం తిప్పి మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ను చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో టిడిపి కూటమి 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో బిజెపికి మ్యాజిక్ ఫిగర్ దక్కని స్థితిలో టిడిపి కూటమి మద్దతు అనివార్యమైంది. ఐదేళ్లపాటు కేసులు వేధింపులతో సతమతమైన టిడిపి, జనసేన పార్టీ నాయకులు, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలతో ఉన్నారు. వీటిని కట్టడి చేయడానికి వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ కు అసాధ్యమైన పని గానే భావిస్తున్నారు.
ఎంట్రీ లేదు..
గత ఐదేళ్లపాటు పరీక్షంగా బిజెపికి తెరచాటు స్నేహహస్తం అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం దారులు మూసుకుపోయాయి. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టిడిపి, జనసేన వల్ల వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి ప్రవేశం అటుంచితే.. సహకారం కూడా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆయనపై సిబిఐ, ఈడి నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
ఇంటిపోరు..
వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు నుంచి ఇంటి పోరు ఎదుర్కొంటున్నారు. సొంత బాబాయ్ వైఎస్. వివేకానందరెడ్డి హత్య దరిమిల ఏర్పడిన పరిస్థితులతో వైయస్ వివేక కూతురు వైఎస్. సునీత, తల్లి సౌభాగ్యమ్మ, సొంత చెల్లెలు వైయస్ షర్మిల తిరగబడ్డారు. ప్రచార సమయంలోనే కాకుండా, అంతకుముందే కేసును సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి వైఎస్. జగన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ పై ఎత్తిన కత్తి దించలేదు. ఇకపై ఈకేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఒంటరిగానే..
స్వతహాగా వైయస్ జగన్ కు ధైర్యం ఎక్కువ అనేది తీసుకున్న మోనార్క్ మార్కు నిర్ణయాలు, గత రెండు ఎన్నికలను ఆయన ఎదుర్కొన్న తీరును చూస్తే, అర్థమవుతుంది. ఒంటరిగానే ఆయన ఎన్నికలకు వెళ్లిన ఆయన సత్తా చాటారు. ఇప్పుడు కూడా ఆయనకు కేంద్రంలోని ఎన్డీఏ సహకారం లభించే పరిస్థితి ఉండదు. మళ్లీ అధికారానికి దూరమైన ఇండియా కూటమి కూడా పట్టించుకోదు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన తన సహజ ధోరణిలోనే ఒంటరిగా ఒంటి చేత్తో పోరాటం చేయకతప్పని పరిస్థితి.
2012 నుంచి వెంటాడుతున్న అక్రమాస్తుల కేసులను ఆయన ఎదుర్కోవాలి. సొంత ఇంటిలో చెల్లెల రూపంలో ఎదురవుతున్న కష్టాలను అధిగమించాలి. గతంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డిఅక్రమాస్తుల కేసులు జైలుకు వెళ్ళినప్పుడు కుటుంబం యావత్తు జనంలోకి వచ్చింది. గతంలో మాదిరి చెల్లెళ్ల ద్వారా ఇప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు ఉండకపోవచ్చు.
అదే సమయంలో కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి సహకారానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరమయ్యారు. , ఈ అంశంపై వెటరన్ జర్నలిస్ట్ రామచంద్రారెడ్డి స్పందించారు.
"జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒంటరివాడే. తట్టుకుని నిలబడగలరు. అని ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. "వైయస్ జగన్ ఒకటి నుంచే ప్రారంభించారు. మొండి ధైర్యం ఉన్న వ్యక్తి. ఎటువంటి పరిస్థితి అయినా తట్టుకోగలరు. ఈ ప్రభుత్వంలో కూడా జనానికి మొదట ఆశలుంటాయి. రెండో ఏడాది నిరుత్సాహం వస్తుంది. మూడో ఏడాది అసంతృప్తి పెరుగుతుంది. ఐదో ఏడాదికి వచ్చేసరికి మార్పు కోరుకుంటారు. ఇక్కడే తీస్తుంది మళ్ళీ వైయస్ జగన్ పార్టీని పునర్ నిర్మాణం చేసుకొని జీరో నుంచి జీవితం ప్రారంభిస్తారని" రామచంద్రారెడ్డి విశ్లేషించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైయస్ జగన్ తనను తాను కాపాడుకోవాలి. పార్టీ శ్రేణులు ధైర్యం కోల్పోకుండా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐదేళ్లపాటు పోరాడాలి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలోని రెడ్ బుక్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
రాజకీయపరమైన వేధింపులతో కాకుండా, " అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణలకు ఆదేశించి, చట్ట ప్రకారం శిక్షించే విధంగా చర్యలు ఉండాలి" అని ఈపాటికి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి సూచించారు.
ఎన్నికల ఫలితాల రోజే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. " ప్రజలు ఇచ్చిన తీర్పు గొప్పది. ఈ అధికారంతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం ఉండదు" అని చెప్పడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకం.


Read More
Next Story