శ్రీవారిసేవ దొరికినా చాలు... అదే మహాభాగ్యం..
x

'శ్రీవారిసేవ' దొరికినా చాలు... అదే మహాభాగ్యం..

మంచి దర్శనం దొరికితే చాలని సామాన్య భక్తుడు భావిస్తాడు. శ్రీవారిసేవకు అంతకంటే ఎక్కువ పోటీ ఉంది. లక్షల మంది నిరీక్షిస్తున్నారు. ఆన్లైన్ లో కూడా రద్దీ ఏర్పడింది.


భక్త ప్రియుడైన భక్తవత్సలుడికి దేవతలు వైకుంఠంలో సేవ చేసి తరించారు. "ఇల వైకుంఠం"లో తిరుమల నంబి, రామానుజాచార్యులు, అనంతాళ్వారులు వంటిఎందరో మహాపురుషులు శేషాచలవాసుడి సేవలో పునీతులయ్యారు. ఆ తరువాత మానవసేవే మాధవసేవగా భావించిన స్వచ్ఛంద సేవకులు తిరుమలలో శ్రీవారి భక్తులకు నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. అలా ముందుకు వచ్చిన ఏర్పడిన సంస్థ శ్రీవారిసేవ.


తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని రెండు నిమిషాలు చూసే మంచి దర్శనం దర్శనం దొరికితే చాలు. ధన్యులమవుతాం. అని భక్తులు పరితపిస్తారు. సామాన్య భక్తుడి నుంచి అత్యున్నత ఉద్యోగి వరకు యాత్రికుల సేవ చేయాలని కోరుకుంటున్నారు. భక్తులకు సేవలు అందించడం కూడా ఒక వరంగా కూడా భావిస్తారు. టీటీడీ "శ్రీవారి సేవ" పేరిట నిర్వహించే స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి దేశంలో తీవ్ర పోటీ ఏర్పడింది. తమ వంతు వచ్చే అవకాశం కోసం రోజులు, నెలల తరబడి కూడా నిరీక్షిస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛంద సేవ చేయడానికి తీవ్ర పోటీ ఉంది. రెండు దశాబ్దాల కాలంలో ఆ సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. దేశ వ్యాపితంగా దాదాపు ఆరు లక్షల నుంచి 8 లక్షల మంది టీటీడీలో పేర్లు నమోదు చేసుకున్నారు.
నమోదు ఇలా..

టీటీడీ వెబ్సైట్ లో శ్రీవారిసేవ కాలం ఉంటుంది. అందులోకి వెళ్లి లాగిన్ కావాలి. అందులో రిజిస్ట్రేషన్ తరువాత మొబైల్ నంబర్, పాస్ వర్డ్ నమోదు చేస్తే, క్యాప్చికా వస్తుంది. ఆ నంబర్ రాయగానే సైట్లోకి వెళతారు. అందులో శ్రీవారి సేవ ఎప్పుడు అందుబాటులో ఉందనే క్యాలెండర్ కనిపిస్తుంది. అక్కడ కూడా కోటా పూర్తి అీయిపోయి ఉంటే, రెడ్ మార్క్, ఖాళీ ఉంటే ఆకుపచ్చ రంగు గుర్తులు చూచిస్తాయి. అలాగే శ్రీవారి సేవకు వచ్చే వారు పాటించాల్సిన నియమాలు, సూచనల ఆఫ్షన్ కూడా ఉంటుంది. ఆ మేరకు సేవలు అందించాల్సి ఉంటుంది.
నియమాలు.. వసతులు
1. శ్రీవారి సేవకు వచ్చే బృందంలో పది మందికి తక్కువ కాకుండా ఉండాలి.
2. హిందువులుగా ఉండాలి. తిరునామం లేదా గంధం నామం వేసుకోవాలి. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
3. మహిళలు ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. అదే రంగు "మెడకు స్కార్ప్" ధరించాలి.
4. పురుషులు తెల్ల పంచె లేదా ప్యాంటు, చొక్కా ధరించాలి. "మెడకు స్కార్ప్" తప్పనిసరి
5. వారికి రవాణా భత్యం ఏమీ ఉండదు.
6. వారి సొంత ఖర్చులతోనే రావాలి.
7. తిరుమలలో మహిళలకు యాత్రీ సదన్లో, పురుషులకు పీఏసీలో వసతి సదుపాయం భోజనం కల్పిస్తారు.
8. వారికి తాత్కాలిక గుర్తింపు కార్డు కూడా ఉంటుంది. అందులో వారి సంస్థల, వివరాలు ఉంటాయి.
9. రోజూ సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ ఏర్పాటు చేసి, మరుసటి రోజు ఎక్కడ డ్యూటీ చేయాలనేది సూచిస్తారు.
10. వారం రోజులు వారు విధులు నిర్వహించాలి.
11 చివరి రోజు తిరుమల శ్రీవారి దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు.
ఈ తరహా సేవలు అందించడానికి దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఉంది. కాగా,
టీటీడీ శ్రీవారి సేవ అనే ఈ కార్యక్రమాన్ని రెండు దశాబ్దాల కిందట అందుబాటులోకి తెచ్చిన ఘనత ముగ్గురు అధికారులకు దక్కుతుంది. అందులో దీనిని అధ్యయనం చేసి అందుబాటుకి తెచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ. సుభాష్ గౌడ్, ప్రస్తుత చీఫ్ పీఆర్ఓ తలారి రవికి ఈ ఖ్యాతి దక్కుతుంది. వీరి ప్రయత్నానికి ఆనాటి సీనియర్ ఐఏఎస్ అధికారి, టీటీడీ విశ్రాంతి ఈఓ కృష్ణయ్య ఇచ్చిన ప్రోత్సాహం అత్యంత ప్రధానమైనది.
టీటీడీ తరహా శ్రీవారిసేవా కార్యక్రమాన్నికొన్ని శ్రీశైలం, షిర్డీ సాయిబాబా ఆలయాల్లో అమలు చేస్తుండగా, జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో కూడా అమలు చేయడానికి తిరుమలలో అధ్యయనం చేసి వెళ్లారు.
టీటీడీ చీప్ పీఆర్ఓ తలారి రవి కూడా ఈ విషయం ధృవీకరించారు. "రెండు రోజులు తిరుమలలో మకాం వేసి, వైష్ణోదేవి ఆలయం అధికారులు పరిశీలన చేశారు" అని చీఫ్ పీఆర్ఓ రవి తెలిపారు. "నేను అక్కడికి వెళ్లినప్పుడు కూడా సుదీర్ఘంగా చర్చించారు" అని కూడా చెప్పారు.
శ్రీవారి సేవకులు ఆ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఊతంగా నిలుస్తున్నారు. వారిపై పనిభారం తగ్గించి, స్వచ్ఛందంగా సేవలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
టీటీడీలో 14 వేల మంది ఉద్యోగులు పనిచేసేవారు. వారిలో శానిటేషన్ పనులు మొదలుకుని, అన్నదానసత్రం, తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధంగా ఉన్న 9 ఆలయాల్లో కూడా వారి సేవలే కీలకం అయ్యాయి. ఈ క్రమంలో రిటైర్మెంట్లు జరగడం వల్ల, ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇదిలావుంటే,

టీటీడీకి ఐ అండ్ పీఆర్ శాఖ నుంచి పీఆర్ఓ నియమితులయ్యే వారు. సుభాష్ గౌడ్ ఆ విధంగా 1995లో పీఆర్ఓగా వచ్చారు. ఇక్కడ యాత్రికుల ఇబ్బందులు, ఉద్యోగులపై పనిభారం గమనించారు. ఇదే విషయమై అప్పటి ఈవో కృష్ణయ్యతో చర్చించారు. ఆ తర్వాత, పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లిన సుభాష్ గౌడ్ నాలుగు రోజులు గడిపారు. వలంటీర్లు అందిస్తున్న సేవలను అధ్యయనం చేశారు. పుట్టపర్తికి వచ్చే దేశ, విదేశీ భక్తులకు అందిస్తున్న సేవలు, అనుసరించే పద్ధతులు గౌరవంగా సేవాభావంతో ఉన్న తీరును పరిశీలించిన సుభాష్ గౌడ్ ఓ నివేదిక తయారుచేసి ఆనాటి టీటీడీ ఈఓ కృష్ణయ్యకు సమర్పించారు. ఈ వ్యవహారంలో ఆనాడు ఏపీఆర్ఓగా ఉన్న తలారి రవి ( ప్రస్తుతం టీటీడీ చీఫ్ పీఆర్ఓ)నీ మమేకం చేశారు.
ఇంతకీ ఏమిటి 'శ్రీవారి సేవ'
2000: టీటీడీ "శ్రీవారిసేవ"ను కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. మొదట్లో టీటీడీ విద్యాసంస్థలో విద్యార్థులను ఈ సేవలో మమేకం చేశారు. తరువాత చెన్నై తిరుపతి కర్ణాటక తదిత ప్రాంతాల నుంచి పలువురు వచ్చి సేవలందించారు.
" మొదట్లో తమకు సమాంతరం వ్యవస్థ అని మొదట టీటీడీ ఉద్యోగులు భావించారు. సహాయ నిరాకరణ కూడా ఎదురైంది" అని ఆ నాటీ టీటీడీ పీఆర్ఓ సుభాష్ గౌడ్ "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో తన అనుభవాలు పంచుకున్నారు.
"టీటీడీ ఆధీనంలోని విద్యా సంస్థల నుంచి ఉదయం బాలికలు, మధ్యాహ్నం తరువాత బాలురు" ఆలా 200 మందితో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి శ్రీవారి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం" అని సుభాష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ఆలయంతో పాటు అన్నదానం, ఇతర ప్రదేశాల్లో యూనిఫాం ధరించిన విద్యార్థులు "మెడకు స్కార్ప్" కట్టుకుని తిరగడం చాలా మంది గమనించారు.
"ఆ తరువాత టీటీడీ ప్రచార ప్రకటనల్లో కూడా శ్రీవారి సేవలో పాల్గొనండి అనే ట్యాగ్ లైన్ ఇవ్వడంతో పాటు ఫోన్ నంబర్లు, ఇచ్చాం. ఆ తరువాత తిరుమలలో భక్తలు రద్దీ దృష్టిలో ఉంచుకొని శ్రీవారి సేవకులను పెంచడానికి తెలుగు, తమిళం, ఆంగ్లం, కన్నడ, హిందీ భాషల్లో లక్షలాది కరపత్రాలు ముద్రించి ఆయా రాష్ట్రాల్లో విశేషంగా ప్రచారం కల్పించాం" అని సుభాష్ గౌడ్ వివరించారు.
అంతేకాకుండా "నేనే స్వయంగా పుస్తకం పట్టుకుని యాత్రికుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని, వారు బస చేసిన గదుల వద్దకు వెళ్లి, విస్తృతంగా చర్చించా. దీనికి అప్పటి ఏపీఆర్ఓ రవి, కొందరు చక్కటి సహకారం అందించారు. పొరుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులు కూడా ఫలించాయి. తద్వారా స్వచ్ఛందసేవకు చాలా మంది ముందుకు రావడం వల్ల తిరుమల యాత్రీసదన్ శ్రీవారి సేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేశాం" శ్రీవారి సేవ కార్యక్రమం విస్తృతం కావడానికి చేసిన పనులను వివరించారు.
ఓఎస్టీగా..
అప్పటి టీటీడీ పీఆర్ఓ సుభాష్ గౌడ్ అందించిన సహకారంతో ఏపీఆర్ఓ తలారి రవి శ్రీవారి సేవకు ఓస్టీగా నియమితులయ్యారు. తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ లోని సేవా సదన్, తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమాచార శాఖ కార్యాలయంలో స్వయంగా, పోస్టల్ ద్వారా దరఖాస్తులు తీసుకునే వారు. నానాటికీ సేవకుల సంఖ్య పెరిగింది. దీంతో
" పారదర్శకంగా ఉండాలనే ఆన్ లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకుని వచ్చాం" అని ప్రస్తుత చీఫ్ పీఆర్ఓ తలారి రవి స్పష్టం చేశారు.
"20 ఏళ్ల ప్రస్థానంలో 20 లక్షల మంది తిరుమల, శ్రీవారి సన్నిధి, నిత్య అన్నదానం తో పాటు, టీటీడీ అనుబంధ ఆలయాలలో సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది శాశ్వతంగా పేర్లు నమోదు చేసుకున్నారు" అని తలారి రవి వివరించారు.
"శ్రీవారిసేవకు తీవ్ర పోటీ ఏర్పడింది. గడచిన దశాబ్ద కాలంలో శ్రీవారి సేవలో పాల్గొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నిబంధన మేరకు బృందాలుగా వీర సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్నారు. అందువల్లే ఆ సంఖ్య లక్షలుకి చేరింది" అని తలారి రవి స్పష్టం చేశారు.
నిస్వార్థ సేవ..మరింత విస్తృతం..
తిరుమలలో గతంలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం, శ్రీవారి ఆలయ క్యూలు, ఆలయ సన్నిధికి మాత్రమే పరిమితమై ఉండేవి. గడచిన దశాబ్ద కాలంతో పోలిస్తే శ్రీవారి సేవ చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. అది ఏ ప్రాంతం అని చెప్పడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి. టీటీడీ శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల ఈ సేవలను విస్తృతం చేశారు.
శ్రీవారి సేవకుల సేవలు
తిరుమల, ప్రధానంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తున్నారు. అందులో ప్రధానంగా తిరుమలకు వచ్చే సేవకులు స్వామివారి సన్నిధిలో భక్తులను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర వహిస్తారు. వారికి సమయానగుణంగా అల్పాహారం, మంచినీరు, ఆహారం అందించడంలో శ్రీవారి సేవకులదే ప్రధాన పాత్ర. యాత్రికులకు భోజనం వడ్డించడం, మంచినీరు, అన్నదాన సత్రంలో కూరగాయలు తరగడం, పాత్రలు శుభ్రం చేయడం, చివరికి భక్తుల విస్తరాకులు ఎత్తివేయడం వంటి సేవలతో శ్రీవారి సేవకులు తమకు లభించిన భాగ్యం గా భావిస్తున్నారు.
మాడవీధుల్లో...
తిరుమల ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవలు జరిగే సమయంలో కూడా గ్యాలరీలోని భక్తులకు మంచినీరు అందించడం. ఇబ్బంది ఎదురైతే వారికి సహాయకారిగా ఉంటున్నారు. వాహనసేవలో కళాకారులకు కూడా వారి సేవలు విస్తృతం చేశారు.

శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయించే కౌంటర్లలో శ్రీవారి సేవకులు ఉద్యోగులతో సమానంగా బ్యాంకు సిబ్బందికి సహాయకారిగా. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు విక్రయించే బాధ్యతలతో పాటు టీటీడీ సాహిత్యం, పూజ సామగ్రి, క్యాలెండర్లు, డైరీల విక్రయించే బాధ్యతలు కూడా శ్రీవారి సేవకుల నిర్వహిస్తున్నారు. పుస్తక విక్రయశాలలో పర్యవేక్షణ వృద్ధులకు సహాయం అందించడం కూడా చేస్తున్నారు. చిన్న లడ్డూలను తయారు చేయడం వంటి పనుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు అలంకరించే పూలదండలు తయారు చేయడంలో కూడా సహాయకారిగా ఉంటున్నారు. తిరుపతి, తిరుమలలో యాత్రికుల బ్యాగులను స్కానింగ్ చేయడం వంటి సేవలో కూడా శ్రీవారి సేవకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
వయసును బట్టి విభాగాలు
శ్రీవారి సేవకుల సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కొన్ని విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో.. 18 నుంచి 25 ఏళ్ల వరకు ఒక విభాగం, 35 నుంచి 50 ఏళ్లు, ఆపై వయసు పైబడిన వారికి మరో విభాగం ఏర్పాటు చేస్తున్నారు. వీరికి టీటీడీ ప్రధానంగా తిరుమలలో కీలకమైన పరకామణి ( హుండీ కానుకల లెక్కింపు), బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం, స్థానిక ఆలయాల్లో కూడా బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. టీటీడీ సాంకేతిక విభాగంలో కూడా నిపుణులైన వారి సేవలను వినియోగించుకుంటున్నారు.
కర్తవ్య బోధ

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవ కార్యక్రమానికి హాజరయ్యే సేవకులకు కర్తవ్య బోధ కూడా చేస్తున్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో తరచూ శ్రీవారి సేవకులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. అందులో ప్రధానంగా ప్రతి శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో వేలాదిమంది శ్రీవారి సేవకులతో ఏర్పాటు చేసే సమావేశంలో సామాజిక స్పృహ నైతిక విలువలు దేశభక్తి సేవా తత్వత పెంపొందించడానికి వీలుగా వివిధ అంశాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది నిత్య కృత్యంగా సాగుతూ ఉంటుంది.
Read More
Next Story