అస్త్రాలకు వైసీపీ సాన పెడుతోందా!
x

అస్త్రాలకు వైసీపీ సాన పెడుతోందా!

పార్టీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడాలి. సోషల్ మీడియాకు వైసీపీ పదును పెడుతోంది. ఆ బాధ్యతలు ఓ ఎంపీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కొట్టుమిట్టాడుతోంది. వందల సంఖ్య నుంచి పదులలోకి కార్యకర్తల సంఖ్య పడిపోయింది. ఎన్నికల తరువాత మూడు నెలల నుంచి గౌరవ వేతనాలు కూడా లేవు. తాడేపల్లి ప్యాలెస్ లో మళ్లీ సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. సారధ్య బాధ్యతలు కూడా మారనున్నాయి.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ దృష్టి సారించారు. పార్టీ వాయిస్ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనే కాదు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను సాధారణ ప్రజలకు కూడా చేరవేయడానికి ప్రస్తుతం సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. పార్టీలో క్రియాశీలకంగానే కాకుండా, అర్ధ, అంగబలం ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ బాధ్యతల నుంచి సజ్జల భార్గవరెడ్డిని పక్కకు తప్పించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

2024 ఎన్నికల తరువాత వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, అధికారంలో ఉండగా సలహాదారు హోదాలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట ఎక్కడా వినిపించడం లేదు. పార్టీలోనే కాకుండా, వెలుపల కూడా ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు సోషల్ మీడియా బాధ్యతల నుంచి పక్కకు ఉంచారనేది విశ్వసనీయ సమాచారం.
వారికే కీలక బాధ్యతలు?
ఇప్పటికే వైసీపీకి పదేళ్లుగా నాలుకలా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత తగ్గించారనేది ఆ పార్టీ వర్గాల టాక్. ఆ స్థానంలో వైసీపీ రాయలసీమ ఇన్చార్జిగా, చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ సభ్యుడిగా నియమించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి వరుసగా విజయం సాధించిన పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి సోషల్ మీడియా ఇన్చార్జిగా పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం.
2014లో వైసీపీ ఎదుర్కొన్న మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. 175లో 67 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 102 సీట్లలో టీడీపీ, మిత్రపక్ష బీజేపీ నాలుగు సీట్లు సాధించింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. రాష్ట్ర విభజనకు కారణమనే కోపంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవనివ్వకుండా, ఓటర్లు పాతర వేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల సంగతి అలా ఉంచితే,
కడప:
వైసీపీ అధ్యక్షుడు సొంత జిల్లాలో పది స్థానాలు ఉంటే రాజంపేట మినహా తొమ్మిది సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది.
చిత్తూరు: చిరకాల రాజకీయ ప్రత్యర్థి సీఎం ఎన్. చంద్రబాబుపై ఆధిపత్యం చాటేదిశగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. ఈ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది.
కర్నూలు: 14 స్థానాలకు 11 సీట్లు వైసీపీ మూడు స్థానాలకు పరిమితం చేశారు.
అనంతపురం: 14 సీట్లలో కదిరి, ఉరవకొండ మినహా 12 సీట్లు సాధించడం ద్వారా టీడీపీ మొదటి నుంచి ఉన్న పట్టు నిలుపుకుంది.
2019 ఎన్నికల నాటికి పరిస్థితి తిరగబడింది. 175 స్థానాలకు వైసీపీ 151 సీట్లతో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించింది. ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ ప్రభుత్వం సాగించిన పాలనను ప్రజలు పాస్ మార్కులు వేయలేదు.
2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైఎస్. జగన్ పాలన అలాసాగిందనేది విశ్లేషకుల అంచనా. ఈ విషయాన్ని వైసీపీ అధ్యక్షేడు వైఎస్. జగన్ కూడా ఆలస్యంగా గ్రహించారని ఆయన సన్నిహితులు, విమర్శకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిలో వారి సొంతమీడియా, సోషల్ మీడియా వల్నల నష్టాలే జరిగాయి.
సాక్షి వల్ల ఏమి జరిగింది?
ఈ పరిణామాల వెనక వైసీపీకి సొంత మీడియా సాక్షి దినపత్రిక, టీవీ చానల్ అన్ని బాధ్యతలు భుజస్కందాలపై వేసుకుంది. అందులో క్రియాశీలకంగా వ్యవహరించే పెద్దలు కూడా అధినేత జగన్ కు బాజాభజంత్రీలు మోగించడం మినహా, సలహాలు ఇచ్చే సాహసం చేయలేరు. చేసిన వినేవారు సహించరు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా కూడా ప్రధానపాత్ర పోషించింది.
అధికారంలోకి వచ్చాక ..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి సీఎం ఎన్. చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి అంతులేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారాలు పర్యవేక్షించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి ఆ తరహా ట్రోలింగ్స్, మీమ్స్, రీల్స్ కు అంతం లేకుండా పోయాయి.
అంతేకాకుండా ఆయన పేరుతో ఫేస్ బుక్లో పెట్టిన పోస్టు పార్టీ నేతలను ఆగ్రహానికి గురి చేసింది."పదవుల్లో ఉన్న వారు విమర్శనాత్మక పోస్టులు పెడితే వెళ్లగొట్టక తప్పదు" అనే పోస్టు వైరల్ అయింది. భార్గవరెడ్డి వల్లే సోషల్ మీడియాకు ఈ దర్గతి పట్టింది" అనే వారు చాలా మంది ఉన్నారు.
అంతకుముందు.. ఆందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 350 సోషల్ మీడియా ప్రతినిధులను నియమించారు. అదేవిధంగా యూ ట్యూబర్లను కూడా. తాడేపల్లి సమీపంలోని బహుళ అంతస్తుల ప్రభుత్వ భవనంలో పనిచేసే సోషల్ మీడియా వింగ్ లో దాదాపు వెయ్యి మంది సిబ్బంది నుంచి వచ్చే ఫీడ్ రీల్స్, షార్ట్స్ గా మార్చి తమకు అందుబాటులోని గ్రూపుల్లో షేర్ చేయడం ఆ ప్రతినిధుల కర్తవ్యం. ఇందుకోసం డిజిటల్ పేమెంట్స్ కాకుండా, లిక్విడ్ నగదు కవర్లలో పెట్టి వేతనంగా, అందించే వారని సమాచారం. ఇదే విషయంపై
రాయలసీమకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఏమంటున్నారంటే...
"నాయకులపై కాకుండా వారి కుటుంబీల వ్యక్తిత్వ హననం చేసే వీడియోలు షేర్ చేయమనే విషయం మొదటే నిర్మోహమాటంగా చెప్పాం" అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారం వల్లే వైసీపీకి కోలుకోలేని దెబ్బతగిలిందనే విషయాన్ని కూడా నిర్ధారించారు.
" నెలకు నా వరకు రూ. 60 వేలు ఇవ్వాలని మాట్లాడుకున్నా. ఆ మొత్తం కవర్లలో పెట్టి అందించే వారు. నాకు మిత్రుడు బ్యాంకు ద్వారా పంపించే వారు" అని వివరించారు. అందులో కూడా "మొదట చెప్పిన మొత్తానికి, ప్రతి నెలా ఇచ్చిన నగదుకు సంబంధం లేకుండా స్వాహా చేశారు" అని ఆరోపించారు. ఆ విధంగా వందలాది మందికి చెల్లించాల్సిన మొత్తం భారీగా స్వాహా చేశారు. ఈ విషయాలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళదామంటే వినేవారు లేరు." అని చెప్పిన ఆ ప్రతినిధి సోషల్ మీడియా ఇన్చార్జిగా వ్యవహరించిన భార్గవరెడ్డి రూ. కోట్లు మింగేశారని ఆరోపించారు.
మూడు నెలలుగా చెల్లింపులు లేవు...
ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వారికి మూడు నెలలుగా చెల్లింపులు కూడా జరగడం లేదనే విషయం రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో సోషల్ మీడియా వర్కర్ ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు పర్యవేక్షించిన సజ్జల భార్గవరెడ్డి నుంచి సమాధానం లేదని అన్నారు. దీంతో ఎన్నికల తరువాత యాక్టివ్ గా పనిచేసిన 350 వర్కర్లలో ప్రస్తుతం 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారని సమాచారం.
ఎందుకంత ప్రాధాన్యం?

సోషల్ మీడియాకు వైసీపీనే కాదు. రాజకీయ పార్టీలు, అనేక సంస్థలు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నాయంటే ఓ విషయాన్ని, సమాచారం వేగవంతంగా సామాన్యుడికి చేరవేయడంలో ఆండ్రాయిడ్ ఫోన్లు కీలకంగా మారాయి. యూ ట్యూబ్ తో పాటు వాట్సప్ గ్రూపులదే ప్రధానపాత్ర.

ప్రస్తుతం అధికారం కోల్పోయిన వైసీపీకి సాక్షి మీడియా గ్రూప్ మినహా మరో అస్త్రం లేదు. సీఎం పదవి కోల్పోయిన నేపథ్యంలో వైసీపీపై కొన్ని పత్రికల దాడి తీవ్రంగా ఉంది. గత ఐదేళ్లలో జరిగిన అవకతకలు బట్టబయలు చేస్తున్నారు అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి అంతేలేకుండా పోయిన వ్యవహారంపై ముప్పేట దాడి జరుగుతోంది. గుక్కతిప్పుకోలేని స్థితిలో వైసీపీ సతమతం అవుతోంది. అంతేకాకుండా, రెడ్ బుక్ అమలు ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటిని పత్రికల ద్వారా అందరికీ చేరవేయడం సాధ్యం కాదు. సోషల్ మీడియా ద్వారా టీడీపీ కూటమిని ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో...
జోష్ నింపాలని

అధికారంలో ఉండగా, ఏర్పాటు చేసిన ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రస్తుతం టీడీపీ కూటమి ఆధీనంలోకి వెళ్లింది. సోషల్ మీడియాలో పనిచేసే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వమే నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో వైసీపీ సొంతంగా సోషల్ మీడియా విభాగం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. తాడేపల్లి ప్యాలెస్ లోనే ఓ భాగంలో సోషల్ మీడియా విభాగం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం సిబ్బంది నియామకం కూడా చేయనున్నారు. అంతరంగికులకు మినహా ఇంకొకరికి ప్రవేశం లేని వైఎస్. జగన్ భవన సముదాయంలోకి సోషల్ మీడియా సిబ్బందికి గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తారని తెలిసింది. నిర్ణీత గంటల వరకు పనిచేయించుకునే వారికి లోపలే సకల సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ మిథున్ కే ఎందుకు?

ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించే బాధ్యతలు కూడా మార్చడానికి రంగం సిద్ధం చేశారని అంటున్నారు. పార్టీ నుంచి పక్కకు తప్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి స్థానాన్ని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భర్తీ చేశారు. సోషల్ మీడియా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సజ్జల భార్గవరెడ్డి స్థానంలో పెద్దిరెడ్డి కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించనున్నారని సమాచారం. దీని ద్వారా వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకం కానున్నదనే సంకేతాలు ఉన్నాయి.
పార్టీ వ్యవహారాలే కాకుండా, సోషల్ మీడియా నిర్వహణలో కూడా స్వాహాకు ఆస్కారం లేకుండా వైఎస్. జగన్ దృష్టి సారించినట్లు సమాచారం. అధికారంలో ఉండగా మూడేళ్లలో రూ. 600 కోట్లు సోషల్ మీడియా కోసం పార్టీ నిధులు వెచ్చించారని సమాచారం. అయితే ఈ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి వల్ల దుర్వినియోగం జరిగినట్లు పార్టీ అధినేత గ్రహించారని తెలిసింది. అంతేకాకుండా, పార్టీ అందించిన ఫీడ్ అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో షేర్ చేసిన వ్యక్తులకు ఇచ్చిన మొత్తంలో కోత విధించినట్లు ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. దీంతో నమ్మకంగా పనిచేసే వ్యక్తుల కోసం సాగించిన అన్వేషణలో ఎంపీ మిథున్ రెడ్డి వల్ల మేలు జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో సోషల్ మీడియా బాధ్యతలు ఆయనకే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తాడేపల్లి నివాసంలో సెటప్ పూర్తయ్యాక ఈ కార్యక్రమాలు కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.
Read More
Next Story