కడపపీఠం.. కదులుతోందనేనా.. నన్ను చూసి ఓటెయ్యండి అంటున్నారు..?
x

కడపపీఠం.. కదులుతోందనేనా.. నన్ను చూసి ఓటెయ్యండి అంటున్నారు..?

"నేను విన్నాను. నేను చూశాను. నేనున్నా" అని ధైర్యం చెప్పిన జగన్ "నన్ను చూసి ఓటేయండి" అని అర్థించే స్థాయికి వచ్చారా? జిల్లాలో ప్రతికూల పరిస్థితులే అందుకు కారణమా?32


ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సొంత గడ్డ కడప జిల్లాలో వైఎస్ఆర్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు స్థానాల్లో టిడిపికి, ఒక స్థానంలో జనసేనకు అనుకూల పరిస్థితి ఉందంటున్నారు. మరో రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో కడప జిల్లా చాలా ప్రత్యేకం. డాక్టర్ వైఎస్సార్ కుటుంబాన్ని 40 ఏళ్లకు పైగానే అత్యంత ప్రేమతో ఆదరిస్తున్న కోట కూడా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో గోడలు కదులుతున్నాయి. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెల్లు, పిన్ని రూపంలో ఇంటిపోరు ఎక్కువైంది. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలు వైఎస్ఆర్సిపి విజయావకాశాలపై ప్రభావం చూపిస్తున్నట్లు భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 కి 10 అసెంబ్లీ స్థానాలు, కడప, రాజంపేట ఎంపీ స్థానాలను కూడా వైఎస్ఆర్సిపి దక్కించుకుంది. జిల్లాలో మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబంపై ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం మెండుగా పనిచేసింది. దీనికి అదనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలు కూడా తోడయ్యాయి. ఇది గతం.

2024: సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికల నాటి పరిస్థితి పునరావృతం అయ్యే వాతావరణం కనిపించడం లేదని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, స్థానికంగా పనులు చేయకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రధాన నాయకుల మాటకే విలువ ఇవ్వడం వంటి కారణాల నేపథ్యంలో ఎదురీత తప్పడం లేదని భావిస్తున్నారు. కడప అసెంబ్లీ స్థానంలో డిప్యూటీ సీఎంపై అసంతృప్తి, ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే.. సొంత జిల్లా కావడంతో, నష్టనివారణ, తమ కుటుంబం పట్ల ఉన్న మమకారాన్ని గుర్తు చేస్తూ, ప్రచార గడువు ముగిసే ఒకరోజు ముందు ఫినిషింగ్ టచ్ ఇచ్చి వెళ్లారని తెలుస్తోంది

మారిన స్వరం

" అంజాద్ అన్న మంచోడే. కాస్త కోపం ఎక్కువ. అందర్నీ ప్రేమిస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. నన్ను చూడండి. పార్టీని ఆదరించండి" అని కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ బాషా కోసం ఏర్పాటుచేసిన సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. తన సైనికతో శాసించే స్థాయి నుంచి ఇలా మారడం వెనక ఆంతర్యం ఏమిటనేది చర్చకు ఆస్కారం కల్పించింది. గూడచారి నివేదికలు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తరలివచ్చిన ఎన్నారైలు..

ఉపాధి కోసం కడప జిల్లా నుంచి గల్ఫ్, ఇతర అనేక దేశాలకు వెళ్లిన ఎన్ఆర్ఐలు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా తిరిగి వచ్చారు. జిల్లాలోని రాయచోటి సెగ్మెంట్లో 17వేల మంది, రైల్వే కోడూరు సెగ్మెంట్ పరిధిలో 15 వేలు, రాజంపేట సెగ్మెంట్ నుంచి దాదాపు 15 వేలు, మిగతా ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో. కువైట్, ఇతర అరబ్ దేశాల్లో ఉన్నారు. వారిలో 50 శాతానికి పైబడే ఇళ్లకు తిరిగి వచ్చారని సమాచారం. రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని దాదాపు 600 మంది వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న వారందరినీ అద్దె వాహనాల్లో ఇళ్లకు చేర్చారు. వీరిలో అధిక శాతం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారే అనేది ఆ ప్రాంతం వాళ్ళు చెబుతున్న మాట.

మితిమీరిన ధీమా

అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ తనను చూసి ఓటేస్తారనే మితిమీరిన ధీమాతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని అంటున్నారు. "ఈ ఆలోచనా ధోరణే వైఎస్ఆర్‌సీపీకి శాపంగా మారింది" అని కడప జిల్లాలోని ఓ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్.. ఫెడరల్ ప్రతినిధితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘క్షేత్రస్థాయి పరిణామాలు తెలిసి కూడా అడుగు వేయడం ఆశ్చర్యంగా ఉంది. కడప జిల్లాలో ఐదుకు పైబడి సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’ అని ఆయన విశ్లేషించారు.

వార్తల్లో పులివెందుల..

కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ తమ పార్టీ అభ్యర్థులుగా రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా మిగతా 9 స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. అందులో పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై టిడిపి అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. దాదాపు 42 సంవత్సరాలుగా వైఎస్సార్ కుటుంబం మాత్రమే పులివెందుల రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. మరొకరికి ఇక్కడ ఆస్కారం లేదు. డాక్టర్ వైఎస్ఆర్ నుంచి కుటుంబ సభ్యులందరూ నియోజకవర్గంలో ప్రజలతో అంతలా మమేకమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణం తర్వాత వారి కుటుంబంలోనే కాదు రాజకీయాలను కూడా పెనుమార్పులు ఏర్పడ్డాయి.

దీనివల్ల విజయం సులభం అయినప్పటికీ... మెజార్టీ తగ్గకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగానే కాకుండా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సొంత చెల్లెలు వైఎస్. షర్మిల, బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి కూతురు వైఎస్. సునీత, పిన్ని వైఎస్. సౌభాగ్యమ్మ తిరగబడ్డారు. సీఎం వైఎస్ జగన్‌ను దోషిగా చూపిస్తూ ప్రజలను కలిశారు. దీంతో గతంతో పోలిస్తే విభిన్నమైన వాతావరణం ఏర్పడింది.

కూటమి అభ్యర్థికి ఛాన్స్?

టిడిపి కూటమి నుంచి రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి జనసేన, మరో రిజర్వుడు స్థానం బద్వేలు, జమ్మలమడుగు స్థానం నుంచి బిజెపి అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇందులో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. "పల్లెల్లో పనులు చేయలేదనే ఆరోపణతో పాటు, నాయకుల గుప్పెట్లో ఉన్నారు" అనేది ఎమ్మెల్యే శ్రీనివాసులుపై ఉన్న అభియోగం. వాస్తవానికి ఆయన తన దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి పనులు చేశానని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే కోడూరు మండలం సూరావారిపల్లెలోకి ఎమ్మెల్యే శ్రీనివాసలును రానివ్వకుండా వెళ్ళగొట్టారు. ఆయనపై ఉన్న అసంతృప్తికి ఇది పరాకాష్టగా భావిస్తున్నారు.

రాజంపేట టిక్కెట్ దక్కలేదనే వేదనతో ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు పూర్తిగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆయనకు 20 నుంచి 25 వేల ఓటు బ్యాంకు అన్ని వర్గాల్లో కలిగి ఉన్నారు. ఈయన వల్ల రైల్వే కోడూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌కు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానంలో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా రోశయ్య పోటీలో ఉన్నారు. ఇక్కడ ఫైట్ టైట్‌గానే ఉన్నట్లు చెబుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డిపై బిజెపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ గట్టిగానే ఉంది. కడప అసెంబ్లీ స్థానంలో డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషాపై టిడిపి అభ్యర్థిగా ఆర్. మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ద్వారా టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డికి వాతావరణం అనుకూలంగా మారే పరిస్థితి లేకపోలేదని భావిస్తున్నారు.

రాజంపేట అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి కాకుండా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో కీలకమైన మేడా వర్గంలోని నాయకులందరూ టిడిపిలో చేరిపోయారు. వీరికి అదనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, బలిజ సామాజిక వర్గం కూడా అండదండలు అందిస్తున్న నేపథ్యంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుగవాసి బాలసుబ్రమణ్యం కు మేలు జరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

రాయచోటి శాసనసభ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై టిడిపి అభ్యర్థిగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ దక్కని స్థితిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి లోకి వెళ్లారు. ఇది కాస్త ప్రభావం చూపించినప్పటికీ, నిర్ణయ శక్తిగా ఉన్న ముస్లింలు, బలిజ, వడ్డెర, ఎస్టి సామాజిక వర్గాల ఓటర్లు ఎటు మొగ్గితే అటు విజయం దక్కుతుంది. ఇందుకోసం మాజీ ఎంపీ శుభవాసి పాలకొండ రాయుడు గత పరిచయాలను కదిపారని సమాచారం. దీంతో ఇక్కడ గట్టి పోటీ ఏర్పడింది.

ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 82 ఏళ్ల వయసులో కూడా సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులరెడ్డి పోటీ చేస్తున్నారు. గురువుపై పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవి టిడిపి అభ్యర్థి వరదరాజ రెడ్డికి కలిసివచ్చే అంశాలుగా పరిగణిస్తున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డిపై మాజీ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి గతంలోనే వైఎస్ఆర్సిపిలో చేరారు. ఈయన ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుంది అనేది సందేహమే. కాగా వైఎస్ఆర్సిపి పై ఉన్న వ్యతిరేకత, తమ వర్గం సహకారం మెండుగా ఉందని బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మైదుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి పై టిడిపి అభ్యర్థిగా మళ్లీ పుట్టా సుధాకర్ యాదవ్ పోటీకి దిగారు. ఈయనకు సీనియర్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అండగా నిలిచారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు వాళ్ళ దోపిడీ అంశం కూడా తోడైనట్లు చెబుతున్నారు. ఇవన్నీ విరసి టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు కలిసొచ్చే అంశాలుగా అంచనా వేస్తున్నారు.

కమలాపురం సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ పి రవీంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనపై పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని అలిగిన మాజీ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి వైఎస్ఆర్సిపిలో చేరారు. గత ఎన్నికల్లో పోటీ చేయని ఆయన వైఎస్ఆర్‌సీపీకే మద్దతు ప్రకటించడం గమనార్హం.

అందరి దృష్టి "కడప" పైనే...

మొదటి నుంచి రాజకీయంగా కడపకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2024 ఎన్నికలకు ఈ పార్లమెంటు స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి నుంచి అధికార పార్టీ సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి పై ఆయన పెదనాన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల రెడ్డి పోటీ చేస్తూ ఉండడమే. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని నామమాత్రంగా పోటీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. సొంత అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో వైఎస్. షర్మిల రెడ్డి పోటీ చేయడం వల్ల క్రాస్ ఓటింగ్ ఆస్కారం లేకపోలేదనే భావన వ్యక్తం అవుతోంది.

అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా కడప, జమ్మలమడుగు, పులివెందల, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆ ప్రభావం వైయస్ షర్మిల కు ఉంటుందని అంచనా వేస్తున్నారు. "మీరు అభిమానించే.. మీరు ప్రేమించే.. మీ రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ వైఎస్. షర్మిల. ఆమె కడప అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆ బిడ్డను ఆశీర్వదించండి" అని కోరుతూ దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్. విజయమ్మ 24 గంటల క్రితం అమెరికా నుంచి విడుదల చేసిన వీడియో తీవ్రంగా వైరల్ అయింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొడుకు వైఎస్. జగన్ ఒకపక్క, కుమార్తె వైఎస్. షర్మిల మరోపక్క నిలిచారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉంటున్న షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్దకు విజయమ్మ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా విజయం విడుదల చేసిన వీడియో కడప జిల్లాలో వారి కుటుంబ అభిమానులను కదిలించిందని భావిస్తున్నారు. గతానికి భిన్నంగా వైఎస్ఆర్ కుటుంబంలో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దేవుని దయ, ప్రజల ఆశీర్వాదం. ఆయనకు, ఆ పార్టీకి ఎంత దక్కుతుంది అనేది వేచి చూడాలి.

Read More
Next Story