కళంకితులకు టీటీడీలో స్థానమా?  ఐదు ప్రశ్నలు సంధించిన జడ శ్రావణ్
x

కళంకితులకు టీటీడీలో స్థానమా? ఐదు ప్రశ్నలు సంధించిన జడ శ్రావణ్

ఆధ్యాత్మికత లేనివారిని సభ్యులుగా నియమించారు. వారిని మార్చే వరకు పోరాటం చేస్తానని జై భీమ్ పార్టీ నేత జడ శ్రావణ్ హెచ్చరించారు.


రాజకీయ నేతలతో టీటీడీని పునరావసరంగా మార్చివేశారు. ధర్మకర్తలి సభ్యుల నియామకం పేరుతో జంబో జట్టు ప్రకటించారని జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సభ్యుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు. శిక్షలకు గురైన కళంకితులే ఉన్నారని, వారిలో ఆధ్యాత్మిక కలిగిన వారు లేరని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధించారు.


"టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ప్రకటించిన జాబితా ఏ స్థాయిలో ఉందనేది సమాధానం చెప్పాలి" అని జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి పదవులు దక్కని వారికి, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారిని టీటీడీలో పాలకమండలి సభ్యులుగా ఎంపిక చేసి, పునరావాసం కల్పించినట్లే ఉందని ఆయన విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి 24 మంది సభ్యుల్లో ఆధ్యాత్మికత ఉన్నవాళ్లు, శ్రీవారి ప్రాముఖ్యతను కాపాడే వాళ్లు ఎవరున్నారన్నారో చెప్పాలని సీఎం ఎన్. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిలదీశారు.

మోసగాళ్లకు పదవులా?
టీటీడీ చైర్మన్ గా నియమితులైన టీవీ5 బీఆర్ నాయుడుపై చాలా ఆరోపణలు ఉన్నాయని జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. "సాక్షాలు లేవు కాబట్టి నేను ఆ విషయాలను మాట్లాడడం లేదు" అని ఆయన అన్నారు.
1. వ్యాపారాలు చేసిన వారు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. అయితే టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం దక్కించుకున్న నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, జ్యోతుల నెహ్రూపై ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయని జడ శ్రావణ్ కుమార్ గుర్తు చేశారు. ఇలాంటి వారికి ధార్మిక సంస్థలో పదవులు ఇవ్వడం వల్ల, స్వామివారి ఔన్నత్యాన్ని కాపాడినట్లా అని ఆయన ప్రశ్నించారు.
2. అతిథి దేశాయి తండ్రి కేతన్ దేశాయ్ కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొట్టాడనే విషయాన్ని మెడికల్ కౌన్సిల్ కూడా చెప్పిన విషయాన్ని జడ శ్రావణ్ కుమార్ గుర్తు చేశారు. ఇలా ఉంటే..
3. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెస్ రాజు పై 23 పెండింగ్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. రెండు కేసుల్లో శిక్ష కూడా పడిన ఎమ్మెల్యే రాజుకు శ్రీవారి సన్నిధిలో సేవ చేసే అర్హత ఉందా అని కూడా ఆయన నిలదీశారు.
4. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు ముని కోటేశ్వరరావు క్యారేజీలు మోశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు సీఎం కాగానే కోటేశ్వరరావుకు బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. క్యారేజీలు మోయటమే ఆయనకున్న అర్హతా అని ప్రశ్నించారు.
5. అలివేలు మంగమ్మపైనే జోకులా..?
తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు అలిమేలు మంగమ్మ. ఆ అమ్మవారి పైనే జోకులు వేసి వ్యంగ్యంగా మాట్లాడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత నర్సిరెడ్డికి బోర్డులో సభ్యత్వం కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అని జడ శ్రవణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. బూతులు మాట్లాడే వ్యక్తిని పాలక మండలిలో నియమిస్తే ఏ విధంగా పవిత్రత కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు శ్రీవారి ఔన్నత్యాన్ని కాపాడతారని జడ శ్రవణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పునరాలోచన చేయాలి..
టీడీపీ నాయకులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును నింపేశారు. "1987 దేవాదాయ చట్టానికి విరుద్ధంగా సభ్యుల నియామకం జరిగినట్లు స్పష్టంగా ఉంది. ఈ సభ్యుల నియామకంపై పునరాలోచన చేయాలి" అని జై భీమ్ పార్టీ నేత జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసి, పోరాటం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ధార్మిక సంస్థలో ఆ భావాలు, సేవాగుణం కలిగిన వారిని మాత్రమే సభ్యులుగా నియమిస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి శ్రావణ్ కుమార్ సూచన చేశారు.
Read More
Next Story