వైసీపీకి ఉత్తరం పోటు తగలబోతున్నదా?
x

వైసీపీకి 'ఉత్తరం పోటు' తగలబోతున్నదా?

రాష్ట్రంలో రాజకీయ భూకంపం సంభవించే అవకాశం కనిపిస్తోంది. ఇది వైసీపీ పునాదులు కదిలించేలా ఉంది. పార్టీ మారాలనే రాజ్యసభ సభ్యుల నిర్ణయాల నేపథ్యంలో భారీ షాక్ తప్పేలా లేదు.


జగన్‌ తన తల్లిని చెల్లిని వదిలేశారు. జనం ఆయన్న వదిలేశారు. ఇప్పుడు ఆయనతో ఉన్న కొద్దిమంది రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కూడా భవిష్యత్‌ కోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన కేసుల పార్టనర్‌ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఏ2 విజయసాయి బీజేపీలో చేరేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 11 మంది రాజ్యసభ ఎంపీల్లో బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి మినహా.. ఏ ఒక్కరూ జగన్‌తో మిగిలేలా లేరు.


శాసనమండలిలో 40 మంది సభ్యులు టీడీపీలో చేరాలా? లేక బొత్స నాయకత్వంలో తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలా? అని ఆలోచన చేస్తున్నారని సమాచారం. 11 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఏడుగురు కూడా బొత్స నాయకత్వంలో ప్రత్యేక జట్టు కట్టాలని చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదే జరిగితే వైఎస్ఆర్ సీపీ బొత్స పరమవుతుందనే విశ్వసనీయంగా తెలిసింది. అంటే "టీడీపీ ఆగష్టు సంక్షోెభం తరహాలో వైసీపీలో పుననావృతం అవుతుందా?" అనేది వేచిచూడాలి. తాజా రాజకీయ ఎపీసోెడ్ లో జగన్‌ ఒంటరి కాబోతున్నాడనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ.
గత ఐదేళ్లు వైఎస్. జగన్‌ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న బడుగు, బలహీన వర్గాలవారు షర్మిల నాయకత్వం కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే ఆమె కాంగ్రెస్‌లో ఉండటం, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవడంతో బొత్స, షర్మిల జాయింట్‌గా వైఎస్ఆర్ సీపీ బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేస్తారా? లేక వైఎస్. జగన్‌ను తప్పించి మిగిలిన నేతలంతా పార్టీని బతికించుకుంటారా? అన్నదే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో విస్తృత చర్చగా మారింది. ఏదిఏమైనా కొద్ది రోజుల్లో వైసీపీలో భూకంపం రాబోతోందనేది సుస్పష్టంగా ఉంది.

రాజ్యసభలో ఖాళీ..?


వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో పది మంది ఎన్డీఏ కూటమిలోకి వెళ్లడానికి పెట్టేబేడ సర్దుకుంటున్నారు. కొందరు బీజేపీ, ఇంకొందరు జనసేనలోకి చేరడానికి సన్నద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీని వెనుక వ్యూహం ఏమిటి? అనేది చర్చకు వచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలా మందికి వ్యాపారాలు ప్రధానమైనవి. వారిలో కొందరు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇంకొందరికి కాంట్రాక్టు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కొందరు విజిలెన్స్ విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు. దీంతో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి నుంచి రక్షణ పొందాలంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో తమ అవసరాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి కూడా వారిని కాదనలేని స్థితి. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి వారికి సంఖ్యా బలం కూడా అవసరం. దీనిని అవకాశంగా తీసుకున్న వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు పార్టీలు మారడానికి సిద్ధం అయ్యారనే చర్చ జరుగుతోంది. పార్టీ మారాలని భావిస్తున్న వారిలో మాజీ సీఎం వైఎస్ జగన్ అంతరంగీకుల్లో మోపిదేవి వెంకటరమణ ప్రధాన వారిలో ఒకరు. నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.

పరస్పర అవసరం


రాజ్యసభలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి సంఖ్యా బలం అవసరం. ఇది కాస్తా, ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ సభ్యులకు కూడా కలిసొచ్చింది. బిల్లులు పాస్ చేయించడంలో కీలకమైన వైసీపీ సభ్యులను చేర్చుకోవడం ద్వారా తమ ఆధిపత్యానికి ఢోకా లేకుండా చేసుకోవాలనే బీజేపీకి ఇదొక మంచి అవకాశంగా కలిసొచ్చింది. దీనిని తమ వ్యాపార కలాపాలు, కేసుల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుందనే భావన, దీనికి వైసీపీ అధ్యక్షుడి మౌనం గ్రీన్ సిగ్నల్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ నుంచి 97 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ కు 29, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 13 స్థానాలు ఉండగా, ఆ తరువాత 11 మంది సభ్యులతో వైఎస్ఆర్ సీపీ నాల్గవ పెద్ద పార్టీకి అవతరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి మొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
అంతరంగీకులు కూడా సైలెంట్
ఇటీవల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా తమ అంతరంగీకులైన రాయచోటి మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారనే వార్తలపై వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కూడా తన విదేశీ పర్యటనకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఆయన కూడా ఈ ఎపిసోడ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు." పోయే వారు పోతారు. ఉండే వారు ఉంటారు" అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో తన సభ్యులు సురక్షితమైన పార్టీలోకి వెళ్లడం వల్ల తనకు కూడా మేలు జరుగుతుందేనే ఆలోచనతోనే ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

10 మంది ఎంపీల రాజీనామా..?
ఏపీలో వైసీపీకి గట్టి దెబ్బ తగలబోతోంది. త్వరలో వైసీపీ రాజ్యసభ ఖాళీ కాబోతుంది. 11 మంది వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో 10 మంది పార్టీని వీడనున్నట్లు సమాచారం. టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేన పార్టీలోకి ఇద్దరు చేరనున్నారు. అనే వార్తలు తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నాయి. వారిలో..

టీడీపీ: మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, బీద మస్తాన్ రావు వెళతారని ప్రచారం సాగుతోంది. వారికి లైన్ కూడా క్లియర్ అయినట్లు సమాచారం.
మోపిదేవి వెంకటరమణ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ తో పాటు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. జైలుకు కూడా వెళ్లివచ్చారు. పార్టీని ప్రధానంగా వైఎస్ జగన్ కు ఆయన దూరం కాలేదు. ఆ గౌరవం, అభిమానంతోనే మోపిదేవికి రాజ్యజభ సభ్యుడిని చేశారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళతాkనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ఏమిటనేది కాలం, మోపిదేని మాత్రమే సమాధానం చెప్పాలి.
బీద మస్తాన్ రావు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత. బోగోలు మండల జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. కావలి సెగ్మెంట్ నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2104 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన బీద మస్తాన్ రావు 2019లో నెల్లూరు ఎంపీగా కూడా ఓటమి చెందారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమని ప్రకటించినా, 2022లో వైఎస్ఆర్ సీపీలో చేరి, రాజ్యసభ సభ్యుడి ఛాన్స్ కొట్టేశారు. ఆయనకు విశాఖ నుంచి నెల్లూరు వరకు ఆక్వా వ్యాపారం ఉండడం, గోదావరి జిల్లాల్లో చేపల చెరువులతో పాటు, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, ఈ ఉత్పత్తులకు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా, మళ్లీ టీడీపీలోకి చేరడం ద్వారా సేదదీరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా,
బీజేపీ: మేడా రఘునాథెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలానికి చెందిన మేడా రఘునాథరెడ్డి వైఎస్ఆర్ సీపీలో కీలకపాత్ర కాంట్రాక్టు నిర్మాణ రంగంలో "మేడా కన్ స్ట్రక్షన్ కంపెనీ" పేరెన్నికగన్న సంస్థ. ఆయన సోదరుడు 2014 లో రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించారు. అదే సమయంలో ఆయన తండ్రి టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మేడా మల్లికార్జునరెడ్డి తన మద్దతుదారులను టీడీపీలోకి పంపించారు. తాను మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అంతకుముందే రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డి మాత్రం వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి విజయంలో కీలకంగా వ్యవహరించారు. వారికి ఉన్న కాంట్రాక్టు పనుల నేపథ్యంలో వ్యాపారపరంగా ఇబ్బంది లేకుండా, బీజేపీలోకి వెళ్లడానికి దారులు వెదుక్కుంటున్నట్లు వాతావరణం కనిపిస్తోంది.
జనసేన: దివంగత సీఎం వైఎస్ఆర్ కాలం నుంచి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ కుటుంబం వెంట నడిచారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయనకు వైసీపీలో వైస్. జగన్ రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. అదే కోవలో బీసీల ఓట్ల కోసం తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను కూడా పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహారం పక్కకు ఉంచితే, ఆర్. కృష్ణయ్య జనసేనలోకి వెళ్లాలనే ఉద్దేశం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతుచిక్కని విషయంగా చెప్పవచ్చు.
తెలిసే మౌనంగా...
తన పార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారనున్నారనే వార్తలపై వైఎస్ జగన్ ఎక్కడా స్పందించని తీరు వెనుక కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులు, విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సురక్షితమైన నీడకు వెళ్లడానికి ఆయన సుముఖంగా ఉన్నట్లే కనిపిస్తోంది. తన మనుషులు రెండు పార్టీల్లో ఉండడం వల్ల తనకు కూడా రక్షణ ఉంటుందనే భావనలో వైఎస్. జగన్ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సీన్ రిపీట్
2019 జూన్ 20

ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. దీంతో అప్పటికే రాజ్యసభలో టీడీపీ సభ్యులుగా ఉన్న వైఎస్. చౌదరి (సుజనా చౌదరి), కడపకు చెందిన సీఎం. రమేష్, కర్నూలు నుంచి నామినేట్ అయిన టీజీ. వెంకటేష్ గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. ఈడీ, ఐటీ దాడుల నుంచి రక్షణ కోసం వారు పార్టీ మారారు. అనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కాగా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పీ. నడ్డాతో కలిసి వారు టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని ఎం. వెంకయ్య నాయుడుకు స్వయంగా లేఖ అందించారు. ఆ తరువాత టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకుంటున్నాం అని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఉపరాష్ట్రపతికి లేఖ కూడా రాయడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలిసినవే.
2024 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సీఎం. రమేష్, సుజనా చౌదరి బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచారు. వారంతా సీఎం చంద్రబాబుతో ఎంత సఖ్యతతో ఉన్నారనే విషయం రాజకీయంగా కనీస అవగాహన ఉన్న వారందరికీ కూడా తెలిసిన బహిరంగ రహస్యం.
2024 ఆగష్టు : గతంలో టీడీపీ తరహాలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా స్వీయరక్షణ కోసం పార్టీలు మారడానికి దారులు వెదుక్కుంటున్నారు. ఇది ఒకరకంగా వైసీపీకి పెద్ద దెబ్బ అనడంలో సందేహం లేదు. ఢిల్లీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పెద్దల నుంచి కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు లేవు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story