రెవెన్యూ రికార్డుల దగ్ధం కుట్రే!
x

రెవెన్యూ రికార్డుల దగ్ధం కుట్రే!

మదనపల్లెలో రెవెన్యూ రికార్డులు దగ్ధం వెనుక కుట్ర ఉందా? ఇది షార్ట్ సర్క్యూట్ కాదా? ఘటనపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వలేదా? డీజీపీ, సీఐడీ చీఫ్ ఏమంటున్నారు?


రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక ఎవరి హస్తం ఉంది? అనే విషయంలో పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉందనే విషయంలో ప్రాథమికంగా నిర్ధారించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానీ సత్యప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసు సీఐడీకి ఇచ్చే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు డీజీపీ వెల్లడించారు. అర్ధరాత్రి వరకు కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగి కూడా పుంగనూరుకు చెందిన వ్యక్తి అని సమాచారం.

రికార్డుల దగ్ధం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు మాటలు స్పష్టం చేస్తున్నాయి. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆర్డీఓ, మదనపల్లె పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎందుకు సమాచారం ఇవ్వలేదనే విషయం కూడా మిష్టరీగా మారింది. పట్టణ అధికారుల తీరుపై డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలావుండగా..
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ భవనం బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినది కావడం గమనార్హం. అప్పటినుంచి ఇదే భవనంలో పరవపాలనా వ్యవహారాలు సాగిస్తున్నారు. రికార్డులకు భద్రత రీత్యా ఏమాత్రం సందేహాలు లేవు. భవనం పురాతనమైనది కావడంతో కొన్ని నెలల కిందట ఆధునీకరణ కూడా చేశారు. ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. కార్పొరేట్ కార్యాలయానికి తగినట్లు ఏర్పాట్లు కూడా ఉన్నాయి.


మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతకు ఒక అరగంట కిందటి వరకు నిమ్మనపల్లె మండలం వీఆర్ఏ రమణయ్య రొటేషన్ పద్ధతిలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నైట్ వాచ్ మన్ గా ఉన్నారు. కార్యాలయం లోపల సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మరొకరు ఆదివారం అయినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ఉన్నారని వీఆర్ఏ రమణయ్య చెప్పారు. తాను నిద్రలో ఉండగానే, తనకు చెప్పకుండా వారు వెళ్లిపోయారని ఆయన అంటున్నారు.

"కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూస్తే నిప్పురవ్వలు రావడం గమనించి, వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ తపస్వినికి సమాచారం ఇచ్చాను" అని రమణయ్య చెప్పారు. ఆమె ద్వారా సమాచారం అందుకున్న ఆర్డీఓ క్యాంప్ క్లర్క్ మనీ అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. అదే సమయంలో మిగతా కార్యాలయ సిబ్బంది కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటసేపు పోరాడి మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయానికి ఈ సంఘటన వెలుగులోకి వచ్చి సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో కొందరి పాత్ర పై సందేహాలు, జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.


ఏ రికార్డులు దగ్ధమయ్యాయి
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. అందులో ప్రధానంగా 22/1ఏ కు సంబంధించిన నిషేధిత చుక్కల భూములు, ల్యాండ్ కన్వర్షన్ ఫైల్స్, కోర్టు లిటిగేషన్ ఉన్న కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. సాధారణంగా టేబుల్స్ పై ఉన్న పత్రాలే కాకుండా కంప్యూటర్లు రేట్లలో ఉంచిన ఫైలు కూడా దగ్ధం కావడం వెనక ఏమి జరిగిందనేది సర్వత్ర సందేహాలకు కారణమైంది. ప్రభుత్వ ఆధీనంలోని నిషేధిత భూముల రికార్డులు ఇందులో ఉన్నాయి.
సీఎం సీరియస్
ఇటీవల అమరావతికి సమీపంలో కొన్ని రికార్డులు దగ్ధం చేస్తూ కొందరు పట్టబడడం. పుంగనూరు ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన అధికారులు కూడా కొన్ని దహనం చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు కాలిపోవడం తో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు సీఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లి వెళ్ళాలని ఆదేశించారు. అప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ రాజకుమార్ మదనపల్లికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయడానికి పరిశీలన చేశారు. అందులో షార్ట్ సర్క్యూట్ జరిగిందా? ఆ.. ఆధారాల కోసం టీం రంగంలోకి దిగింది.
1. ఈ పరిస్థితికి ఆస్కారం లేదనేది కార్యాలయ వర్గాల నుంచి అందిన సమాచారం. నెలల కిందటే, సుమారు రు. 1.50 కోట్లతో బ్రిటిషర్ల కాలంనాటి పురాతన ఈ భవనాన్ని ఆధునీకరణ చేయడంతో పాటు, ఎలక్ట్రికల్ వైరింగ్ లో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతనే వాడినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్క్యూట్ జరగడానికి ఆస్కారం లేదనేది నిపుణుల మాట.
2. కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ అర్ధరాత్రి వరకు ఏమి పనులు చేస్తూ ఉన్నారు?
3. సమాచారం తెలియగానే అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎం దుకు విషయం తెలపలేదు?
4. ఈ ఘటన తెలిసిన వెంటనే డీఎస్పీ, సీఐలు కూడా ఆ జిల్లా ఎస్పీకి చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?
5. అర్ధరాత్రి వరకు పుంగనూరుకు చెందిన వ్యక్తి అని సమాచారం. ఇందులో ఆయన ప్రమేయం? ఎవరి సహకారం తీసుకున్నారు? తెరవెనుక పాత్రధారులు ఎవరు?

షార్ట్ సర్క్యూట్ విషయంలో స్పష్టత వచ్చినట్లు తెలిసింది. "ఈ విషయంపై ట్రాన్స్ కో అధికారుల నుంచి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు నివేదిక కోరారు. పరిశీలించిన అధికారులు కూడా ఇది షార్ట్ సర్క్యూట్ కాదని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది" మిగతా అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.



కుట్ర కోణమే: డీజీపీ
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన రికార్డులు దగ్ధమైన గదిని డీజీపీ ద్వారకా తిరుమల రావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ,
" రికార్డుల దగ్ధం వెనుక ప్రమాదం కాదు. ఇన్సిడెంట్ అనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. 22 ఏ భూముల రికార్డులను గదిలో జరిగిన ఘటన తెలిసిన వెంటనే ఆర్డీవో కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ డిఎస్పి లకు సమాచారం ఇవ్వకపోవడం పై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
" ఈ సంఘటనలో రెవెన్యూ పోలీస్ ఉన్నతాధికారుల అలసత్వం ఉంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదు. అని తేల్చివేశారు. ఇక్కడ ఓల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెప్పారు ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని బిజెపి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధమైన గదికి కిటికీ వెలుపల అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైలు కాలిపోయాయి. ఇవన్నీ మరింత అనుమానాలను పెంచాయి. అని డీజీపీ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి పది బృందాలను ఏర్పాటు చేశాం. ఈ కేసు సిఐడికి బదిలీ చేసే అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.


సబ్ కలెక్టర్ కార్యాలయంలో రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైనట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇందులో 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. ఈ 25 అంశాల్లో చుక్కల భూములు నిషేధిత భూములు ఉన్నట్లు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.కాలిపోయిన ఫైలు గుర్తించేందుకు మా రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కాకుంటే జరిగిన సంఘటన నేపథ్యం చేర్చడానికి పోలీసుల దర్యాప్తులో వెల్లడి అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
సమాచారం ఉంది: రెవెన్యూ మంత్రి

"మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం వెనుక ప్రాధమిక సమాచారం సిద్ధంగా ఉంది" అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వారం కిందట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరుతో ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేశారు. పెద్దిరెడ్డి తన బినామీలకు ఇచ్చిన986 ఎకరాల అసైన్డ్ భూములు రద్దు చేయబోతున్నాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. "కీలక ఫైళ్లు 90 శాతం కంప్యూటర్లలోనే ఉన్నాయి. దగ్ధమైన ఫైళ్లను రిట్రీవ్ చేస్తాం" అని స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగి గౌతం తేజ అంతరాత్రి వరకు ఎందుకు ఉన్నారనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు. దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా, వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం అయిన ఘటనలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ తోపాటు కొందరు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. గూగుల్ సెర్చ్ ద్వారా దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసును సీఐడీకి అప్పగించే అవకాశం ఉంది. వారి దర్యాప్తులో ఏమి తేలుతుందని వేచి చూడాలి.
Read More
Next Story