
కుప్పానికి పారుతున్నది కృష్ణా జలాలా? వరద నీళ్లా?
నికరజలాలు ఇవ్కకపోతే కుప్పం దాహం తీరదంటున్న సీమ నేతలు.
హంద్రీ నీవా కాలువలో పారుతున్న నీటి వల్ల చిత్తూరు జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాలువకు 60 టీఎంసీల నికర జలాలు కేటాయించకుండా శాశ్వత పరిష్కారం దక్కదనేది రైతు సంఘాల నేతల అభిప్రాయం. ప్రస్తుతం ప్రవహిస్తున్న వరదనీటి వల్ల ప్రయోజనం ఉండదని రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.
రాయలసీమలో అతి తక్కువ వర్ష పాతం ఉండే జిల్లాల్లో ఈ నీళ్లతోనే ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయని టీడీపీ నేతలు అంటున్నారు.
"కుప్పం వరకు కృష్ణా జలాలు చేరడం వల్ల లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది తీరుతుంది" అని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెబుతున్నారు.
హెచ్ఎన్ఎస్ఎస్ కు ప్రాధాన్యం
హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్‌లో ఎలాగైనా నీరు ఇవ్వాలనే లక్ష్యంతో వంద రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు.
హంద్రీ-నీవా కాలువ నీటితో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అలాగే కరువు ప్రాంతంలో 33 లక్షల మందికి తాగునీరు అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కృష్ణా జలాలు కాలువ ద్వారా కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకింది. 10 రిజర్వాయర్లను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి... అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయని వెల్లడించింది. ఆ నీరు గాజులదిన్నెకు నీరు చేరిందని వివరించారు.
తాత్కాలిక ఆనందమే
కృష్ణా జలాలు కాలువల్లో పారించడం అనేది తాత్కాలిక ఆనందమే అని అనంతపురం జిల్లా రాయలసీమ జన సంఘం ప్రతినిధి, 100 టీఎంసీ రామాంజనేయులు స్పష్టం చేశారు. ఆయన ఏమంటున్నారంటే..
"హంద్రీ నీవా కాలువలో ప్రవహిస్తున్నది వరద జలాలు మాత్రమే. శాశ్వత కరువు నివారణ కోసం 60 టీఎంసీల నికరజలాలు కేటాయించాలి" అని 100 టీఎంసీ రామాంజనేయులు డిమాండ్ చేశారు. వర్షాల కురుస్తున్నందున నీరు వస్తోంది. ఆ వరద జలాలు తగ్గిపోతే పరిస్థితి మొదటికే వస్తుంది కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
"కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెంచామని చెప్పుకోవడానికే పనికి వస్తుంది. రోజుకు 11,500 క్యూసెక్కులు వదిలితే కానీ, సేద్యం, తాగునీటికి సాధ్యం కాదు" అని 100 టీఎంసీ రామాంజనేయులు స్పష్టం చేశారు.
చిత్తూరుకు కొరత తీరుతుందా?
హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా, ఆరు లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేయడం, కాలువలో నీరు ప్రవహించేలా చేయడం వల్ల జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సాగు బోర్లపైనే ఆధారపడి ఉంది. 565 కిలోమీటలర్ల దూరంలోని పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఏమంటున్నారంటే..
"ఇదీ అన్యాయంగా ఉంది. ఎగువ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యం కుదించారు. అనుసంధానం చేయాల్సిన చెరువులను కూడా కుదించారు" అని దరశథరామిరెడ్డి గుర్తు చేశారు. పత్తికొండ వద్ద ఉన్న పందికోన రిజర్వాయర్ స్థితిని ఆయన ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ రెండుసార్లు జాతికి అంకితం చేశారు. దీనిలో పరిధిలోని ఆయకట్టుకే సరిగా నీరు పారించలేకున్నారు అని గుర్తు చేశారు.
పరమ సముద్రానికి కృష్ణా జలాలు
కర్నూలు జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి గత నెల 17వ తేదీ నీటిని విడుదల చేశారు. 738 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పానికి చేరాయి. 215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కిలోమీటర్ల. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు, 110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 40 టిఎంసిల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. కాలువ పరీవాహక ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెంచడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. దీనివల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
"రాయలసీమలో చెరువులు చాలా వరకు దుస్థితిలో ఉన్నాయి. కాలువలు లేని స్థితిలో చెరువులను కృష్ణా జలాలతో నింపడం సాధ్యం అవుతుందా?" అని అనంతపురం జిల్లాకు చెందిన 100 టీఎంసీ రామాంజనేయులు ధర్మ సందేహం వ్యక్తం చేశారు.
మొత్తానికి వరదనీటి ప్రవాహంతో హంద్రీనీవా కాలువలో కృష్ణా నీటి ప్రవాహం తాత్కాలిక ఆనందమే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ద్వారా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
Next Story