ESIC | 'కార్మికుల' రాజ్యానికి కాయకల్ప 'చికిత్స' సాధ్యమేనా?
ఈ ఆస్పత్రిని బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. రెండేళ్లుగా రెఫరల్ సేవలు లేవు. రాష్ట్ర క్యాబినెట్ అందించింది తీపికబురుగా అవుతుందా?
రాయలసీమలో కార్మికుల ప్రాంతీయ తిరుపతి కార్మిక రాజ్య బీమా సంస్థ (Employees State Insurance Corporation -ESIC) ఆస్పత్రిని బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు బీమా ఉన్న కార్మికులకు రెఫరల్ ద్వారా స్విమ్స్ ఆస్పత్రిలో అందించిన సేవలకు ఈఎస్ఐ రూ. 13 లక్షలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో..
తిరుపతి ఈఎస్ఐసీ ఆస్పత్రి 50 నుంచి వంద పడకల స్థాయికి పెంచడానికి రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, అందుబాటులోకి వచ్చే సేవలను పక్కకు ఉంచితే..
రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని 4.5 లక్షల మంది కార్మికులకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంగా తిరుపతి కేంద్రంగా ఈఎస్ఐసీ ఆస్పత్రిని 2018 కార్పొరేట్ స్థాయిలో 110 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించారు. వంద పడకల స్థాయికి పెంచాలనే ప్రతిపాదన ఆరేళ్ల తరువాత సాధ్యమైంది. మొదటి నుంచి ఈ ఆస్పత్రిలో వసతుల కొరత వల్ల తిరుపతిలోని స్విమ్స్ ( Sri Venkateswara Institute of Medical Sciences -SVIMS) తోపాటు సీరియస్ కేసులు ఓ ప్రయివేటు ఆస్పత్రికి, దంత వైద్యం కోసం మరో ప్రయివేటు ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం స్విమ్స్ సేవలు కూడా అందడం లేదు. ఈ స్థితిలో..
ఆస్పత్రి స్థాయి వంద పడకలకు
"కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 7.44 (7,44,08,373) కోట్ల రూపాయాలతో ఆధునిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు" అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు వెల్లడించారు. ఆ నిధుల్లో 6.51 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 93 లక్షలు జత చేస్తుంది" అని మంత్రి పార్ధసారధి ప్రకటించారు.
ఈ నిధులతో కొన్ని ఆధునిక వసతులు కల్పించడంతో పాటు 190 మంది డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియమానికి మార్గం ఏర్పడుతుంది" అని మంత్రి పార్ధసారధి వెల్లడించారు. ఇది కార్మికులకు ఆనందమే. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు సేవలు అందించడానికి వెసులుబాటు కలుగుతుంది.
సమస్యల జబ్జు..
తిరుపతి రీజనల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు కష్టంగా మారింది. ఖాళీలు భర్తీ చేయని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. మందుల సంగతి దేవుడెరుగు, ఇక్కడికి వెళ్లిన రోగులకు రక్తపరీక్షలు చేయించుకోవాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఉదయం వెళితే మధ్యాహ్నం భోజనం తరువాత కానీ, ఆస్పత్రి నుంచి బయటికి రావడం కష్టమే. రోగులకు సేవలు అందించడంలో వైద్యులతో ఇబ్బంది లేదు. సరిపడ సిబ్బంది, వివిధ విభాగాలకు నిపుణులు లేకపోవడం, ఉన్నా, సదుపాయల కొరత వల్ల కార్మికులకు వైద్య సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆ దిశగా తీసుకున్న చర్యలు కూడా తక్కువే అనడంలో సందేహం లేదు. ఇవేమీ పట్టనట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇదిలావుంటే...
కొన్ని వసతులు ఉన్నా...
2018లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని 4.5 లక్షల మంది వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రిలో సర్జరీలకు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వైద్య పరికరాలు కూడా కొంతవరకు అందుబాటులో ఉన్నాయి. 11 మంది సివిల్ సర్జన్లు, అసిస్టెంట్ జర్జన్లు 17 మంది పోస్టులతో ఆ ఆస్పత్రి పనిచేయాలి. స్టాఫ్ నర్సుల్లో 30 పోస్టులు ఉంటే, అందులో 24 మంది పర్మినెంట్, ఆరుగురు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కాగా, గత ఏడాది అనేకమందిని ఇక్కటి నుంచి బదిలీ చేయడం, వారి స్థానంలో కొత్త వారిని నియమించడంలో జరిగిన జాప్యం వల్ల ఆస్పత్రిలో సేవలు కష్టం అయ్యాయి. 63 మంది పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. పారిశుద్ధ్యంతో పాటు అన్ని రకాల సేవలకు వారినే వినియోగించుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా,
2017 లో తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి ఓ రికార్డు నమోదు చేసుకుంది. ఇన్జార్జి సూపరింటెండెంగ్ గా డాక్టర్ అబ్దుల్ మజీద్ పనిచేసిన కాలంలోనే ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యాంబాబు 99 మేజర్ శస్త్రచికిత్సలు చేశారు. "ఇది రికార్డు స్థాయి వైద్య సేవ" అని డాక్టర్ అబ్దుల్ మజీద్ వ్యాఖ్యానించారు.
కార్మికులతో చెలగాటం..
ఈఎస్ఐ ఆస్పత్రిలో చిన్న వ్యాధులకు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. రక్తం,మలం, మూత్రం వంటి పరీక్షలు చేస్తుంటారు. ఆ ల్యాబ్లో ముగ్గురు మాత్రమే విధుల్లో ఉంటారు. ప్రాథిమిక రోగ నిర్థారణ పరీక్షలు, సేవలు మినహా, ఆస్పత్రిలో ఇతర సేవలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇక పెద్ద పరీక్షలైతే బయటి ల్యాబ్ లకు వెళ్లాల్సిందే.
ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవలకు వచ్చే ఐపీ కార్మికులు ( Insured Person's - IP ) తమ కోరిన ఆస్పత్రికి వెళ్లి (REFERAL ) ద్వారా చికిత్స చేయించుకునే వెసులుబాటు ఉంది. ఒక రెఫరల్ పత్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఆ లేఖ ద్వారా రెఫరల్ ఆస్పత్రిలో సమర్పించి, వైద్య సేవలు, సర్జీలు చేయించుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ సిటీ స్కాన్ (CT Scan ), ఎంఆర్ ఐ ( MRI Scan) స్కానింగ్ అందుబాటులో లేకపోవడం కూడా కార్మికులకు శాపంగా మారిందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో..
ఈఎస్ఐ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరిచిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యాంబాబు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ నెలలో బాధ్యతలు తీసుకున్నానని డాక్టర్ శ్యాంబాబు చెప్పారు. "బదిలీల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. డైరెక్టర్ తో మాట్లాడి స్టాఫ్ ను డిప్యూటేషన్పై" నియమించుకునేందుకు చర్యలు తీసుకున్నా" అని డాక్టర్ శ్యాంబాబు వివరించారు.
ఆస్పత్రుల మధ్య ప్రతిస్టంభన
మెరుగైన వైద్య సేవల కోసం కార్మికులను తిరుపతి స్విమ్స్ కు రెఫర్ చేసేవారు. 2022 నుంచి ఆ సేవలు అందక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈఎస్ఐ రెఫరల్ ద్వారా చికిత్స చేయించుకున్న కార్మికులు, వారి కుటుంబీలకు సంబంధించి రూ.13 లక్షలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి తోడు స్విమ్స్ ఆస్పత్రిలో వివిధ పరీక్షలు, శస్ర్త చికిత్సలు చేయడానికి ఫీజుల ధరలు పెంచడం ఓ కారణం. అంతేకాకుండా, ఈఎస్ఐతో స్విమ్స్ ఎంఓయు కాలపరిమితి తీరడం కూడా ఓ కారణంగా మారింది. ప్రయివేటు ఆస్పత్రులతో పోలిస్తే స్విమ్స్ లో 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కంటే 25 శాతం అధికంగా ఉన్న ఈఎస్ఐ కొర్పొరేషన్ సొంత టారిఫ్ మధ్య రెండు ఆస్పత్రుల మధ్య వ్యత్యాసాలు రావడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. స్విమ్స్ తన టారిఫ్ కు అంగీకారం చెబుతూ, ఎంఓయూ కుదుర్చుకోవాలనే లేఖకు ఈఎస్ఐసీకి స్పందన లేదని చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.వి. కుమార్ ను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో పలకరించారు.
"సవరించిన ధరలకు అనుగుణంగా ఫీజులు చెల్లించడానికి ఈఎస్ఐ ముందుకు రాలేదు. నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేయమని ఈఎస్ఐ నుంచి సమాధానం వచ్చింది" అని ప్రొఫెసర్ ఆర్వి. కుమార్ చెప్పారు. "కార్మికుల ఆరోగ్యం, వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని పాత పద్ధతిలోనే సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆయన సుముఖత తెలిపారు.
రెఫరల్ లేని కారణంగా, డయాలసిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ తో పాటు దీర్ఘకాలిక చికిత్స కోసం నెల్లూరు, బెంగళూరు వంటి పొరుగు ప్రాంతాలకు వెళ్లడానికి ఈఎస్ఐలో సభ్యత్వం ఉన్న కార్మికులు, వారి కుటుంబీకులు ఇబ్బంది పడుతున్నారు.
దీనిపై ఈఎస్ఐ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ, "నేను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ( Hospital Development Committee ) సమావేశం నిర్వహించాం. ఇందులో రెఫరల్ చేయడంపై కూడా తీర్మానం చేశాం" అని డాక్టర్ శ్యాంబాబు వివరించారు. కొన్ని సాంకేతిక అంశాలపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఒక్కొక్కటిగా చక్కదిద్దితున్నా. సిబ్బందిని కూడా నియమించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటన్నా" అని స్పష్టం చేశారు. అనారోగ్యంతో వచ్చే కార్మికులు, వారి కుటుంబీకులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ డైరెక్టర్ తో స్వయంగా కలసి మాట్లాడనున్నట్లు ఆయన వివరించారు. తద్వారా "అన్ని సమస్యలు పరిష్కరించి, బీమా ఉన్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తా" అని డాక్టర్ శ్యాంబాబు స్పష్టం చేశారు.
Next Story