తిరగబడిన అనంత టమాటా రైతులు
x

తిరగబడిన అనంత టమాటా రైతులు

ప్రైవేటు మండీల దోపిదీ. లారీ యజమానుల అడ్డంకులు. సహనం నశించిన రైతులు తిరగబడ్డారు. బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏమి చేస్తోంది.





అనంతపురం జిల్లా కరువు గడ్డ. ఇక్కడ నీటిని పొదుపుగా వాడుతున్నారు. అష్టకష్టాలు పడే రైతులు టమాటా సాగు చేస్తున్నారు. వారికి అనంతరం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లేదు. ప్రైవేటు స్థలంలో 15 ఏళ్లుగా మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఇక్కడ ప్రైవేటు మార్కెట్లో టమోటా రైతులు ధరలు లేక నష్టపోతున్నారు. దీనికి తోడు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఇక్కడ లారీ యజమానుల సంక్షేమ సంఘం దోపిడీ చేస్తోంది. బయటి లారీలను అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. వారి నుంచి ముక్కుపిండి లారీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట రూ. 500 వసూలు చేస్తున్నారు. ఆ మొత్తం చెల్లించిన ప్పటికీ ప్రైవేటు టమాటా మార్కెట్ నుంచి సరుకు తీసుకు వెళ్ళేందుకు తమ వాహనాలనే వాడాలని పీటముడి వేస్తున్నారు. పొలాల వద్దకు తమ లారీలే తీసుకువెళ్లాలని, అందుకు రూ. 5000 వేలు చెల్లించాల్సిందేనని ఫిట్టింగ్ పెడుతున్నారు. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితులతో మూడు రోజులుగా భరించిన రైతులు సహనం నశించి, సోమవారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధం చేశారు.


అనంతపురం జిల్లాలో వర్షాధారంతో వేరుశనగ పంట సాగు చేయడం అలవాటు. ప్రకృతి కరుణించి వర్షాలు కురిస్తే పరవాలేదు. లేదంటే పెట్టుబడి సేద్యం ఖర్చులు నష్టపోవాల్సిందే. కొన్ని దశాబ్దాల కాలంగా ఇదే వ్యవహారం సాగుతోంది. అసలే కరువు ప్రాంతం. భూగర్భ జలాలు అడుగంటాయి. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ దిశగా ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆలోచించేసిన రైతులు ఉన్న కొద్దిపాటి నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వినియోగించుకుని బాగుపడాలని తలంచారు. ఇందుకోసం అనంతపురం జిల్లాలో టమాటా పంట సాగుకు మొగ్గు చూపారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతాల్లో 40 వేల ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు ప్రకటనతో ..
2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్. చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో దిగుబడి కూడా బాగానే ఉంది. దీంతో అంతకుముందే నుంచే అనంతపురం రూరల్ మండలంలో అంటే రాప్తాడు నియోజకవర్గంలోని కక్కనపల్లి వద్ద టమాటా ప్రైవేట్ మార్కెట్ ఏర్పాటు చేశారు. రైతులు ఇక్కడికి టమోటాలు తీసుకువచ్చి విక్రయించేవారు. మెల్లగా ఇక్కడి ప్రైవేట్ మార్కెట్లో 25 దుకాణాలు వెలిశాయి. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ మండీలు తెరిచారు. బహిరంగ వేలం ద్వారా టమాటాలను కొనుగోలు ప్రారంభించారు. ఇంతవరకు సక్రమంగానే ఉంది.
రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ఆ తర్వాత స్థానం కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ఉంది. వీటి తర్వాత కర్నూలు జిల్లా డోన్ టమాట మార్కెట్ కూడా మంచి గుర్తింపు ఉంది. ఇవన్నీ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.

మార్కెటింగ్ శాఖకు తమాషా
అనంతపురం జిల్లాలో పంటల మార్పిడికి రైతులను చైతన్యం చేసిన వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో వైఫల్యం చెందారు. దీంతో కర్ణాటక రాష్ట్రం కోలారు, తమిళనాడు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టమాటా వ్యాపారులు దాదాపు 15 ఏళ్ల కిందట ఇక్కడ ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారాలు మండీలు విస్తరించారు.
అనంతపురంలో ప్రైవేటు వ్యక్తులు మార్కెట్ నిర్వహిస్తున్న ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మినహా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటులో చొరవ తీసుకోవడం లేదు. రాప్తాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కరణం రాంప్రసాద్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడారు.
"వ్యవసాయ మార్కెట్ కమిటీకి స్థలం సమస్యగా మారింది. అందువల్లే ఎక్కడా షెడ్లు కూడా లేవు. అని రాప్తాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కరణం రాంప్రసాద్ తెలిపారు. "అందుబాటులో ప్రభుత్వ స్థలం లేదు" అని ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపామని ఆయన తెలిపారు. స్థలం కోసం చూస్తున్నట్లు ఆయన చెప్పారు.
వారు నిర్ణయించిందే ధర

ఇక్కడ ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారింది. దీంతో టమాటాల కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతా చేసి, పల్లెల నుంచి టమాటా క్రేట్లు మార్కెట్కు తీసుకువస్తే కేజీకి రూ. 10 కూడా గిట్టుబాడు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తడవుగా గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేత మూడు మండల ఏర్పాటుతో పాటు పెట్రోల్ బంకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మండీలతో పాటు ఇంధన వ్యాపారం కూడా సవ్యంగా సాగుతోంది. లారీ వెల్పేర్ అసోసియేషియన్కు ఆయన మద్దతు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.


"సంవత్సరాల కాలంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను అనుమతించడం లేదు. దీంతో రైతులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు" అని చంద్రశేఖరరెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ కు చెప్పారు. "వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు లేకపోవడం వల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు" అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు.


తిరగబడిన రైతులు
అనంతరం రూరల్ లోని కక్కనపల్లె మార్కెట్ కు సోమవారం యధావిధి గానే ఆయా ప్రాంతాల్లోని రైతులు టమాటాలు తీసుకొని వచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలతో వచ్చిన వారితో పాటు రైతుల సరుకును కూడా ఆ లారీలను స్థానిక లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అనుమతించలేదు. అప్పటికే మార్కెట్లో ఉన్న టమాటాలను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయలేదు. లారీ అసోసియన్ ప్రతినిధులకు నిర్ణయించిన రూ. 500 చెల్లించడానికి సిద్ధపడిన వారు కనికరించలేదు. టమోటాలు కొనుగోలు చేయడానికి వ్యాపారులు సుముఖత చూపకపోవడంతో సహనం నశించిన రైతులు బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రైవేటు మండలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కొంతమంది రైతులు పల్లెల నుంచి తీసుకువచ్చిన టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న అనంతపురం పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆగ్రహంతో ఉన్న రైతులను శాంతింప చేయడానికి విఫలయత్నం చేశారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు విశ్రమించబోయేది లేదని రైతులు తెగేసి చెప్పారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.


"పొలంలో టమాట కోత కోయడానికి కూలీకి రూ. 500, వాహనంలో తీసుకుని రావడానికి బాక్స్ కు రూ.15, మార్కెట్ వద్ద అన్ లోడ్ చేయడానికి రూ. రెండు చెల్లించాలి. ఇవన్నీ పోంగా.. రైతుకు ఒకబాక్స్కు రూ. 100 కూడా మిగలని పరిస్థితి" అని సీపీఎం అనుబంధ రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి వివరించారు.
రైతుల సమస్యలపై మాట్లాడాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సత్యనారాయణ చౌదరికి ఫోన్ చేస్తే, "రాష్ట్ర డైరెక్టర్ రావడంతో బిజీగా ఉన్నా తరువాత కాల్ చేయండి" అని సూచించారు. రైతుల సమస్యలు పట్టించుకోని అధికారులు, కాలయాపన చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
Read More
Next Story